నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి నెహెమ్యా 8:10వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు'' ప్రకారము దేవుడు సమస్తానందమును కలిగియున్నాడు. పరిశుద్ధాత్మ కూడ ఆనందాన్నిచ్చే దేవుడై యున్నాడు. ఇంకను రోమీయులకు 14:17లో మనకు దానిని గుర్తు చేయుచున్నది, "దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది'' ప్రకారం దేవుని రాజ్యము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నదని చెప్పబడియున్నది. మరియు యోహాను 7:38లో చూచినట్లయితే, యేసు ప్రభువు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, "నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలనదులు పారునని బిగ్గరగా చెప్పెను.'' ఇది ప్రభువైన యేసును తమ స్వంత రక్షకునిగా అంగీకరించిన వారి నుండి ప్రవహించే ఆనందాన్ని మరియు సంతోషాన్నిచ్చే జీవజల నదులను సూచిస్తుంది. సర్వశక్తిమంతుడైన దేవుడు తన నుండి ప్రవహించే ఆనందం నుండి తన బలాన్ని పొందుచున్నాడు అని నెహెమ్యా 8:10వ వచనములో చెప్పబడినది.

తిరుపతి నుండి పాల్ జాన్‌సన్ తన సాక్ష్యమును ఈ విధంగా పంచుకున్నాడు. 2006వ సంవత్సరములో తన డిగ్రీని పూర్తి చేసుకొని, పట్టభద్రుడయ్యాక, పాల్ స్కూల్ అడ్మిన్రిస్టేటర్‌గా ఉద్యోగమును సంపాదించుకున్నాడు మరియు వెంటనే వివాహము చేసుకున్నాడు. అతనికి దేవుడు ఇద్దరు బిడ్డలను అనుగ్రహించి అతనిని దీవించాడు. ఆ తర్వాత యేసు పిలుచుచున్నాడు ప్రవచనాత్మక సదస్సులో పాల్గొన్నాడు. ఆ సదస్సులో నేను పరిశుద్ధాత్మతో నింపబడాలని కోరుకునే వారి కొరకు ప్రార్థన చేయుచుండగా, అతడు కూడ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. మేము ప్రార్థించుచున్నప్పుడు, పాల్ దేవుని నుండి శక్తివంతమైన స్పర్శను అనుభవించాడు మరియు పరిశుద్ధాత్మ అతనిని నింపాడు. అతను కొత్త భాషయైన అన్యభాషలలో మాట్లాడే వరమును పొందుకున్నాడు-అతని హృదయము నిజమైన ఆనందంతో నింపబడినది.

ఈ దైవీకమైన సమావేశానికి తరువాత, పాల్ ప్రభువులో గొప్ప ఆనందాన్ని మరియు బలాన్ని పొందుకున్నాడు. అతడు ఇతరులకు పరిచర్య చేయడం ప్రారంభించాడు మరియు సమస్తమును సజావుగా సాగుతున్నట్లు అనిపించింది. కానీ, కోవిడ్ ద్వారా 2020వ సంవత్సరములో తన ఉద్యోగమును కోల్పోయాడు. తద్వారా, తన హృదయము బ్రద్ధలైపోయినది. ఇది అతనికి మరియు అతని కుటుంబానికి వినాశకరమైన ఒక గొప్ప గాయముగా ఏర్పడింది మరియు మరొక పనిని కనుగొనడం అసాధ్యం అనిపించింది. అయితే, అతను వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించాడు. కానీ ఘోరంగా విఫలమయ్యాడు, అతడు కష్టాలను మరింత ఎక్కువగా ఎదుర్కొన్నాడు.

నా ప్రియులారా, ఈ కష్టాల మధ్య, యేసు పిలుచుచున్నాడు యొక్క అంబాసిడర్ పాల్‌ను వ్యాపార ఆశీర్వాద పధకంలో చేరమని ప్రోత్సహించాడు. అతను సలహాను అనుసరించి గుంటూరు ప్రార్థనా గోపురాన్ని సందర్శించాడు, అక్కడ ప్రార్థనా యోధులు అతని తరపున భారముతో ప్రార్థించారు. పాల్ తన అభివృద్ధి కొరకు దేవుని విశ్వసిస్తూ వ్యాపార ఆశీర్వాద ప్రణాళికలో నమోదు చేసుకున్నాడు.

2023లో, పాల్ ధైర్యముతో అడుగు ముందుకు వేసి మరొక వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈసారి, దేవుని హస్తం ఆ వ్యాపారము మీద ఉండెను. వ్యాపారం అభివృద్ధి చెందడం ప్రారంభించింది మరియు పాల్ తన ప్రయత్నాలు చివరకు ఫలించడాన్ని చూశాడు. అతను లాభాలను సంపాదించడం ప్రారంభించాడు మరియు ఒకప్పుడు పోరాటం మరియు దుఃఖం వంటిది ఆనందంగా రూపాంతరం చెందింది. దేవుడు అతని దుఃఖాన్ని నాట్యంగా మార్చాడు మరియు అతని కుటుంబ కోరికలను పునరుద్ధరించాడు. దేవునికే మహిమ కలుగును గాక.

నా ప్రియులారా, ఈ రోజు కూడ అటువంటి ఆనందమైన జీవితాన్ని మీకివ్వాలని మీ పట్ల కోరుచున్నాడు. 'ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు.' అయితే ఈ ఆనందం ఎలాగున వస్తుంది? ప్రభువైన యేసు తానే స్వయంగా మీ యందలి సంతోషించుచున్నాడు అనే వాస్తవం నుండి ఈ ఆనందము పొంగిపొర్లుతుంది. మరియు జెఫన్యా 3:17లో ఈలాగున మనకు తెలియజేయుచున్నది, "నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును'' ప్రకారం ఆయన మీ యందలి సంతోషము చేత గానము చేయుచున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన మిమ్మును తనకు ప్రియమైన బిడ్డగా నిర్థారించుచున్నాడు. మీ పట్ల ఆయన ప్రేమ చాలా అపారమైనది! సర్వశక్తిమంతుడైన దేవుడు యేసును గురించి ఈలాగున ప్రకటించాడు, "ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను'' అని చెప్పాడు. ఆలాగుననే, ఆయన కూడా మిమ్మును గురించి ఆనందించుచున్నాడు, "నీవు నా ప్రియమైన బిడ్డవి, నేను నీ యందు బహుగా ఆనందించుచున్నాను'' అని చెప్పుచున్నాడు. కాబట్టి, దిగులుపడకండి.

ఆలాగుననే, నా ప్రియులారా, దేవుని యొక్క ఆనందముతో మీరు నింపబడుచున్నప్పుడు, ఆయన మీ యందలి ఆనందించుచున్నాడు. అది మీ హృదయాన్ని నింపుచున్నది. మీరు దేవుని యొక్క సంతోషముచేత నింపబడుచున్నారు. మీరు దేవుని యొక్క సమస్తానందముతో నింపబడుచున్నారు. ప్రేమ మరియు అంగీకారంతో కూడిన ఈ సున్నితమైన మాటలను మీరు వింటున్నప్పుడు, ప్రభువు యొక్క ఆనందం మిమ్మల్ని ముంచెత్తుతుంది మరియు మీ హృదయాన్ని నింపుతుంది. మీరు ఆయన ఆనందంతో ఆవరింపబడండి మరియు మీ జీవితం ప్రభువు ఆనందంతో పొంగిపొర్లేలా ఆయన మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు.

ప్రార్థన:
మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా జీవితాలలో నీవు మాత్రమే ఇవ్వగల ఆనందానికై నిన్ను స్తుతించుచున్నాము. ప్రభువా, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదనియు, నీ కుడిపార్శ్వంలో నిత్యమైన ఆనందము కలవని నీ వాక్యం ప్రకటిస్తుంది. దేవా, ఇటువంటి దైవీకమైన ఆనందంతో మా హృదయాన్ని నింపమని మేము దీనమనస్సుతో కోరుచున్నాము. ప్రభువా, మా హృదయాంతరంగము నుండి బలపరిచే ఆనందం మరియు మా ఆత్మను సంతృప్తిపరిచే ఆనందాన్ని నేడు నీవు మాకు అనుగ్రహించుము. దేవా, నీ యొక్క ప్రేమ మరియు మంచితనాన్ని విశ్వసిస్తూ మా జీవితాన్ని పూర్తిగా నీ చేతులలోనికి అప్పగించుచున్నాము. ప్రభువా, నీవు మా యందలి గానంతో హర్షించునట్లుగాను, మేము నీకు ప్రియమైన వారలముగా జీవించుటకు నీ యొక్క ఆనందాన్ని మేము అనుభవించాలని కోరుచున్నాము. దేవా, నీ దైవీకమైన ఆనందం మా జీవితంలోని ప్రతి మూలను నింపునట్లుగాను, నీ యొక్క తాకుదల మాకు అవసరమైన ప్రతి ప్రాంతాన్ని నింపునట్లు చేయుము. దేవా, నేడు నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆనందాన్ని పొందుకోలేని ప్రతి ఆటంకమును తొలగించి, మూయబడిన ప్రతి ద్వారములను మా జీవితములో తెరవబడునట్లు సహాయము చేయుము. ప్రభువా, నీ కృప మరియు ఆనందం మా జీవితంలో పొంగిపొర్లునట్లుగా చేయుము. అది మా చుట్టూ ఉన్నవారిని తాకునట్లుగాను మరియు ఉద్ధరించునట్లుగాను కృపను అనుగ్రహించుము. దేవా, మా దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.