నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి బైబిల్ నుండి ఈ రోజు మనం నిర్గమకాండము 9:16 వ వచనమును గూర్చి ధ్యానించబోవుచున్నాము. "నా బలమును నీకు చూపునట్లును, భూలోకమందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని'' ప్రకారం తదనుగుణంగా, దేవుడు మన స్వప్రయోజనం కొరకు మాత్రమేకాకుండా, తన బలమును ప్రదర్శించడానికి మరియు భూలోకమందంతట తన నామమునకు మహిమను తీసుకొనిరావడానికి ఆయన మిమ్మును నియమించి, ఆయన మనలను పైకి లేవనెత్తి ఘనపరుస్తాడు. ఇంకను మీరు కలిగియున్నవాటిచేత, మీరు చేయబోవు వాటి చేత దేవుని నామము మహిమపరచబడుతుంది.

నా ప్రియులారా, అవును, అందుకే మనం ఎప్పుడు తక్కువ వారిగా ఉంటూ, తృప్తిపడుతుంటాము. అంతమాత్రమేకాదు, 'నేను జీతం సంపాదించడానికి, నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మరియు బల్ల మీద ఆహారాన్ని ఉంచడానికి నేను పదవి విరమణ వరకు నా ఉద్యోగంలో నేను స్థిరంగా ఉండగలిగినట్లయితే, నాకు చాలు, చాలా సంతోషంగా ఉంటుందని' మన యొక్క ప్రస్తుత పరిస్థితులను కొనసాగించడం ద్వారా సంతృప్తి చెందుతాము. లేదా బహుశా! మనము, మా పరీక్షలలో ఉత్తీర్ణత పొందినట్లయితే మరియు విజయాన్ని పొందుకున్నట్లయితే చాలు అని అనుకుంటాము.' కానీ, అటువంటి సమయములో మనకున్న వాటిని బట్టి మనము సంతృప్తి పడకూడదు. ఈ కోరికలు సహజమైనప్పటికిని, లేఖనములో చూచినట్లయితే, మనలను గొప్ప వాటి కొరకు కృషి చేయాలని పిిలువబడుచున్నాము. ఇంకను ఈ వచనం ప్రకారము ప్రభువు మనలను హెచ్చించి, ఆయన నామమునకు ఘనపరచబడునట్లుగా, ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్లతాడు. మన కోసం దేవుని ప్రణాళిక కేవలం పొందడం కంటే చాలా ప్రాముఖ్యమైనది. స్వప్రయోజనము కొరకు కాదు, కానీ మన ద్వారా ఆయన నామము మహిమపరచబడునట్లు మనలను హెచ్చిస్తాడు. మన జీవితాలలో తన వెలుగుతో ప్రకాశించాలనియు, తన మహిమ కొరకు అసాధారణమైన కార్యాలను సాధించాలనియు ఆయన మనలను పిలుచుచున్నాడు.

యోసేపు జీవితములో మనము అదే కార్యమును చూడగలుగుతాము. ఐగుప్తు దేశములో రెండవ అధినేతగా, అధికారాన్ని కలిగియున్నాడు. కానీ, అతను ఐగుప్తు దేశ ప్రజలకు మాత్రము సేవ చేయలేదు. కానీ, కరువు వచ్చినప్పుడు, ఐగుప్తులో ధాన్యం కొనుక్కోవడానికి అన్ని దేశాల నుండి ప్రజలు అతని యొద్దకు వచ్చునట్లుగా, దేవుడు అతనికి జ్ఞానాన్ని ఇచ్చి మరియు అతనిని ఉన్నత స్థానములో ఉంచి, హెచ్చించాడు. ప్రభువు యోసేపు ఇచ్చినటువంటి జ్ఞానము, పరిపాలన నాయకత్వం ద్వారా దేవుని నామము మహిమపరచ బడింది. ఈ గొప్ప కార్యము కొరకు దేవుడు యోసేపును ఎలా నడిపించి, సంసిద్ధం చేసి, రూపొందించాడో మనము బైబిల్‌లో చక్కగా వివరించుట చూడగలము. యోసేపు ప్రపంచమంతటా ప్రసిద్ధి ఎలా పొందాడో చూడగలుగుచున్నాము. అతని యొద్ద నుండి ప్రవహించిన దేవుని జ్ఞానమును ద్వారా ఆయన నామ మహిమ ఈ భూలోకమంతటా ప్రత్యక్షపరచబడినది మరియు అతని జీవితంలో దేవుని బలము ప్రచురము చేయబడినది.

అదేవిధముగా, ఎస్తేరు రాణిని గురించి చదివినప్పుడు, ఆమె ఒక దేశమునకు రాణియై ఉండెను. దేవుని ప్రజలు అపాయములో ఉన్నప్పుడు, తాను మౌనముగా కూర్చుని ఉండిపోలేదు కానీ, నా జీవితము క్షేమముగా ఉన్నది, నేనెందుకు ఇతరుల కొరకు పట్టించుకోవాలి అనుకోలేదు. తను ముందడుగు వేసి, దేవుని ప్రజలను అపాయము నుండి తప్పించినది. తద్వారా, దేవుని నామము మహిమపరచబడినది. ఆయన ప్రజలు క్షేమాన్ని పొందుకున్నారు.

అదేవిధంగా, నా ప్రియులారా, మనము కూడా అటువంటి ఔనత్యము కొరకు కృషి చేయాలని ఆయన మనలను పిలుచుచున్నాడు. ఇంకను ప్రభువు మనలను లేవనెత్తాలని మన పట్ల కోరుచున్నాడు. గొప్ప శిఖరాలకు మరియు ఉన్నత స్థాయిలకు మరియు గొప్ప కార్యాలు చేసి, ఆయన నామమును మహిమపరచేందుకు తన శక్తిని, జ్ఞానాన్ని ఈ లోకానికి ప్రచురము చేయునట్లుగా తన నామమహిమ నిమిత్తము మనలను వాడుకోవాలని ఆయన మన పట్ల కోరుకుంటున్నాడు.

కాబట్టి, నా ప్రియులారా, మనము చేయుచున్న ప్రతి పని అతి శ్రేష్టంగా చేయాలనే నిర్ణయాన్ని మనము నేడు తీసుకుందాము. మన చదువులలో ఉన్నత మార్కులను పొందుకోవాలి. మన ఉద్యోగములో శ్రేష్టంగా పనిచేయాలి. మన వ్యాపారములను ఉన్నత శిఖారలకు తీసుకొని వెళ్లాలని మనము తలంచుకుంటాము. ఇంకను మనము చేయుచున్న ప్రతి పనిలో దేవునికి మహిమను ఇవ్వాలి. నిజాయితీగా జీవించాలి. దేవుని జ్ఞానముతో పనిచేయాలని అనుకుంటాము. అందుకే మత్తయి 5:16లో చూచినట్లయితే, " మనుష్యులు మీ స్రత్కియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి'' ప్రకారం ఈ రోజు ఇతరుల యెదుట మీ వెలుగును ప్రకాశింపనియ్యండి. ప్రజలు అది చూచి, దేవునికి మహిమను తీసుకొని రావాలి. ఆయన నామము ఈ భూలోకమంతట ప్రచురింపబడాలి. ఈ ఉద్దేశము కొరకు నేడు మిమ్మును మీరు దేవునికి సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, మీ ద్వారా దేవుని నామము మహిమపడుతుంది. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్ధన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ రోజు మాకు జ్ఞానమును మరియు బలమును దయచేయుము. దేవా, నేడు మేము ఉన్న పరిస్థితిలో నుండి మమ్మును ఉన్నతంగా లేవనెత్తుము. దేవా, చదువులలో మరియు పరీక్షలలో మేము కృషి చేసే కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, శ్రేష్టమైన స్థాయిని మాకు దయచేయుము. దేవా, మా సత్‌క్రియల ద్వారా మా వెలుగు ఇతరుల యెదుట ప్రకాశించునట్లు చేయుము. నీ నామము మహిమపరచునట్లుగా చేయుము, నీ నామము ఈ లోకమంతట ప్రకటించబడునట్లు చేయుము. ప్రియమైన ప్రభువా, మేము ఈ రోజు నీ జ్ఞానం మరియు శక్తిని అడుగుచున్నాము. దేవా, మేము చేయుచున్న ప్రతి పనిలో మేము ఉత్తమమైనదాన్ని అందించడానికి మాకు అధికారం మరియు బలమును జ్ఞానమును దయచేయుము. ప్రభువా, చిత్తప్రకారము నడవడానికి మమ్మును నడిపించుము మరియు నిన్ను ఘనపరచే నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయుమము. రాబోయే కార్యాల కొరకు మా చేతులను మరియు మా హృదయాన్ని బలపరచచుము మరియు మా పట్ల నీవు కలిగి ఉన్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి మాకు అవసరమైన సహాయాన్ని అనుగ్రహించుము. ప్రభువా, మమ్మును ఆశీర్వదించుము, తద్వారా మేము ఇతరులకు నమ్మకంగా సేవ చేయునట్లుగాను మరియు మేము చేయు ప్రతిదానిలో నీ నామాన్ని మహిమపరచునట్లు చేయుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.