నా ప్రియ స్నేహితులారా, నేడు యేసు యొద్ద నుండి మీరు, "జీవాహారమును'' పొందుకోవాలని నేను మిమ్మును ప్రోత్సహించుచున్నాను. ఆ యొక్క 'జీవాహారము' ఏమైయున్నది? అని మనము నేడు చూచినట్లయితే, ఈ రోజు మీ యొద్దకు వచ్చియున్న ఆ దేవుని వాక్యమే. ఆ వాక్యము, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 యోహాను 4:16వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "...దేవుడు ప్రేమా స్వరూపియై యున్నాడు, ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు, దేవుడు వాని యందు నిలిచియున్నాడు'' ప్రకారం దేవుడు ప్రేమా స్వరూపియై యున్నాడు. కనుకనే, ఇటువంటి ప్రేమను దేవుడు మనలో చూడవలెనని కోరుచున్నాడు. ఇంకను ఆయన మనలను తన ప్రేమలో నిలిచియుండవలెనని కోరుచున్నాడు. తద్వారా, మనము దేవుని యందు నిలిచియుంటాము మరియు దేవుడు మనతో ఏకమై ఉంటాడు.

నా ప్రియులారా, మనము దేవుని ప్రేమలో ఏలాగున నిలిచి ఉండగలము? ఈ ప్రేమ ఏమై యున్నది? అని మనము చూచినట్లయితే, దేవుని వాక్యము ఈలాగున సెలవిచ్చుచున్నది, "దేవుడే ప్రేమా స్వరూపి'' అని తెలియజేయబడుచున్నది. ఈ ప్రేమ ఏమిటి? ఇది ఈ లోకములో మీరు చూచుచున్నటువంటి ప్రేమ ఇది కాదు. ఇంకను ఎవరైన మీకు మేలు చేసినప్పుడు మాత్రమే వచ్చే ప్రేమ కాదు. ప్రజలు వారికి సహాయము లేక మేలు చేసినట్లయితే, కొందరు వారిని ప్రేమిస్తారు. లేక మిమ్మల్ని ఆకర్షణీయంగా కనుగొన్నప్పుడు మాత్రమే ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తారు. సౌందర్యం ఉన్నంత కాలము, సౌందర్య ఇచ్చతో ప్రేమిస్తాము. అది ఇక్కడ మాట్లాడిన ప్రేమ కాదు. అది దేవుని నిజమైన ప్రేమ. ఇది మనలో నిలిచి ఉంటుంది. ఇది షరతులు లేని ప్రేమ. ఎవరినైనను ప్రేమించుటకు షరతులు ఉండవు. ఇది నిత్యము నిలిచి ఉండే ప్రేమ. ఎప్పటికి ఈ ప్రేమ తరిగిపోదు మరియు వైఫల్యము చెందదు.

నా ప్రియులారా, నేడు దేవుడు అట్టి గొప్ప ప్రేమను మనలో ఉంచగోరుచున్నాడు. యేసు అటువంటి ప్రేమతో మనలను ప్రేమించుచున్నాడు. యేసు ఎవరో అని యెరిగి ఉండి కూడా పేతురు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పినప్పుడు, యేసు గుండె బ్రద్ధలు కాలేదు. అయితే, మన స్నేహితులు ఎవరైన మనము ఎవరో తెలియదని ఆలాగున చెప్పినప్పుడు, మన గుండె ఎంత బ్రద్ధలవుతుంది కదా. అయితే, పేతురు ఆలాగున చెప్పినను, యేసు ఇంకను అతనిని ప్రేమించాడు. ఆయన ఈ ప్రజలను ఎలాగున ప్రేమించాడు? రోమా 5:5 వ వచనములో ఈలాగున చెప్పబడియున్నది, "ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింప బడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది'' అని చెప్పబడినట్లుగానే, అత్యంత బాధకరమైన సమయాలలో, దేవుని ఆత్మ ద్వారా ఆయన హృదయములో దేవుని ప్రేమ కుమ్మరించబడినదని చెప్పబడియున్నది.

కాబట్టి నా ప్రియులారా, ప్రతిదినము, దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడడానికి దేవుని ఆత్మ మనకు ఎంతో అవసరము. మనము దేవుని ప్రేమలో నిలిచి ఉండుట ద్వారా, ఇది మనలను దేవునిలో నిలిచి ఉండునట్లుగా చేస్తుంది. ఆత్మ మనలో లేనట్లయితే, ఆగ్రహముతోను ప్రతీకారము తీర్చుకునే ఒత్తిడికి లోనైనవారముగా మనము ఉండిపోతాము. కానీ, నేటి నుండి దేవుని ఆత్మ ద్వారా దేవుని ప్రేమలో నిలిచి ఉందాము. ఆలాగున నిలిచి ఉండునట్లుగా ప్రభువు సహాయము కొరకు ఆయనను మనము అడుగుదామా? రండి! ప్రార్థిద్దాము! దేవుని ప్రేమతో మీరు నేడు నింపబడునట్లుగాను మరియు మీరు అనేకమందికి ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా దేవుడు మిమ్మును తన ప్రేమతో నింపును గాక. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు తన ప్రేమతో మిమ్మును నింపి, దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమాస్వరూపివైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, నీవు వాగ్దానము చేసినట్లుగానే, మేము నీలో ఎల్లప్పుడు నిలిచి ఉండునట్లుగాను, మేము దేవుని ప్రేమ చేత నింపబడినవారముగాను చేయుము. ప్రభువా, మా మానవ బలహీనతలతో, మేము స్వయంగా నీ ప్రేమలో నిలిచి ఉండలేము.కనుకనే, ప్రభువా, మేము నీలోను మరియు నీ ప్రేమలోను నిలిచి ఉండునట్లుగా మాకు సహాయము చేయుము. పరిశుద్ధాత్మ దేవా, నీ ప్రేమ మాలో కుమ్మరించబడునట్లుగాను, నీ ఆత్మ శక్తితో మా హృదయములోనికి వచ్చి, ప్రేమకలిగిన హృదయంగా మమ్మును మార్చుము. దేవా, నీవు మాలో నిలిచి ఉండుట మాకు ఎంతో అవసరము. ప్రభువా, అందుకొరకు నీ ప్రేమ మాకు కావాలి. దేవా, ఒకవేళ మేము నీ ప్రేమలో నిలిచి ఉండనట్లయితే, నీవు మాలో నిలిచి ఉండలేవు, కనుకనే, నీవు ప్రేమ ద్వారా మాలోను, మరియు మాతోను నిలిచి ఉండుము. కాబట్టి మేము ప్రతిరోజు నీలోను మరియు నీ ప్రేమలోను నిలిచి ఉండడానికి మమ్మును మేము నీకు సమర్పించుకొనుచున్నాము. దేవా, మమ్మును నీ యొక్క శక్తివంతమైన ప్రేమతో మరోసారి నింపండి మరియు ఎల్లప్పుడూ ప్రేమతో వ్యవహరించడానికి మరియు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండటానికి మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.