నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ కుమారుడును, రక్షకుడైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెహోషువ 1:9వ వచనమును తీసుకొనబడియున్నది. ఆ వచనము, "...నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును'' ప్రకారం ఈ వచనమంతయు ఈలాగున చెబుతుంది, " నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును'' అన్న వచనము ప్రకారము, దేవుడు మీకు నిత్యము తోడుగా ఉండి, మీకు ముందుగా వెళ్లుచూ, మిమ్మును నడిపిస్తాడు.
నా ప్రియులారా, నేడు మీరు ఇటువంటి నిరీక్షణను కలిగియున్నారా? నేను ఎక్కడకు వెళ్లినను, ప్రభువు నాకు తోడుగా ఉంటాడు. ఆయన నాతో వస్తాడు అని ధైర్యముగా చెప్పగలుగుతారా? అందుకే బైబిల్‌లో, యోహాను 10:30వ వచనమును మనము చూచినట్లయితే, "నేనును తండ్రియును ఏకమై యున్నామని...చెప్పెను'' ప్రకారం 'సర్వశక్తిమంతుడైన దేవుడు ఎల్లప్పుడు నాతో కూడా ఉన్నాడని' యేసు అంటున్నాడు. మరియు యోహాను 8:16లో చూచినట్లయితే, "నేను ఒక్కడనైయుండక, నేనును నన్ను పంపిన తండ్రియు కూడ నున్నాము'' ప్రకారం ఆయన ఒక్కడు కాక, తనను పంపిన తండ్రి కూడా ఆయనతో ఉన్నాడని యేసు క్రీస్తు అంటున్నాడు. ఎంత చక్కని నిరీక్షణను ఆయన కలిగియున్నాడు కదా. "నేను, నా తండ్రియు ఏకమై ఉన్నాము'' అని చెబుతున్నాడు.
నా ప్రియులారా, ఇటువంటి నిరీక్షణను మీరు కూడా మీ జీవితములో కలిగియుండాలి. ' మేము ఒంటరివారము కాదు, యేసయ్య ఎల్లప్పుడు మాతో ఉంటాడు' అని మీరు చెప్పగలుగుతారా?1 యోహాను 1:3 వ వచనములో చూచినట్లయితే, "మాతో కూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది'' ప్రకారం మనము కూడా అటువంటి సహవాసమును కలిగి ఉండాలని ఆయన మన పట్ల కోరుచున్నాడు. ఇది ఎంత గొప్ప నిరీక్షణయై ఉన్నది. నా ప్రియులారా, తండ్రియైన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మయైన దేవుడు అను త్రియేక దేవుడు ఎల్లప్పుడు మనతో ఉంటాడు అన్న నిరీక్షణను మనము కలిగియున్నామా? సత్యమైన మరియు జీవముగల దేవుడు ఎల్లప్పుడూ మనతో కూడా ఉన్నాడు. కనుకనే, మీరు దిగులుపడకండి.
నా ప్రియ స్నేహితులారా, మీరు ఒంటరివారు కాదు, మీతో దేవుడు ఉన్నాడు అను నిరీక్షణను మీ జీవితములో మీరు కలిగియున్నారా? ఇటువంటి నిరీక్షణను మీరు కలిగియున్నప్పుడు, ప్రభువు ఎల్లప్పుడు మీ జీవితములో అన్నిటిని చేస్తాడు. నా జీవితములో చూచినట్లయితే, ఇప్పుడు నా వయస్సు 86 సంవత్సరములు. ఈ సంవత్సరములన్నిటిలోను దేవుడు నాకు తోడుగా ఉంటూ, నా జీవితములో అన్నిటిని జరిగిస్తూ వస్తున్నాడు. కాబట్టి, నా ప్రియులారా, మీరు దేనిని గురించి చింతించకండి, ఇంత గొప్ప దేవుని హత్తుకొనండి. ఇప్పుడే మీ జీవితాలను నేడు ప్రభువు హస్తాలకు సమర్పించుకొన్నట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీకు తోడుగా ఉండి, మీ పట్ల గొప్ప కార్యములను జరిగిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ అద్భుతమైన సన్నిధానమునకై నీకు వందనాలు. యేసయ్యా, 'నా నామమున ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరియుంటారో, అక్కడ నేను ఉంటాను' అని చెప్పినట్లుగానే, మా మొరలను ఆలకిస్తూ, మా మధ్యలో నీవు ఉన్నావని మేము నమ్మునట్లుగా మాకు అటువంటి గొప్ప ధన్యతను దయచేయుము. ప్రభువా, మా మీద నీ దృష్టిని ఉంచుము. యేసయ్యా, నీవు ఎలాగున తండ్రితో సహవాసమును కలిగియున్నావో, మేమును కూడా నీతోను మరియు తండ్రితోను సహవాసమును కలిగియుండునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, మేము లోకస్థులపైన మేము నమ్మకముంచకుండా, నిన్ను హత్తుకొని వుండునట్లుగా మరియు మా కొరకు అన్నిటిని చేయుము. ప్రభువా, మాకు తోడుగా ఉంటూ, నీవు మాకు ముందుగా వెళ్తూ, అన్నిటిని సిద్ధింపజేయుము. దేవా, మా మొఱలను ఆలకించి, మమ్మును మరియు మా కుటుంబమును దీవించునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. దేవా, భయం మమ్మును చుట్టుముట్టినప్పుడు, నీవు మా పక్కన నడుస్తున్నావని మాకు గుర్తు చేయుము. యేసయ్య, మేము ఎప్పుడూ ఒంటరిగా లేమని నమ్ముచున్నాము. ఎందుకంటే, మేము ఎల్లప్పుడూ నీకు సమీపముగా ఉండునట్లుగా చేయుము. దేవా, దయచేసి ప్రతిరోజు నీ సన్నిధి మరియు శక్తిపై నమ్మకం ఉంచడానికి మాకు సహాయం చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.