నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి జెఫన్యా 3:15వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము ఈలాగున సెలవిచ్చుచున్నది, "...ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు'' అన్న వచనము ప్రకారము, మీ చుట్టు దురాత్మలు ఉన్నాయి అని అంటున్నారా? నష్టములు మరియు బాధలు మా చుట్టు ఉన్నాయి, కృతజ్ఞతలేని భావము, బలహీనత, నష్టము మా చుట్టు ఆవరించి ఉన్నవి అని మీరు అంటుండవచ్చును. అయితే, వాటన్నిటి మధ్యలో ఇప్పుడు, రాజు మీతో కూడ ఉన్నాడు అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. రాజులకు రాజైన ప్రభువు మీ చుట్టు ఆవరించి యున్నాడు. ఆయన, 'నేను రాజులకు రాజై యున్నాను, నేను మరణమును మరియు అంధకార శక్తుల ప్రభావమును జయించి ఉన్నాను, సజీవముగా నేను తిరిగి బయటకు వచ్చాను, యేసు అనే నేను మీతో కూడ ఉన్నాను, మరల ఎన్నటికిని భయము, అపాయము మిమ్మును తాకనేరదు. ఏ అపాయము కూడ మీ యొద్దకు రాదు. మిమ్మును భద్రపరచుట కొరకే నేను మీకు తోడుగా ఉంటాను. కాబట్టి, భయపడకండి'' అని తెలియజేయుచున్నాడు. అవును, నా ప్రియులారా, అపాయము మీ యొద్దకు రావచ్చునేమో గానీ, దేవుడు మిమ్మును వాటన్నిటి నుండి బయటకు తీసుకొని వస్తాడు. భయపడవద్దు! అపాయము మరియు హాని మీ యొద్దకు రావచ్చును, కానీ దేవుడు దాని ద్వారా మిమ్మును ఒక చక్కటి సాక్ష్యంగా బయటకు తీసుకొని వస్తాడు. కనుకనే, మీ చుట్టు ఉన్న పరిస్థితులను చూచి మీరు భయపడవద్దు. దేవుడు మీ మధ్య మరియు మీతో కూడ ఉన్నాడు. ధైర్యంగా ఉండండి.
అగస్టస్ ప్రభు అను ఒక ప్రియ సహోదరునికి సంభవించిన అద్భుతమైన సాక్ష్యమును మీతో పంచుకోవాలని నేను కోరుచున్నాను. అతడు యేసును ఎరిగియున్నప్పటికిని, అతడు యేసుకు దూరముగా జీవించాడు. ఒకరోజు అతడు మూత్రంతో పాటు రక్తము కూడ స్రవిస్తున్నట్లుగా గమనించాడు. అతనిని హాస్పిటల్‌కు తీసుకొని వెళ్లారు. వారు అతని రక్తమును పరీక్షించారు. ప్లేట్లెట్ సంఖ్య 780 వరకు ఉండెను. అవి లక్షల సంఖ్యలో ఉండవలసినవి, అయితే 780 వరకు మాత్రమే ఉండెను. రక్తము అతని అవయవములలో నుండి బయటకు వచ్చేస్తుంది గనుకనే, అతడు చనిపోతాడని వైద్యులు చెప్పారు. అతని భార్య ఎంతో కన్నీటితో విలపించినది. మరణ భయము ఈ సహోదరుని మ్రింగివేయుచుండెను. ఈ ఆవేదన అంతటి మధ్యలో కూడ అతని భార్య యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురమునకు పరుగెత్తుకొని వచ్చినది. అక్కడ ఉన్న ప్రార్థన యోధులతో, నా భర్త కాపాడబడాలని ప్రార్థించండి అని చెప్పారు. ప్రార్థన యోధులు ఆమెతో కూడ మొఱ్ఱపెట్టియున్నారు. ప్రార్థన యోధులు ఇప్పుడే, 'మీ భర్తను దేవుడు తాకుచున్నాడు ' అని చెప్పి భారముతో ప్రార్థించారు. అదే సమయములో ఐసియులో ఉన్న ఆమె భర్త తనను ఎవరో తాకిన అనుభూతిని పొందుకొని యున్నాడు. మహా అద్భుతంగా ఆ కొలమానాలన్నియు కూడ మార్పు చెందుటకు ప్రారంభించాయి. అతని యొక్క ప్లేట్లెట్ సంఖ్య 780 నుండి 7 వేల వరకు వచ్చాయి. దానిని చూచిన వైద్యులు ఎంతగానో నిర్ఘాంతపోయారు. తద్వారా, వారు ఎంతగానో ఆనందించారు. కొంతకాలములోనే, సహజ సిద్ధముగా స్వస్థపరచబడి అతడు దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. ఈ రోజు అతడు కుటుంబ సమేతంగా వారందరు దేవుని యందు ఆనందించుచున్నారు. కనుకనే, ఇకమీదట ఎటువంటి అపాయము మీ యొద్దకు రావడము మీరు చూడరు. ఎందుకంటే, ఇశ్రాయేలీయుల రాజు మీ చెంతకు వచ్చుచున్నాడు. కనుకనే, ఆయనకు మీ హృదయాలను సమర్పించుకొన్నట్లయితే, నిశ్చయముగా, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీకు ఏ అపాయము రాకుండా, మీ మధ్య వచ్చి వాసము చేస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మహోన్నతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రియమైన ప్రభువా, ఇశ్రాయేలు రాజువైన నీవు మాతో ఉన్నావనీ, మేము ఇకమీదట ఏ అపాయానికి భయపడనవసరం లేదనియు, నీవు మాకిచ్చిన వాగ్దానానికై కృతజ్ఞతతో నిండిన హృదయంతో నీ యెదుటకు వచ్చుచున్నాము. దేవా, నీవు మమ్మును సందర్శించండి, ఎటువంటి అపాయము మా మీద మరియు మా చుట్టు ఆవరించి యున్నది. దేవా, వాటిని నీవు పూర్తిగా తొలగించివేయుము. ప్రభువా, మా కుటుంబములో ఉన్న ప్రతి విధమైన రోగములను తొలగించుము. ఎవరికి అపాయము రాకుండా మమ్మును మరియు మా కుటుంబ సభ్యులను భద్రపరచుము. ప్రభువా, మేము చీకటి, బాధ, నష్టం మరియు బలహీనతతో చుట్టుముట్టినట్లు అనిపించినప్పటికిని, రాజులకు రాజైన నీవు మాతో ఉన్నావని మేము నమ్ముచున్నాము. యేసయ్యా, నీవు మాతోను మరియు మా మధ్యను ఉన్నావని తెలుసుకొని మేము ఓదార్పు పొందునట్లుగా కృపను చూపుము. ప్రభువా, భయం మరియు అనిశ్చితి మమ్మును ఆవరించినప్పుడు, నీ సన్నిధిని మరియు నీ శక్తిని మాకు గుర్తు చేయుము. దేవా, నీవు మా రక్షకుడవు కాబట్టి అపాయము మమ్మును తాకదని నమ్మడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా జీవితములో సవాళ్లు ఎదురైనప్పటికిని, నీవు వాటి ద్వారా మమ్మును తీసుకువస్తావని మేము నమ్ముచున్నాము. దేవా, మా పరీక్షలను నీ దయ మరియు శక్తికి చక్కటి సాక్ష్యంగా మారునట్లుగా చేయుము. ప్రభువా, నీ యొక్క వాగ్దానం ద్వారా మమ్మును బలపరిచినందుకై నీకు వందనాలు చెల్లించుచు సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.