నా ప్రియ స్నేహితులారా, దేవుడు మీ కొరకు నేడు దాచి యుంచినవి పొందుకొనుటకు సిద్ధముగా ఉన్నారా? మీరు దేవుని స్వరమును ఆలకించి ఇప్పుడే పొందుకొనుటకు సిద్ధముగా ఉండండి. ప్రస్తుతం, ఇది లూకా 2:14 వ వచనము నుండి యే సును మీ ముందుకు తీసుకొనివస్తుంది. యేసు ఈ లోకములో జన్మించినప్పుడు, దేవదూతలు ఇలాగున ప్రకటించారు: "సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక...'' ప్రకారంగా ఆయన ఎవరిని బట్టి ఆనందిస్తాడో, ఆయన వారికి సమాధానమును అనుగ్రహిస్తాడు. ఆయన సమాధానము దేనితోను సరిపోల్చలేనిది. యేసు సిలువలో మరణించినప్పుడు, యేసు యొక్క శిష్యులు ఎంతగానో భయము నొందా రు. యేసును చంపివేసినవారు, వారి వెంట కూడా పడతారని మరియు అంతటితో వారి జీవితము అంతమై పోతుందని వారు అనుకున్నారు మరియు ఎంతగానో భయపడ్డారు. అయితే,యేసు సజీవుడుగా పునరుత్థానుడై తిరిగి లేచాడని వారికి తెలియదు. కానీ, వారు యేసు మృతి చెందాడని వారు భయపడ్డారు. ఇక అంతే ఆయన గతించిపోయాడని వారు తమలో తాము తలంచారు. ఆయన ఇక లేడు అని అనుకున్నారు. దేవుడు ఇక తిరిగి రాడు అని తలంచారు. ఇంకను మాకు ఈ భూమి మీద ఎటువంటి నిరీక్షణ లేదు అని తలంచినందున, గొప్ప భయము వారి జీవితాలను అలుముకున్నది. అప్పటిదాక వారి ప్రాణము కొరకు ఎప్పుడు కూడా వారు భయపడలేదు. ఎందుకంటే, యేసులో వారు గొప్ప నిరీక్షణతో ఉన్నారు. కనుకనే, వారు భయపడలేదు.
అవును, నా ప్రియులారా, మన జీవితాలు కూడ ఆలాగుననే ఉంటాయి. యేసు మనతో కూడా ఉన్నాడను నిరీక్షణను మనము కోల్పోయిన ఆ క్షణములోనే, ఆయన మన పక్షాన పనిచేయగలడనే నిరీక్షణను కోల్పోయే క్షణంలో, భయం మన హృదయాలలోనికి ప్రవేశిస్తుంది. మనము భయము నొందియున్నప్పుడు, 'మన జీవితము ఇక అయిపోయింది మరియు ఇక ఏమియు జరగవు అని అనుకున్నప్పుడు, మన హృదయము భయము నొందినప్పుడు, దేవుడు చనిపోయాడు, ఆయన ఇక లేడు అని మనము చెప్పినట్లుగా ఉంటుంది. నాకు సహాయము చేయడానికి దేవుడే లేడు అని అనుకుంటాము.' అయితే, అటువంటి సమయములో యేసు శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు: ఆయన వారితో, " మీకు సమాధానము కలుగును గాక,'' అని చెప్పాడు. 'సమాధానము కలుగును గాక, నేను సజీవంగా ఉన్నాను' అని ఆయన వారితో చెప్పాడు. తాను సజీవంగా ఉన్నాడని ఆయన వారికి కనుపరచుకున్నాడు. యోహాను 14:27లో చూచినట్లయితే, యేసు తన శిష్యులతో, "శాంతి మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించు చున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి'' అని సెలవిచ్చుచున్నాడు. ఇంకను ఆయన, 'నా సమాధానము ఎల్లవేళల మీ హృదయాలలో మీతో కూడ నిలిచి ఉంటుంది' అని చెప్పాడు.
నా ప్రియ స్నేహితులారా, ఎల్లవేళల, ఆయన యందు నిరీక్షణ ఉంచి, సమాధానమును కలిగి ఉండండి. ఎందుకంటే, యేసు సజీవుడు అనియు, ఆయన మృతుడు కాడు, ఆయన ఇక్కడ నాతో కూడా ఉన్నాడు. కనుకనే, దేవుని సమాధానము మీ హృదయములను నింపుతుంది. మీ పోటీ పరీక్షల ఫలితాల కొరకు ఎదురు చూస్తున్నారా? లేక మీ పరీక్ష ఫలితాల కొరకు ఎదురు చూస్తున్నారా? ఆ పరీక్ష ఫలితాలు ఏమి ఫలితాలు వస్తాయో? అది అపజయముగా ఉంటుందా? అది వ్యతిరిక్తమైన సమాచారముగా ఉంటుందా? నా జీవితము ఎలాగున ఉండబోవుచున్నదో అని అనుకుంటుండవచ్చును. అటువంటి సమయములో, ప్రభువుతో చెప్పండి, 'ప్రభువా, నీ యందు మాత్రమే మా నమ్మిక' అని చెప్పినప్పుడు, నాకు తెలుసు గొప్ప దేవుని శాంతి సమాధానము మీ హృదయములను నింపుతుంది. ఎందుకనగా, మీరు ఆయనను గుర్తించి యున్నారు గనుకనే, ఈ శాంతి మన హృదయాలను నింపడానికి మన హృదయాలను భద్రపరుస్తుంది. మనము దీని కొరకై ప్రార్థిద్దామా? దేవుని సమాధానము ఎల్లవేళల మీతో కూడ ఉండును గాక. మీరు ఆయనను అంగీకరించినప్పుడు, దేవుని నుండి గొప్ప శాంతి మీ హృదయాన్ని నింపుతుంది. ఈ సమాధానము మిమ్మును నింపుతుంది, మిమ్మును కాపాడుతుంది మరియు మీ హృదయాన్ని దృఢంగా ఉంచుతుంది. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు ఈ క్రిస్మస్ కాలములో మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
సమాధానమునకు కర్తవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ యొక్క సాటిలేని సమాధానమను బహుమానము కొరకై నీకు వందనాలు. దేవా, మేము బలహీనులముగా ఉన్నాము, భయము మా హృదయములను చెరపట్టియున్నది, ఇటువంటి సమయములో మేము నీ వైపు మరలుచున్నాము. దేవా, నీ సమాధానము మమ్మును నింపునట్లుగాను, నీ శాంతి మా హృదయాలకు కావలి ఉండునట్లుగా చేయుము. ప్రభువా, మా బలహీనతలో మేము భయపడుచున్నాము. అయినను, నేడు మేము నీ యందు మాత్రమే నమ్మిక కలిగి ఉండడానికి మాకు నేర్పించుము. దేవా, నీ సమాధానము మా హృదయాలను నింపునట్లుగాను మరియు మా జీవితాలను ఆవరించునట్లుగాను చేయుము. ప్రభువా, ఏ భయము కూడ మమ్మును అధిగమించకూడదు. దేవా, మా హృదయాలను ఇక ఏమాత్రము కలత చెందకుండ నీ సమాధానముతో మమ్మును నింపుము. దేవా, నీ యొక్క సమాధానములోనికి మమ్మును నడిపించుము. దేవా, మాకు మంచి సమాచారములను అనుగ్రహించుము మరియు మా ప్రతి నిర్ణయంలో మమ్మును నీ నడిపింపుతో నడుచునట్లుగా మాకు అటువంటి కృపను దయచేయుము. యేసయ్యా, నీ యొక్క పరిపూర్ణ ఉద్దేశములపై సంపూర్ణంగా నమ్మకం కలిగి ఉండునట్లుగాను, మా భవిష్యత్తు గురించి చింతలను మేము నీ చేతులకు అప్పగించుచున్నాము. దేవా, మా మార్గాలన్నిటిలో మేము నిన్ను సంతోషపెట్టడానికి నీకు లోబడి జీవించునట్లుగాను మరియు నీ సమాధానము మా హృదయాన్ని మరియు మనస్సును పరిపాలించునట్లుగా చేయుమని యేసుక్రీస్తు సాటిలేని నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.