నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 34:10వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు'' అని ఈ వచనం మనకు గుర్తుచేస్తుంది, బలవంతులు కూడా లేమి కలిగి కొదువలో వారు వెదకుంటారు, అయితే ప్రభువును వెదకు వారికి ఏ మేలు కొదువై యుండదు.
నా ప్రియులారా, ప్రజలు జీవితంలో గొప్ప విషయాలను సాధించగలరు, కానీ వారు క్రీస్తును కోల్పోయినట్లయితే, వారి జీవితములో వారు ఇంకా శూన్యముగా ఉంటారు. కానీ, మనము ప్రభువును వెదకినట్లయితే, మన జీవితానికి అవసరమైనవన్నియు కలుపబడతాయి. మనము అడగకపోయినప్పటికిని దేవుడు మన హృదయ వాంఛలన్నిటిని మనకు అనుగ్రహిస్తాడు. బైబిల్‌లో చూచినట్లయితే, కీర్తనలు 34:9-10వ వచనములలో ఈలాగున వ్రాయబడియున్నది, "యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయై యుండదు'' అని చెప్పబడియుండుట మనము చూడగలము. అందుచేతనే, కీర్తనాకారుడైన దావీదు, కీర్తనలు 23:1 వ వచనములో ఈ రీతిగా తెలియజేయుచున్నాడు, "యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు'' ప్రకారం ఏ మేలు కొదువయై ఉండదు అని దావీదు అంటున్నాడు. ఆలాగుననే, నేడు దేవుడు మీతో కూడ ఉండి యున్నట్లయితే, మీరు సమస్తమును కలిగియుండెదరు. మీకు కావలసినవన్నియు మీకు సమృద్ధిగా లభిస్తాయి. కనుకనే, మనము దేవునికి భయపడి, ఆయనను వెదకినట్లయితే, మరొక మాటలో చెప్పాలంటే, మనము దేవునికి సేవ చేసినప్పుడు, ఏమియు మనము కొదువ కలిగి ఉండము. కనుకనే, ధైర్యముగా ఉండండి.
బైబిల్‌లో చూచినట్లయితే, లూకా 22:35లో యేసు తన శిష్యులను అడిగినప్పుడు, వారికి ఈ సత్యాన్ని గుర్తు చేశాడు. "మరియు ఆయన సంచియు జాలెయు చెప్పులును లేకుండ నేను మిమ్మును పంపినప్పుడు, మీకు ఏమైనను తక్కువాయెనా'' అని వారినడిగినప్పుడు? వారు, " ఏమి యు తక్కువ కాలేదనిరి.'' అవును, దురాత్మలను వెళ్లగొట్టు నిమిత్తము మరియు రోగులను స్వస్థపరిచే అధికారాన్ని ప్రభువు వారికి ఇచ్చి, ఆయన వారిని శక్తివంతులనుగా చేసియున్నట్లుగా మనము చూడగలము. ఆధ్యాత్మిక శక్తి మరియు భూసంబంధమైన సదుపాయం రెండింటిని వారికి సిద్ధపరచాడు. అందుచేతనే వారు ధైర్యంగా, 'ప్రభువా, మాకు ఏ కొదువయు లేదు లేక ఏ లోపము లేదని' ప్రకటించగలిగారు.
నా ప్రియులారా, ఈ రోజు మీరు మీ ఇంటిలో కొరతను అనుభవిస్తున్నట్లు మీకు అనిపించవచ్చును. కానీ, హృదయమును కలవరపడనీయకండి. -దేవుడు మీకు కావలసినవన్నిటిని మీకు నేడు అనుగ్రహించబోవుచున్నాడు. నాకు తెలుసు, ప్రభువు ఈ రోజున మీరు అడుగుచున్న సమస్తమును నేడే మీకు అనుగ్రహిస్తాడు అని నమ్ముచున్నాను. అవును, నా ప్రియ స్నేహితులారా, ఏమి లేని స్థాయి నుండి దేవుడు అత్యంత సమృద్ధిని అనుగ్రహించగలదేవుడై యున్నాడు. కనుకనే, నేడు మీరు ఏమియు కొదువయు కలిగి ఉండరు. ఇంకను నీతిమంతులైన వారు ఏమియు కొదువయు కలిగి ఉండరు. బైబిల్ నుండి కీర్తనలు 37:25 వ వచనములో చూచినట్లయితే, " నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు'' అని భక్తుడు తెలియజేయుచున్నాడు. మీరు ఏమియు కొదువను కలిగి ఉండరు. ప్రియ స్నేహితులారా, శ్రేష్ఠమైనవి, నేడు మీ యొద్దకు వచ్చుచున్నవి. కారణము, నీతిమంతులు, దేవుని ప్రజలు ఎన్నటికి విడువబడరు లేదా అవసరంలో విడిచిపెట్టబడరు. కనుకనే, మీకు ఏమియు లోటు ఉండదు మరియు మంచి విషయాలు మీకు నేడు రాబోవుచున్నాయి, ప్రియమైన స్నేహితులారా, ప్రభువు మీ అవసరాలన్నింటిని తీర్చడానికి మీ పట్ల నమ్మకంగా ఉన్నాడు. వారు అత్యధికమైన సమృద్ధిని కలిగియుంటారు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీకు ఏ మేలు కొదువ లేకుండా మిమ్మును సమృద్ధిగా దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నీవు మా మంచి కాపరి మరియు దావీదు వలె, మేము వాగ్దానము ఇచ్చి నెరవేర్చే నమ్మదగిన దేవుడవని ఈ రోజు ధైర్యంగా ప్రకటించుచున్నాము. దేవా, ప్రార్ధనలో సమ యాన్ని వెచ్చిస్తూ, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రతిరోజు నీకు సమీపముగా కావాలనియు, నిన్ను అత్యంత శ్రద్ధగా వెదకడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నిన్ను మా జీవితానికి మధ్యలో ఉంచే దయను మాకు అనుగ్రహించుము. దేవా, అన్నిటికంటే మిన్నగా నిన్ను ఉంచి, మా పూర్ణ హృదయంతో నిన్ను వెదకునట్లుగాను, నిన్ను ఆశ్రయించునట్లుగాను మరియు నీకు సేవ చేయుటకు మాకు కృపను అనుగ్రహించుము. యేసయ్యా, మా జీవితం నీ యెదుట ఆనందకరంగా ఉండునట్లుగాను మరియు మా శక్తితో నిన్ను ప్రేమించేలా మాకు సహాయం చేయుము. దేవా, మేము నీకు సమీపమగుచున్న కొలది ప్రతి వంకర మార్గాన్ని సరాళంగా చేయుచూ, మాకు సంబంధించిన ప్రతిదానిని నీవు పరిపూర్ణంగా చేస్తావని మేము నమ్ముచున్నాము. యేసయ్యా, నీ యొక్క శాంతి మరియు ఆనందం మాకు నివాస స్థలంగా ఉండునట్లుగాను మరియు నీ ప్రేమపూర్వక సంరక్షణలో మేము సురక్షితంగా విశ్రాంతి తీసుకొనునట్లుగా మాకు నీ కృపనిచ్చి, నీ సన్నిధిలో మేము సంపూర్ణులగునట్లు సహాయము చేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.