నా ప్రియ స్నేహితులారా, నేడు మీకు శుభములు తెలియజేయడము నాకు ఎంతో సంతోషముగా ఉన్నది. ఈ రోజు వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 23:4వ వచనము తీసుకొనబడినది. మనకందరికి ఈ వచనము తెలుసుకనుకనే, మనమందరము కలిసి ఈ వచనమును చదువుదాము. "గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును'' అని చెప్పబడినట్లుగానే, మీరు దేనికిని భయపడకండి. అవును, నా ప్రియ స్నేహితులారా, ఇది ఎంత గొప్ప ఆదరణకరమైన వాగ్దాన వచనము కదా. మనకు మరణము వచ్చినప్పటికిని, మన నాశనము వైపు అన్ని సూచనలు మనకు కనబడుచున్నప్పటికిని, మనము ఇక భయపడము. ఎందుకనగా, ప్రభువు మనతో కూడా ఉన్నాడు. ఇది ఎంత గొప్ప నిరీక్షణను కలిగించుచున్నది కదా.

నా ప్రియులారా, ఒకవేళ మీరు, "నేడు నేను ఇటువంటి గాఢాంధకారపు లోయలో నడుస్తున్నాను అని అంటున్నారేమో? ఒకవేళ మీరు అంధకారము చేత చుట్టుబడి యున్నారేమో? ఒంటరిగా నడుస్తున్నారేమో? మరణము మీ తలుపు తట్టుచున్నదేమో? వైద్యులు మిమ్మును విడిచిపెట్టి యున్నారా? ఇదే మీ చివరి వారము లేక గడియ అని అన్నారా? మీ బిడ్డలతో గడపడానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయని అనుకుంటున్నారా? ఇవి మా చివరి మాటలు అని చెబుతున్నారా? మరణము కొరకు వేచియున్నాము అని అంటున్నారా? నేడు మీరు అటువంటి పరిస్థితులలో ఉన్నారేమో? జీవితములో ఉన్న అప్పుల వలన మేము చెల్లించవలసినవి, తగిన సమయములో చెల్లించలేకపోవుచున్నాము అని అనుకుంటున్నారా? తదుపరి భోజనమునకు కూడా నా దగ్గర డబ్బులు లేవు అని అంటున్నారా? ఇదే నా చివరి రోజు అని అంటున్నారా? మిమ్మును చుట్టుకొనియున్న అంధకారమును బట్టి మీరు ఎంతగానో భయపడుచున్నారేమో? మీరు నడుస్తున్న ఈ గాఢాంధకారము లోయలోను ప్రభువు మీతో కూడా ఉన్నాడు, మీరు భయపడవలసిన అవసరము లేదు.

పాండిచ్చేరి నుండి పూంగవనం అను సహోదరి జీవితములో అదే జరిగియున్నది. ఆమె తన సాక్ష్యమును ఈలాగున మాతో పంచుకున్నారు. 2022వ సంవత్సరము ఆమె బ్లాడర్ క్యాన్సర్ వ్యాధికి గురైనది. తన జీవితము పైన నిరీక్షణ అంతటిని కోల్పోయినది. మీకు ఇక మేము ఏమి చేయలేము అని వైద్యులు చెప్పారు. ఆగష్టు మాసములో స్కాన్ కొరకు వెళ్లినప్పుడు, వైద్యులు ఇలాగున చెప్పారు, 'నీకు బ్రతకడానికి ఒక వారము రోజులు మాత్రమే ఉన్నవి. ఏ చికిత్స కూడా నీకు పనిచేయలేదు.' ఆ సమయములో యేసు పిలుచుచున్నాడు పరిచర్యను గురించి తన పొరుగింటి వారు, ఆ పరిచర్యలో జరుగుచున్న కార్యములన్నిటిని తనకు వివరించారు. 'డాక్టర్. పాల్ దినకరన్‌గారు భాగస్థుల కూటము కొరకు పాండిచ్చేరి వస్తున్నారు. నీవు మాతో కూడా వచ్చి, ప్రార్థించుకున్నట్లయితే, నీవు స్వస్థపరచబడతావు అని చెప్పారు. '

ఆమె ఆ కూటమునకు వెళ్లినప్పుడు, మొదటి వరుసలో కూర్చున్నది. తన శరీరానికి పెట్టబడిన ట్యూబ్స్ మరియు యూరిన్ బ్యాగ్‌తో ఎంతో విశ్వాసముతో ముందు వరుసలో కూర్చున్నది. ప్రార్థనా సమయములో, నా తండ్రియైన డాక్టర్. పాల్ దినకరన్‌గారు ప్రార్థించినప్పుడు, "ప్రతి క్యాన్సర్ నుండి స్వస్థత కలుగును గాక అని చెప్పారు'' ఆమె కూడా మా నాన్నగారితో కూడా కలిసి ప్రార్థించారు. దేవుడు ఆమెను స్వస్థపరుస్తాడన్న విశ్వాసముతో ప్రార్థించెను. ఒక వారము రోజుల తర్వాత, తాను వైద్యుని వద్దకు వెళ్లి, స్కాన్ చేయించుకొనెను. కానీ, ఆ స్కాన్‌ను చూచి, వైద్యులు ఈ విధంగా చెప్పియున్నారు. "క్యాన్సర్ ఎక్కడ ఉన్నది? క్యాన్సర్ సూచనలు లేవు, నీవు స్వస్థపరచబడ్డావు, సమాధానముతో ఇంటికి వెళ్లు, ''అన్నారు. అది విన్న ఆమె ఎంతగానో సంతోషించినది. మరణచ్ఛాయలో నుండి ప్రభువు ఆమెను విడిపించాడు మరియు కాపాడాడు. తాను పూర్తిగా స్వస్థతను పొందింది. దేవునికే మహిమ కలుగును గాక.

నా ప్రియులారా, ఈ రోజు ప్రభువు మీకు కూడా అదే జరిగిస్తాడు. మీరు ఏ కీడుకు భయపడరు. మీరు గాఢాంధకారపు లోయలలో నడిచినను, 'ప్రభువు మాతో ఉన్నాడు కనుకనే, మేము దేనిని గురించి భయపడము. ఆయన మమ్మును కాపాడతాడు, ప్రభువు మాతో ఉన్నాడు అని అంటారు.' అదేవిధంగా, నేడు ఆయన మీకు కూడా అదే జరిగిస్తాడు నా స్నేహితులారా. అందరు మిమ్మును విడిచిపెట్టి వెళ్లిపోయారేమో? అందరూ మిమ్మును నిరాశపరిచి ఉండవచ్చును. కానీ, ప్రభువు మీతో కూడా ఉన్నాడు, ఆయన మీతో నడుస్తున్నాడు, మీ గాఢాంధకారము చూచి మీరు భయము చెందకండి. దేవుని సన్నిధిలో మనము కలిసి ప్రార్థిద్దాము. మనము ఈ లోకములో భయము లేకుండా జీవించడానికి దేవుని యొద్ద నుండి గొప్ప వాగ్దానమును పొందుకుందాము. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీ భయములన్నిటి నుండి మిమ్మును విడిపించి, స్వతంత్రులనుగా చేసి, మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, గాఢాంధకారపు లోయలో మేము నడుస్తున్నాము, ఏ కీడు మమ్మును తాకకుండా చేయుము. ప్రతి వ్యాధి మాయమగునట్లు చేయుము. మా శరీరము నుండి ప్రతి రోగము వెళ్లిపోవునట్లు చేయుము. దేవా, మా ప్రతి అనారోగ్యము మమ్మును విడిచిపెట్టి వెళ్లునట్లుగాను మరియు మేము స్వస్థతను పొందుకొని నూతనంగా మార్చబడునట్లు చేయుము. యేసయ్యా, మాలో ఉన్న ప్రతి మృత అవయవము జీవము పొందునట్లుగా, చక్కగా పనిచేయునట్లుగాను కృపను దయచేయుము. యేసయ్యా, నీ గాయపడిన హస్తములతో మా శరీరాలను తాకుము. మా మరణకరమైన వ్యాధుల నుండి మమ్మును ఇప్పుడే విడిపించుము. విఫలమైన చికిత్సను తొలగించుటకు శక్తిగల దేవుడవు నీవే. కనుకనే, సంపూర్ణంగా మా వ్యాధులను ముట్టి మాకు స్వస్థతను దయచేయుము. మరణము వంటి పరిస్థితులలోను మరియు మా ఆర్థిక ఇబ్బందులన్నిటిలో నుండి మమ్మును విడిపించి, కాపాడుము. ప్రియమైన ప్రభువా, మా జీవితంలోని చీకటి లోయలలో కూడా మాకు నిరంతరం తోడుగా ఉండుము. దేవా, భయం మరియు నిరాశ మమ్మును చుట్టుముట్టినప్పుడు, నీవు మాకు సమీపంగా ఉన్నావని మేము నమ్ముచున్నాము, మమ్మును నీకు దగ్గరగా జీవించునట్లుగా చేయుము. ప్రభువా, దయచేసి మా భయాలు, మా భారాలు మరియు మా అనిశ్చితి నుండి మమ్మును రక్షించుము. ఇతరులు మమ్మును విడిచిపెట్టినప్పుడు, నీవు ఎల్లప్పుడూ నమ్మకంగా మా పక్షముగా ఉండి మమ్మును విడువకుండా కాపాడుము. దేవా, సమస్త జ్ఞానమునకు మించిన నీ యొక్క పరిపూర్ణ సమాధానముతో మమ్మును నింపుము. యేసయ్యా, మా జీవితాన్ని నీ చేతులో ఉంచుచూ ధైర్యంతో ముందుకు నడవడానికి మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.