నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 9:9వ వచనము ద్వారా మనము నేడు దీవించబడబోవుచున్నాము. ఆ వచనము, "నలిగిన వారికి తాను మహా దుర్గమగును ఆపత్కాలములలో వారికి మహా దుర్గమగును'' అని బైబిల్‌లో ప్రకారము, దేవుడు మీకు మహా దుర్గముగా ఉంటాడు. అవును, కీర్తనలు 9:10వ వచనమును చూచినట్లయితే, "యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచి పెట్టువాడవు కావు కావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువునందు నిరీక్షణ ఉంచినవారు నిజముగా బహుగా పంటను కోసెదరు. దేవుడు మనకు మహా దుర్గముగా ఉండాలి అంటే, మనము ఆయన గుణశీలమును తెలుసుకోవాలి. మనము ఎంత ఎక్కువగా ఆయనను ఎరిగి ఉంటామో, అంత ఎక్కువగా ఆయన యందు మనము నమ్మిక కలిగియుండాలి.
నా ప్రియులారా, నేడు మనము జీవించు ఈ లోకము సమస్యలతో నిండుకొని ఉన్నది. ఇంకను మనము కష్టముల గుండా వెళ్లుచున్నప్పుడు, అది మనలను దేవుని చెంతకు నడిపిస్తుంది. అటువంటి సమయములోనే మనము దేవునిని ఎక్కువగా తెలుసుకొని ఉండగలము. దావీదు తన సమస్యల మధ్యలో కూడా దేవుని అంటి పెట్టుకొని ఉన్నాడు. రాజైన సౌలు దావీదును చంపడానికి అతనిని వెంటాడుచుండెను. అయినప్పటికిని దావీదు దేవుని యందు మాతమ్రే నిరీక్షణ కలిగియుండెను. బైబిల్ నుండి 1 సమూయేలు 23:14 వ వచనములో దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా తెలియజేయుచున్నది, "అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును, జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను; సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలు చేతికి అతని నప్పగించలేదు'' అని వ్రాయబడిన లేఖనమును మనము చూడగలుగుచున్నాము. దావీదు దేవుని యందు మాత్రమే నిరీక్షణ ఉంచినందున, దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగింపబడనివ్వలేదు. దావీదునకు దేవుడు మహా దుర్గముగాను ఉంటూ, ప్రభువు అతనికి ఆశ్రయం మరియు రక్షణ కేడముగా మారాడు మరియు కీడు నుండి అతనిని కాపాడెను.
అదేవిధముగా, నా ప్రియులారా, ప్రభువు మీకు ఆశ్రయముగాను మరియు మహా దుర్గముగా ఉంటాడు. అయినప్పటికిని దేవుని ఎరుగని వారు అనేకమైన సందేహములను కలిగియుంటారు. ఆలాగుననే, యోహాను 11వ అధ్యాయములో చూచినట్లయితే, యేసు తన ప్రియ సోదరుడైన లాజరునకు పునరుత్థానమును కలిగించుట కొరకు ఆయన బయలు వెళ్లుచున్న సమయములో, యేసు వారికి తెలియజేశాడు, 'లాజరు కేవలము నిద్రపోతున్నాడు, మనము అతనిని మేల్కొల్పడానికి మాత్రమే వెళ్లుచున్నాము' అని చెప్పినప్పటికిని తోమాకు చాలినంతగా నిరీక్షణ లేదు. ప్రధాన యాజకులైన వారు, ఆలాగుననే పెద్దలైన వారు, వారిని చంపుతారన్న అటువంటి భయమును అతడు కలిగియుండెను. యేసు యూదయ ప్రాంతములోనికి ప్రవేశించుచున్నప్పుడు, తోమా ఎంతగానో భయము నొందియున్నాడు. అతనికి అనేకమైన సందేహములను కలిగి ఉండెను. ఎందుకనగా, అతనికి దేవునికి సంబంధించిన జ్ఞానము లేకపోవుట వలన అతడు భయపడ్డాడు. అయినప్పటికిని మరియ, మార్త, సంపూర్ణ హృదయముతో దేవుని యందు మాత్రమే నమ్మిక యుంచి ఉన్నారు. వారి సోదరుడు మరణించినప్పటికిని, వారు ఇంకను కూడా యేసు నందు విశ్వాసముంచి ఉన్నారు. కానీ, వారు ఏమంటున్నారో చూడండి, యేసుతో, "ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండుననెను.'' కానీ, ప్రియులారా, ఇప్పుడు కూడా మీరు ఏది అడిగినను, దానిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడని నేనెరుగుదును. యేసు వారితో తెలియజెప్పాడు, ' మీ సోదరుడు చావలేదు అతడు మరల లేస్తాడు.' అంతట యేసు అతని సమాధి యొద్దకు వెళ్లి, ఆయన ఆలాగు చెప్పి, యేసు గొప్ప స్వరముతో, "లాజరూ, బయటికి రమ్మని '' బిగ్గరగా చెప్పెను. అక్కడ అప్పుడు ఏమి జరిగింది? మృతుడైన లాజరు ప్రాణముతో తిరిగి బయటకు వచ్చాడు. అవును, యేసు మరియకు, మార్తకు బలమైన దుర్గముగాను, ఆశ్రయముగా ఉండి ఉన్నాడు. కనుకనే, వారికున్న నిరీక్షణ ద్వారా వారు దేవుని మహిమను చూచారు.
నా ప్రియులారా, మనుష్యుడు మన బాహ్య స్వరూప్యమునే చూడవచ్చును. కానీ, ప్రభువైతే, మన హృదయములలోనికి చూచును. మనము దేవుని యందు విశ్వాసముంచినప్పటికిని, లేకపోయినప్పటికిని, ఈ రోజున కూడా మీరు మీ హృదయాన్ని దేవునికి సమర్పిస్తారా? ఇంకను ఈలాగున చెబుతారా? 'ప్రభువైన యేసయ్యా, నీవు మాకు సహాయమును చేయుము' అని చెప్పినట్లయితే, నిశ్చయముగా, ఆయన మీ దగ్గరకు వస్తాడు. ఆలాగుననే, నా ప్రియ స్నేహితులారా, మనము ఇప్పుడే ప్రార్థన చేద్దామా? అదేవిధముగా, మీరు చేసినట్లయితే, నిశ్చయముగా దేవుడు మీ ఆపత్కాలములలో మీకు తోడుగాను మరియు మహా దుర్గముగా ఉండును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, ఆపత్కాలములలో మా ఆశ్రయం మరియు దుర్గముగా ఉన్నందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ బలం మరియు రక్షణ కొరకు మేము ఈ రోజు నీ వద్దకు వచ్చుచున్నాము. దేవా, నిన్ను ఎక్కువ లోతుగా తెలుసుకోవడంలో మాకు సహాయం చేయుము. తద్వారా మేము నిన్ను సంపూర్ణముగా విశ్వసించునట్లుగాను, మాకు మహా దుర్గముగా ఉండునట్లుగా సహాయము చేయుము. ప్రభువా, మా హృదయాన్ని పరిశీలించి, అన్ని సందేహాలు మరియు భయాలను మా నుండి తొలగించుము. దేవా, నీవు దావీదును కీడు నుండి రక్షించినట్లుగానే, నీవు మాకు రక్షణగా ఉండాలని మేము కోరుచున్నాము. ప్రభువా, మా జీవితం సవాళ్లతో నిండినప్పటికిని, దావీదు వలె మేము నిన్ను అంటిపెట్టుకుని ఉండడం మాకు నేర్పించుము. దేవా, నీ సన్నిధి కలత చెందిన మా హృదయానికి సమాధానము మరియు ఆనందాన్ని కలిగించుము. ప్రభువా, నీవు మమ్మును ఎన్నటికిని విడిచిపెట్టవని తెలుసుకొని మేము ఎల్లప్పుడు నిన్ను వెదకునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. ప్రభువా, దయచేసి మా హృదయాలను సంపూర్ణమైన విశ్వాసంతో నింపుము మరియు నిన్ను మహిమపరిచే జీవితాన్ని గడపడానికి మమ్మును నడిపించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.