నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైన వాగ్దానమును కలిగియున్నాడు. ఆ వాగ్దానము, బైబిల్ నుండి కీర్తనలు 147:14వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే.'' అవును, దేవుడు మీ కొరతలన్నిటిని తీర్చి మంచి గోధుమలతో తృప్తిపరుస్తాడు. అంతమాత్రమే కాదు, మీ సరిహద్దులలో మీకు సమాధానమును అనుగ్రహిస్తాడు.

నా ప్రియులారా, నేను పై వచనమును చదువుచున్నప్పుడు, బైబిల్‌నందు రూతు గ్రంథములో ఉన్న భాగము నాకు జ్ఞాపకము వచ్చినది. నయోమి మరియు రూతు నివసించుచున్న గ్రామములో కరువు వచ్చిన కారణముగా, యూదయ ప్రాంతములో మరల పంటలు పండుచున్నాయి అని వారు విన్నారు. కాబట్టి, నయోమి యూదయ దేశమునకు వారు ప్రయాణించసాగారు. అప్పుడు, నయోమి హృదయములో, ' నేను తిరిగి వచ్చిన ఆ ప్రాంతములో, అక్కడ ఉన్న వారందరు నన్ను చూచి ఏమనుకుంటారో అని అనుకొని ఉండవచ్చును. ఇదివరకు నీ కుటుంబము ఎక్కడ ఉన్నది అని వారు ప్రశ్నిస్తారేమో? కేవలం ఆహారము కొరకు మాత్రము ఈ దేశమునకు తిరిగి వస్తున్నావా? అని తన బంధువులు అడిగే ప్రశ్నలన్నిటికి తను ఎలా జవాబు చెప్పుకోవాలి. తన చుట్టు ఉన్న ప్రజలందరు తనను విమర్శించబోయే ప్రశ్నలన్నిటిని తాను ఎలా ఎదుర్కోవాలని తలంచి ఉండవచ్చును. '

అయినను, నా ప్రియులారా, వాటన్నిటి మధ్యలో కూడా ఆమె ప్రభువును గట్టిగా పట్టుకొనెను. తిరిగి యూదయ ప్రాంతమునకు వెళ్లినది. రూతు గ్రంథములో మనము ఈ సంఘటను గమనించినట్లయితే, నయోమిని మరియు తన కోడలిని ప్రభువు ఎంతగానో దీవించాడని చూడగలము. రూతు ఆ ప్రాంతములో ఒక అన్యజనురాలైనప్పటికిని, తను కష్టపడి పనిచేసినది. తనకంటూ ఒక మంచి పేరును సంపాదించుకొనినది. తన అత్తకు ఎంతగానో సహాయపడినది. వారిరువురును వారి సరిహద్దులలో సమాధానమును కలిగియున్నారు. మంచి గోధుమలతో వారు తృప్తిపరచబడ్డారు. ఒక మంచి కుటుంబ జీవితముతో రూతు దీవించబడినది. వారి కుటుంబము ఎంతగానో ఘనపరచబడినది. అంతమాత్రమే కాదు, యేసుక్రీస్తు వంశావళిలో కూడా వారి పేరు ప్రస్తావించబడ్డాయి. అవును నా ప్రియ స్నేహితులారా, అదేవిధముగా, మీరు మీ జీవితములో కూడా ఒక నూతన ప్రారంభములో ప్రయాణించుచున్నారేమో? నూతన స్థలానికి వెళ్లవలసి వచ్చిందేమో? నూతన వ్యాపారము ప్రారంభించి ఉండవచ్చును? నూతన కుటుంబ జీవితము ప్రారంభించారా? ప్రజలు నా గురించి ఏమనుకుంటారో అని చింతించుచున్నారా? ఈ స్థలమునకు మేము కొత్తవారముగా ఉన్నాము మరియు ఇక్కడ మేము ఏమి చేయగలము? మేము ఎక్కడికి వెళ్లగలము? మాకు ఎవరు సహాయపడతారు? మేము ఒంటరిగా ఉన్నామని అంటున్నారా? మీకు సహాయమము చేయడానికి ఎవరు లేరని మీరు చింతించుచున్నారా? ప్రజల మాటలను మేము ఎలా ఎదుర్కొంటాము అని అనుకుంటున్నారా? వారి తీర్పులను ఎలా మేము ఎదుర్కొంటాము? అని బాధపడుచున్నారా?

అయితే, నా ప్రియ స్నేహితులారా, మీ హృదయము కలవరపడనీయ్యకండి. ప్రభువు నేడు మీ సరిహద్దులన్నిటిలోను మీకు సమాధానమును కలుగజేస్తాడు. ఇంకను మీకు సహాయపడడానికి సరియైన మనుష్యులను మరియు వనరులను మీకు అనుగ్రహిస్తాడు. మీతో చేరడానికి మంచి మనుష్యులను మరియు మంచి స్నేహితులను, చక్కని సమాజమును మీ యొద్దకు పంపిస్తాడు. ఆలాగుననే, మంచి గోధుమలతో మిమ్మును తృప్తిపరుస్తాడు. మీ జీవితములో ఏ కొరత ఉండదు. నయోమి ప్రభువునందు విశ్వాసముంచిన రీతిగానే, మీరు కూడా ప్రభువునందు విశ్వాసముంచుచుండగా, ప్రభువు మీకు సమాధానమును దయచేస్తాడు. ఇంకను శ్రేష్టమైనవాటితో మిమ్మును తృప్తిపరుస్తాడు. కాబట్టి, ఈ రోజు మీరు దేనిని నిమిత్తము భయపడకండి. మిమ్మును గూర్చి చింతించుటకు ప్రభువు మీతో కూడా ఉన్నాడు. కనుకనే, ప్రార్థించి ఈ వాగ్దానమును పొందుకుందామా? మీరు వేయుచున్న ప్రతి అడుగులో దేవుడు మీకు తోడుగా ఉంటాడు. కనుకనే, మీరు చింతించకండి, దేవుడు నిశ్చయముగా, మీ సరిహద్దులలో మీకు సమాధానమును అనుగ్రహిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
సర్వశక్తిగల మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసయ్యా, నేటి వాగ్దానము ద్వారా మమ్మును ఆశీర్వదించుచున్నందుకై నీకు వందనాలు. ప్రభువా, మా సరిహద్ధులన్నిటిలోను మాకు సమాధానమును కలుగజేయుము. దేవా, నేడు మేము ఎదుర్కొంటున్న విమర్శలను, అవమానములను, మా చుట్టు ఉన్న ప్రజల నుండి ఎదుర్కొంటున్న సమస్యలలో నుండి మా జీవితములో నీవు నెమ్మదిని దయచేయుము. దేవా, మా సరిహద్ధులన్నిటిలోను నీవు మాకు సమాధానమును అనుగ్రహించుము. ప్రభువా, మా పొరుగువారితోను, సహోద్యోగులతోను, మా బంధువులు మరియు కుటుంబ సభ్యుల మధ్యలోను, మేము ఎక్కడికి వెళ్లినా? సమాధానమును కలిగి ఉండునట్లుగా మాకు అటువంటి కృపను దయచేయుము. దేవా, మా సమస్యలన్నిటి నుండి మమ్మును విడిపించి, కొరత ఉన్న మా జీవితములో మమ్మును శ్రేష్టమైన గోధుమలతో తృప్తిపరచుము. దేవా, అన్ని విషయాలలో మమ్మును ప్రోత్సాహపరిచే మంచి మనుష్యులను, సహాయపడువారిని, మమ్మును ప్రేమించే వారిని మాకు దయచేయుము. ప్రభువా, మాకు కావలసిన వాటన్నిటిని అనుగ్రహించి, మమ్మును ఈ రోజు తృప్తిపరచుము. దేవా, మేము సందేహాలను మరియు అనిశ్చితులను ఎదుర్కొన్నప్పుడు, దయచేసి నయోమి మరియు రూతు పట్ల నీ విశ్వాసనీయతను మాకు గుర్తు చేయుము. ప్రభువా, మా జీవితంలో నూతన ప్రారంభాలను అనుభవించుచున్నప్పుడు మేము సంపూర్ణంగా విశ్వసించడానికి మాకు సహాయం చేయుము. ఇంకను దేవా, సరైన వ్యక్తులతో మరియు నీవు మా పట్ల ఉంచిన ఉన్నత ప్రణాళికలను సాధించడానికి మాకు అవసరమైన వనరులతో మమ్మును నింపుము. దేవా, మాలో ఉన్న ప్రతి భయాన్ని అధిగమించడానికి మరియు మా జీవితానికి నీ ప్రణాళికను అనుసరించడానికి మాకు నీ యొక్క బలాన్ని దయచేయుము. దేవా, నీ సమాధానము మా హృదయాన్ని నింపి ప్రతిరోజు, మా అడుగుజాడలను నడిపించి, నీవు ఎల్లప్పుడు మాతో కూడా ఉన్నావని, నీ శ్రేష్టమైన వాటిని మాకు అనుగ్రహించి, మమ్మును తృప్తిపరచుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.