నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 యోహాను 2:17వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవిగాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును'' ప్రకారం అవును, నా ప్రియులారా, మనము ఆయన చిత్తానికి లోబడాలని ఆయన మన పట్ల ఆశించుచున్నాడు. అది ఎంత కఠినముగా ఉన్నప్పటికిని, ఎంత కష్టతరమైనప్పటికిని మనము ఆయన చిత్తమును చేయాలని మన పట్ల కోరుకుంటున్నాడు. మనము నిరంతరము నిలిచియుండు రీతిగా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి.

నా ప్రియులారా, అనేకసార్లు మనకు ఇష్టమైన జీవితాన్ని మనము కట్టుకుంటాము. ఎంతో ఆస్తి సంపాదిస్తాము. మన పేరు ప్రతిష్ఠలు ఏర్పరచుకోవడానికి ఎంతో కష్టపడతాము. ఆయన మన జీవితములో ఏమి చేయాలనుకుంటున్నాడో, కానీ ఆయన స్వరమును వినడానికి మరియు దేవుని ఆజ్ఞలను పాటించడము మరచిపోతాము. మన జీవితము అంతములో పరలోకానికి వెళ్లి, దేవుని ఎదుర్కోవాల్సిన సమయములో, ' నీవెవరివి? నేను నిన్ను ఎరుగను' అని చెప్పకూడదు. ఈ ప్రపంచములో గొప్ప పేరు ఉన్నప్పటికిని, ప్రభువునకు మన పేరు తెలియనప్పటికిని, బైబిల్ గ్రంధము అదే చెప్పుచున్నది. మార్కు 8:36లో చూచినట్లయితే, "ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము?'' అని లేఖనములో మనము ఈ విషయాన్ని గమనించగలము. ఇంకను మార్కు 10:17-22లో చూచినట్లయితే, ఒక వ్యక్తిని చూడగలము. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తికొని వచ్చి ఆయన యెదుట మోకాళ్లూని సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయన నడిగెను. అందుకు యేసు, 'నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధసాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తలిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలన్నియు నీకు తెలియును గదా అని అతనితో చెప్పెను.' అందుకతడు బోధకుడా, బాల్యము నుండి ఇవన్నియు అనుసరించుచునే యుంటినని చెప్పెను. 'యేసు అతని వైపు చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువగానున్నది; నీవు వెళ్లి నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను.' అతడు మిగుల ఆస్తిగలవాడు, గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని, దుఃఖపడుచు వెళ్లిపోయెను.

అవును నా ప్రియులారా, అతడు తన ఆస్తిని ఉంచుకోవాలని అనుకున్నాడు. ఎవ్వరికి ఇవ్వకూడదు అనియు, తన హోదాను, ఆధిక్యతను కాపాడుకోవాలని తలంచాడు. కొన్నిసార్లు మనకు ఎంతో దగ్గర ఉన్నవాటన్నిటిని ఇచ్చివేయాలని కోరుకుంటాడు. అది ఆస్తియై యుండవచ్చును, మన ప్రియులై ఉండవచ్చును. మనము ఎంతో సమయమును తీసుకొని నిర్మించుకున్న వృత్తి కూడా అయి ఉండవచ్చును. అయితే, ప్రభువు నుండి ఒక ఆజ్ఞను విన్నప్పుడు, ఆయన ఏమి చెప్పాడో, దానిని చేయాలి. అందుకే ఆయన, ' నా ఆజ్ఞను , నా ప్రణాళికను పాటించు అని అంటున్నాడు.' అవును, అది మనకు పరిపూర్ణంగా వ్యత్యాసంగా ఉండవచ్చును. ఆయన స్వరాన్ని వినడానికి ఎంతో కష్టతరముగా ఉండవచ్చును. అయితే, ఆయన అడిగింది మనము చేసినప్పుడు, మనము ఆయన చిత్తమును గైకొన్నప్పుడు, నిశ్చయముగా, నిత్యజీవమును మనము పొందుకొనగలుగుతాము.

నా ప్రియులారా, ఈ రోజు ప్రభువు మిమ్మును ఏదో ఒకదానిని చేయమని కోరుకుంటున్నాడేమో? అది మీ హృదయములో ఒక చిన్న ప్రేరేపణ కలిగిఉండవచ్చును. ఆయన స్వరాన్ని ఆలకించండి. ఆయన అడిగింది చేయండి, ఆయన ప్రణాళికను పాటించండి, ఇంకను ఆయన చిత్తాన్ని నెరవేర్చండి. అప్పుడు మీరు పరలోకమునకు వెళ్లినప్పుడు, " భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని చెబుతాడు.'' అప్పుడు మీరు నిత్యజీవమును పొందుకుంటారు. అదే కదా మనమందరము కోరుకునేది, అందుకొరకే కదా మనమందరము జీవించుచున్నది. కనుకనే, నా ప్రియులారా, ఈ రోజు మనము ఆయన చిత్తమునకు లోబడుదాము. లోకములో ఉన్న విషయములన్నిటిని ప్రభువు చూచుకుంటాడు. మన ఆశలన్నియు ఆయనకు తెలుసు. ఆయన చిత్తాను సారంగా ఆయన అన్నియు సరిగ్గా చేస్తాడు. ఆయన మనలను పట్టుకుని నడిపిస్తాడు. ఈ రోజే ఆయన చిత్తమునకు లోబడుదామా? ఆలాగున చేసి, నిత్యజీవమునకు వారసులము అవుదాము. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా,ఈ రోజు మమ్మును ఎంతో అన్యోన్యంగా నడిపించుచున్నందుకై నీకు వందనాలు. మా జీవితాల పట్ల నీ చిత్తమును మరియు ప్రణాళికను మాకు తెలియజేసినందుకై నీకు వందనాలు. దేవా, మేము నీకు పూర్ణ హృదయముతో సమర్పించుకునే కృపను దయచేయుము. ప్రభువా, నీ ఆజ్ఞలను అనుసరించునట్లుగా మాకు నీ కనికరమును మాకు చూపుము. మేము నీ పరిపూర్ణమైన ప్రణాళికను అనుసరించడానికి మాకు ప్రియమైన, మా సంపద, ఆశయాలు మరియు మా ప్రియులైన వారిని కూడా అప్పగించడానికి మాకు సహాయం చేయుము. దేవా, ఈ లోకములో ఏదియు మాకు వద్దు, నీవు మాకు కావాలి, నీవు మాకు ఉంటే చాలు, నిన్ను కలిగి ఉంటే అన్నియు మేము కలిగి ఉంటాము. కనుకనే, ప్రభువా, మేము నీ స్వరమును విని, నీ ఆజ్ఞలను, నీ చిత్తమును పాటించే కృపను మాకు దయచేయుము. అది ఎంత కష్టతరమై ఉన్నప్పటికిని, లోకము ఎంత శోధించినప్పటికిని, నిన్ను వెంబడించే బలమును మాకు దయచేయుము. తండ్రీ, అప్పుడు మేము నిత్య జీవమును కలిగి ఉంటాము, ఎల్లప్పుడు యేసును మా ప్రక్కనే కలిగి ఉంటాము, ఆ జ్ఞానమును, బలమును మాకు అనుగ్రహించుచున్నందుకై నీకు వందనాలు. ప్రభువా, మా మార్గం మాకు కష్టంగా ఉన్నప్పటికిని, పిలుపు కష్టంగా ఉన్నప్పటికి, పాటించే ధైర్యాన్ని మాకు అనుగ్రహించుము. దేవా, నీ స్వరాన్ని మాకు స్పష్టంగా వినిపించుము, మా ప్రతి అడుగు నీవు మమ్మును నడిపించునట్లుగా చేయుము. ప్రభువా, మేము నీ యెదుట నిలబడినప్పుడు, 'భళా, నమ్మకమైన మంచి దాసుడా' అని నీవు చెప్పడం మేము వినునట్లుగా మాకు నీ కృపను దయచేయుమ. ఇంకను నీతో నిత్యజీవములో ఉండుటకు మా ప్రయాణంలో మమ్మును బలపరచుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.