నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు సంతోషించు దినముగా ఉన్నది. ఈ రోజు దేవుని యొక్క శక్తివంతమైన హస్తాల నుండి దేవుని దీవెనలను పొందుకొనబోవుచున్నాము. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి జెకర్యా 2:8వ వచనమును మనము చూడబోవుచున్నాము. ఆ వచనము, " సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి, మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు'' ప్రకారము ఒక దేవదూత చేత చెప్పబడియున్న ఈ మాటలను బట్టి, దేవుడు ఎంతగా మనలను ప్రేమించుచున్నాడని మనకు బయలుపరచబడియున్నది. దేవుడు ఏవిధంగా తన కనుగుడ్డుతో మనలను పోల్చుచున్నాడని ఒకసారి గమనించండి. ఆయన కనుగుడ్డును ఎవ్వరు కూడా తాకలేరు గనుకనే, మనము దేవుని యొక్క కనుగుడ్డుతో సమానముగా యెంచబడుచున్నాము. ఇంకను ఆయన మనలను ప్రశస్తమైన నిధిగా యెంచుచున్నాడు. కనుకనే, భయపడకండి.

నా ప్రియులారా, దేవుని యెదుట మనము ఉన్నతమైనటువంటి స్థానమును కలిగియున్నాము. ఆయన మనలను ప్రశస్తమైన వారినిగా మరియు ఎంతో విలువైనటువంటి వారినిగా యెంచుచున్నాడు. ఇది ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయము. అయితే, సమస్యలు ఏర్పడినప్పుడు, దేవుడు నన్ను మరచిపోయాడా? ఆయన నన్ను జ్ఞాపకము చేసుకుంటాడా? అని మనము అనుకుంటాము. చూడండి, ఈ వ్యక్తి నన్ను ఏలాగు కించపరచుచున్నాడు? ఈ ప్రజలు నన్ను ఎలా మోసము చేయుచున్నారు? మనలను అవమానపరిచే లేదా మోసం చేసేవారిని చూస్తూ, మన పక్షాన ఎవరైనా నిలబడతారా? అని ఆలోచిస్తూ, పూర్తిగా ఒంటరిగా ఉన్నాము, దేవుడు మనలను మరచిపోయాడు అని తలంచుకుంటాము. అయితే, దేవదూత అటువంటి మనలను చూచి, "మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు'' అని ఈ వచనమును ద్వారా మనకు నమ్మకాన్ని కలిగిస్తుంది.

ఒక కుటుంబపు వారు ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. అదే సమయములో, ఒక చిన్న కుక్క పిల్లను తీసుకొనివచ్చారు. ఆ చిన్న బిడ్డతో కూడా, ఈ యొక్క చిన్న కుక్క పిల్ల కూడా ఎదుగుచుండెను. ఆలాగున ఆ బిడ్డ మరియు కుక్క పిల్ల కూడా కలిసి పెరిగేకొలదీ, వారు విడదీయరాని స్నేహబంధముతో ఏకమయ్యారు. ఆ కుక్కపిల్ల ఆ బాలుని ప్రతిచోటా వెంబడించుచుండెను. కనుకనే, ఆ కుక్క పిల్ల ఒక నమ్మకమైన స్నేహితుని వలె ఆ పిల్లవానిని కాపాడుచుండెను. ఒకరోజు, తల్లి తన కుమారుడు చేసిన అల్లరి చేష్టలకు వానిని తిట్టి గద్దించినది. కానీ, తరువాత ఏమి జరిగిందో చూచినట్లయితే, ఆ సంఘటన ఆమెను ఆశ్చర్యపరిచింది. కానీ, ఆమె ఆలాగున జరుగుతుందని తను ఎన్నడు కూడా ఎదురు చూడలేదు. ఆమె ఆ పిల్లవానిని గద్దించినప్పుడు, ఆ కుక్క ఆమెపై తీవ్రంగా మొరగడం ప్రారంభించింది, ఆ కుక్క పిల్ల అటుఇటు తిరుగుతూ, ఆ బిడ్డను ఎవ్వరు కూడా ముట్టకూడదన్నట్లుగా, ఆ పిల్లవానిని ఆమె నుండి కాపాడడానికి ఆ పిల్లవాని ముందుకు దూకింది. ఆ బిడ్డ పట్ల కుక్కకు ఉన్న ప్రేమ మరియు స్వాధీనత యొక్క లోతును ఆమె గ్రహించింది.

అవును, నా ప్రియులారా, ఆలాంటిది, మన దేవుని యొక్క హృదయమై యున్నది. ఆయన మనలను ఎంతగా స్వాధీనము చేసుకొని యున్నాడనియు, ఆయన మనలను ఎంతగా ప్రేమించుచున్నాడనియు, మనము గుర్తించగలము. కారణము, మనకు ఏ కీడు జరుగకూడదు, మనలను కానీ మరియు మన ప్రాణములకు ఎవ్వరు కూడా ఎటువంటి హాని కలుగకుండా ఉండాలనియు ఆయన మన పట్ల వాంఛ కలిగియున్నాడు. అయితే, ఆయన యొక్క హృదయము కరిగిపోతుంది. మనం గాయపడినప్పుడు, ఆయన హృదయం మన కొరకు రక్తం కారుస్తుంది. ఆ వచనం ఇంకా ఇలాగున చెబుతుంది, " నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు; అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలిసికొందురు.'' దేవుడు మన కోసం లేచి, మనకు అన్యాయం చేసిన వారిపై తన దేవదూతలను పంపుతాడు. కానీ అంతకంటే ఎక్కువగా, మనం అవమానం లేదా కష్టాన్ని అనుభవించినప్పుడు, ఆయన మనలను సమృద్ధిగా ఆశీర్వదించడం ద్వారా పరిస్థితికి ప్రతీకారం తీర్చుకుంటాడు. మనం ఎదుర్కొనే ప్రతి శోధన దేవుని నుండి గొప్ప ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది. మనం బాధపడే ప్రతిసారీ, ఆయన మనలను ఉన్నతంగా పైకి లేవనెత్తుతాడు, మనలను అపరిమితంగా వృద్ధిపొందింపజేస్తాడు. మనలను ముట్టువాడు ఆయన కనుగుడ్డును ముట్టినవాడగును మరియు దేవుడు స్వయంగా వారి మీద ప్రతీకారం తీర్చుకుంటాడు. కనుకనే, మిమ్మును మీరు దేవునికి సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, నేటి వాగ్దానము ద్వారా మిమ్మును తన కనుపాపవలె ఆయన మిమ్మును కాచి కాపాడి, ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నేను కృతజ్ఞతతో నిండిన హృదయంతో నీ సన్నిధికి వచ్చుచున్నాము. దేవా, మమ్మును నీ కనుపాపవలె మమ్మును చేసినందుకై మరియు మమ్మును ఎంతో ప్రేమగా పరామర్శించుచున్నందుకై నీకు వందనాలు. ప్రభువా, శోధనలు వచ్చినప్పుడు, నీవే మా రక్షకుడివనియు, మా ఆశ్రయమని గుర్తుంచుకోవడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా కొరకు నీవు లేచి, ప్రతి అవమానాన్ని అపరిమితమైన ఆశీర్వాదాలుగా మార్చుము. దేవా, మా పక్షమున యుద్ధము చేయుడానికిని మరియు మాకు హాని కలిగించాలని చూస్తున్న వారిని నిశ్శబ్దం చేయడానికి నీ దేవదూతలను మాకు ముందుగా పంపుము. ప్రభువా, నీవు ఎల్లప్పుడు, మమ్మును గమనిస్తున్నావనే నిరీక్షణతో, మేము నెమ్మదిగా ఉండునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. దేవా, నీవు మమ్మును ఉన్నతంగా పైకి లేవనెత్తి, అన్నిటిలోను అత్యధికమైన విజయమును సాధించునట్లుగా మా పోరాటాలను నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము. యేసయ్యా, నీవే మా పక్షమున యుద్ధము చేసి, మాకు విజయమును అనుగ్రహించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.