నా ప్రియమైన స్నేహితులారా, మీకు శుభములు తెలియజేయుటలో నేను ఎంతగానో ఆనందించుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 12:28వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు'' ప్రకారం దేవుడు నేడు మీకు సమృద్ధి జీవమును అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా, మనం నీతి మార్గంలో నడవాలని దేవుడు మన పట్ల కోరుకుంటున్నాడు. ఎందుకంటే, అది జీవానికి దారితీస్తుంది. ఈ మార్గంలో, మరణం ఉండదు. ఒకవేళ మీరు, 'నా జీవితానికి అన్నియు మరణమునకు దారితీస్తున్నాయి అని అంటున్నారా? లేక ప్రభువునకు దూరముగా ఉన్నాను అని అంటున్నారా? అందువలన అనారోగ్యము నన్ను బాధపెడుతుంది అని అంటున్నారా? అందువలన నేను నా ఉద్యోగములో విఫలమవుతున్నాను అంటున్నారా? అందువలన వ్యాపారములో ఒక వైఫల్యమును ఎదుర్కొంటున్నాను, తద్వారా ఎంతో ధనమును కోల్పోయాను. నేను పాపములో ఉన్నాను, ఎంతో అపరాధ భావముతో ఉన్నాను, ఇందులో నుండి నేను ఎలా బయటకు రాగలుగుతాను? ప్రభువు యొద్దకు వెళ్లినట్లయితే, నన్ను మరల చేర్చుకుంటాడా?' అని మీరు తలంచుచుండవచ్చును.

అయితే, బైబిల్‌లో గ్రంథములో ఒక కథను మనము చదువుతాము. లూకా సువార్త 15:11వ వచనము నుండి మనము చూడగలము. అది తప్పిపోయిన కుమారుని కథ. తన తండ్రి యింటిలో అతడు ఉన్నప్పుడు తాను సమస్త ఆనందమును కలిగియుండెను. తనకు కావలసిన ఆహారము సమృద్ధిగా ఉండెను. ఎన్నో సంపదలు మరియు సమాధానముతో అతడు నింపబడి ఉండెను. ఇంకను తండ్రి అన్నిటిని చూచుకుంటాడు అన్న నిరీక్షణను కలిగియుండెను. అయితే, అతడు తన తండ్రి ఆస్తిలో సగము తీసుకొని దూరముగా వెళ్లిపోయి, తన ధనమునంతటిని వ్యయపరచాడు. ధనము అయిపోయినప్పుడు, స్నేహితులందరు అతనిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. తన సంతోషమంతయు మరియు సమాధానమంతయు అతనిని విడిచిపెట్టి వెళ్లిపోయినది. అతడు మురికిలో జీవించెను. ఇంకను ఒంటరిగాను, అపరాధ భావముతోను, తినడానికి ఆహారము లేదు, నివసించడానికి స్థలము లేదు, తనను పట్టించుకునేవారు ఉన్నారు అనే సంతోషము లేదు. తద్వారా, తన జీవితము మరణమునకు దారి తీసింది. అతని జీవితం కృంగిపోవడం ప్రారంభమైంది. అయితే, ఆ సమయములో, నేను నా తండ్రి యింటికి తిరిగి వెళ్లాలని అనుకున్నాడు. నేను ఒక పనివానిగా వెళ్లతాను అని అనుకుని, అతడు లేచి తన తండ్రి యింటికి వెళ్లాడు. అయితే, అతడు తన తండ్రికి వెళ్లినప్పుడు, తండ్రి తన కుమారునిగా అతనిని చేర్చుకొని, కౌగలించుకున్నాడు. కుటుంబంలో అతని స్థానాన్ని పునరుద్ధరించాడు. తన ధనమునంతటిని మరల అతనికి ఇచ్చాడు, అతనికి ఆహారానికి ఎటువంటి లోటు లేదు. అపరాధ భావము లేదు. సంతోషము మాత్రమే, సమృద్ధియైన జీవము తాను కలిగియుండెను. ఎల్లప్పుడు తన తండ్రిని తనతో కలిగి ఉన్నాడు. కనుకనే, ఆ కుమారుడు తాను కోల్పోయిన దానిని సమృద్ధిగా పొందుకొని తన తండ్రి యింటిలో ఆనందముగా జీవించెను.

అవును నా ప్రియ స్నేహితులారా, మనము మన పరలోకపు తండ్రితో నివసించినప్పుడు, తండ్రి గృహములో మనము ఉన్నప్పుడు మన జీవితము నీతి మార్గములో నడిపించబడుతుంది. అది జీవమునకు దారితీస్తుంది. మరణానికి కాదు, జీవమునకు మాత్రమే. సమృద్ధియైన జీవమునకు, సమృద్ధియైన సంతోషము, సంపదను కలిగియుంటాము. మనకు ఏ కొరత ఉండదు. ఎందుకనగా, తండ్రి మనతో కూడా ఉంటాడు. ఏమి జరిగినను మన తండ్రి మనలను చూచుకుంటాడు అన్న నిరీక్షణ మనకు ఉంటుంది. అనారోగ్యము మన తలుపు తట్టినను సరే, పాపము మన తలుపు తట్టినను, శోధనలు మన తలుపు తట్టినను కూడా, మన తండ్రి గృహములో ఉన్నప్పుడు, ఎల్లప్పుడు మనము నీతిమార్గములోనే నడిపించబడతాము. కనుకనే, ఆ మార్గము జీవమునకు అది దారి తీస్తుంది. కాబట్టి, ఈ రోజు తండ్రి గృహములో ఉండడానికి నిర్ణయాన్ని తీసుకుందాము. ఎల్లప్పుడు తండ్రి ప్రక్కన ఉండునట్లుగా, మిమ్ములను ప్రేమించే యేసయ్యతో, మీకు సమస్తమును ఇచ్చే దేవునితో మీరు జీవించినప్పుడు, మీకు ఏ కొరత ఉండదు. ఈ రోజు ఆయనకు వందనాలు చెప్పి ప్రార్దిదామా? ఎల్లప్పుడు తన గృహములో ఉండమని అడుగుదామా? ఎల్లప్పుడు యేసయ్యను మన గృహములో ఉండమని అడుగుదామా? నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీకు సమృద్ధిగా జీవము నిచ్చి, మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
అమూల్యమైన మా ప్రియపరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ సన్నిధి కొరకు వాంఛగల హృదయంతో మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, సమృద్ధి జీవముతో మమ్మును నింపుము. ప్రభువా, మరణం లేని జీవమునిచ్చు నీతి మార్గంలో మమ్మును నడిపించుము. యేసయ్యా, మేము నీ నుండి దూరమైన సమయాలకు మమ్మును క్షమించుము మరియు మమ్మును నీ ప్రియమైన బిడ్డలనుగా పునరుద్ధరించుము. దేవా, నీ యొక్క ఆనందం, శాంతి మరియు సమృద్ధిగా ఉన్న ఆశీర్వాదాలతో మా జీవితాన్ని నింపుము. ప్రభువా, ఈ రోజు మమ్మును నీ రెక్కల క్రింద సురక్షితముగా కాపాడుము. దేవా, ఇంకను నీతిమార్గములో మమ్మును నడిపించుము. సమృద్ధియైన నీ యొక్క నీతిమార్గములోనికి మమ్మును నడిపించుము. ప్రభువా, మేము నీ గృహములో నివసించునట్లుగా మా జీవితాలను మార్చుము. దేవా, నీవు మా ప్రక్కన ఉండి, అనారోగ్యం, పాపం మరియు శోధనను అధిగమించడానికి మమ్మును బలపరచుము. ప్రభువా, నీ ప్రేమతో కూడిన సంరక్షణలో ఎల్లప్పుడూ నీ ఇంట్లో నివసించడానికి మాకు సహాయం చేయుము. యేసయ్య, మా స్థిరమైన మార్గదర్శి మరియు మా జీవితానికి వెలుగుగా ఉండి చీకటిలో ఉన్న మమ్మును సమృద్ధియైన జీవములోనికి నడిపించుము. దేవా, నీ యొక్క శాశ్వతమైన ప్రేమ మరియు నిర్ణయానికై వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, నీ కౌగిటిలో ఎల్లప్పుడు మమ్మును భద్రపరచి మరియు మేము నీతిమంతులుగా జీవించునట్లుగా కృపను దయచేయుమని యేసుక్రీస్తు జీవముగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.