నా ప్రియ స్నేహితులారా, ఈరోజు, మిమ్మును చూడడము నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. యేసులో మనకు నిరీక్షణ ఉన్నది. ఆయన మన జీవితములో ఆరంభించిన మంచి కార్యములన్నియు కూడా సంపూర్ణము చేయనై యున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఎఫెసీయులకు 2:20వ వచనమును మన కొరకు తీసుకొనబడియున్నది. ఆ వచనము, "క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాది మీద మీరు కట్టబడియున్నారు'' ప్రకారం మనకు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఉన్నాడు. ప్రత్యేకంగా సౌందర్యవంతమైన మూలరాతి మీద మనము నిర్మాణము చేయబడుచున్నాము. కనుకనే, దిగులుపడకండి.

నా ప్రియులారా, ఆ దినములలో మొదటిగా గృహములు నిర్మాణము చేసినప్పుడు, ఇల్లు నిలబడేది ఈ మూలరాతియైన ఆ పునాది మీదనే. అది చాలా బలంగాను మరియు స్థిరంగాను కూడా ఉంటుంది. "నేను మీ గృహమును నిర్మాణము చేయుటకు మూలరాయిగా ఉండెదను'' అని యేసు సెలవిచ్చుచున్నాడు. మన గృహము యొక్క పునాది అపొస్తలులు మరియు ప్రవక్తల యొక్క విత్తనం మీద ఆలాగున నిర్మాణముపై నిలబడుతుంది. ప్రవక్తలు మరియు అపొస్తలుల ఆధ్యాత్మిక విత్తనాల ద్వారా మన జీవితాల పునాది నిర్మించబడిందని కూడా ఈ వాగ్దానం మనకు గుర్తుచేస్తుంది. వారు విత్తినది మన జీవితములో గొప్ప పంటకు కారణము. మనము క్రీస్తు ద్వారా స్వీకరించినవన్నియు కూడా మన కుటుంబములోనికి ప్రవాహముగా వస్తాయి. వారి విశ్వసనీయత మరియు బోధలు పునాది వేసాయి మరియు వారు విత్తడం వలన మన జీవితాలలో గొప్ప పంటను నేడు ఇచ్చుచున్నది. హల్లెలూయా!

నా ప్రియులారా, మరింత ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, క్రీస్తు యేసులో ఉన్న అన్ని ఆశీర్వాదాలను మనం పొందుకుంటాము. ఇంకను ఆయన శాంతి, సమాధానము, ఆయన అనుగ్రహం మరియు అభిషేకం మన కుటుంబంలోకి సమృద్ధిగా ప్రవహిస్తాయి. ఎందుకంటే, మనము ఆయనను మూలరాయిగా చేసుకొనియున్నాము. ఆయనలో ఉన్న శాంతి అంతయు, ఆయనలో ఉన్న ఆశీర్వాదములన్నియు మరియు దేవుడు యేసు ద్వారా మనకు ఇవ్వాలని కోరుచున్న అభిషేకమంతయు కూడా, అవి మన జీవితములో ఉన్న ప్రతి శాపాన్ని బ్రద్ధలు చేస్తాయి. మన కుటుంబ సభ్యులు ఆ రీతిగా నింపబడి, క్రీస్తు యేసునందున్న ఐశ్వర్యమును బట్టి, ఆయనలో ఉన్న జ్ఞానమును బట్టి, కృపను బట్టి, వారు వర్థిల్లత పొందుకుంటారు.

నా స్నేహితులారా, ఈ రోజు దీనిని మనము స్వతంత్రించుకొనబోవుచున్నాము. ఎందుకనగా, 'ప్రభువా, నీవే మాకు మూలరాయి, నీలో ఉన్న సమస్తమును మాకు అనుగ్రహించుము,' అని చెప్పండి. ఆయన మనకు మూలరాయి అయి ఉండగా, ఆయన నిత్యుడైన వాడు గనుకనే, మన గృహము, మన కుటుంబము నిత్యజీవంలో నిలిచి ఉంటుంది. నిత్యము అది స్థిరంగా నిలిచి ఉంటుంది. ఎప్పటికి పడిపోము. నిరాంతరాయంగా ఆయనతో జీవించెదము.

అందుచేతనే, యేసు సెలవిచ్చాడు, 'ఎవరైతే, తమ ఇల్లును రాతి బండ మీద కట్టకుంటారో, వారు బుద్ధిమంతులు.' ఎందుకనగా, ఆ గృహము ఎప్పటికిని నిలిచి ఉంటుంది. ఆయనే ఈ రోజు మన రాతి బండ, ఆయనలో ఉన్న మంచివన్నియు కూడా మనము పొందుకుందాము. కుటుంబము కొరకు స్వతంత్రించుకుందాము. ఆయన శాంతి సమాధానమును, ఆయన జ్ఞానమును మనము స్వతంత్రించుకుందాము. "దేవా, నీలో ఉన్న శాంతిని మేము స్వతంత్రించుకొనునట్లు చేయుమని'' చెప్పండి. మా కుటుంబ సభ్యులు, శాంతి చేత నింపబడియుండవలసి యున్నది. నేడు, ఆయనే మన మూలరాయి. కాబట్టి, ఆయనలో ఉన్న ప్రతి మంచి మేలులను పొందుకుందాం. మీ కుటుంబానికి ఆయన శాంతి, ఆయన ఆశీర్వాదాలు, ఆయన జ్ఞానం మరియు ఆయన శాశ్వతమైన వాగ్దానాలను స్వతంత్రించుకొనండి. ఆయన సమృద్ధి మీ జీవితంలోని ప్రతి ప్రాంతంలో ప్రవహించునట్లు చేసి, మిమ్మును ఆశీర్వదిస్తాడు! కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, ఈ రోజు మేము నీలో నివసించే పరిపూర్ణమైన శాంతిని కోరుచున్నాము. ప్రభువా, ఈ దివ్య శాంతితో మమ్మును మరియు మా కుటుంబాన్ని నింపుము. యేసయ్యా, నీలో ఉన్న అపరిమితమైన ప్రేమను మేము స్వతంత్రించుకొనునట్లుగాను, మరియు నీ ప్రేమ మా హృదయాలలో పొంగిపొర్లునట్లుగా చేసి మమ్మల్ని ఒకదానితో ఒకటి బంధించునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. ప్రభువా, నీ అభిషేకమును మాపై కుమ్మరిము మరియు నీ జ్ఞానముతో మమ్మును నింపుము. దేవా, ఇక పోరాటాలు లేకుండా మన జీవితంలోని ప్రతి రంగంలోనూ అభివృద్ధి చెందుదాం. యేసయ్యా, నీలో ఉన్న స్వస్థతా శక్తిని మా కుటుంబం పట్ల ప్రవహించునట్లు చేయుము. దేవా, మమ్మల్ని పూర్తిగా పునరుద్ధరించి, మా జీవితాలను పునర్మించుము. ప్రభువా, నీలో కనిపించే అన్ని మంచి విషయాలతో మమ్మల్ని నింపుము. దేవా, నీ సత్యపు పునాదిపై నిర్మించబడిన మా ఇల్లు శాశ్వతంగా బలంగా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, మా ఇంటిలోని ప్రతి సభ్యుడు నీ కుటుంబానికి చెందినవాడు, నీ సన్నిధిలో మాకు శాశ్వత జీవమును అనుగ్రహించి, తద్వారా మేము ఇప్పుడు మరియు శాశ్వతముగా నీలో కదలకుండా మరియు సురక్షితంగా నిలిచి ఉండునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.