నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేను మీకు ఆనందకరమైన మరియు ఆశీర్వాదకరమైన దినముగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు ఈ రోజు మిమ్మల్ని ప్రత్యేకంగా మరియు నూతన విధానంలో ఆశీర్వదించాలని కోరుచున్నాను. నా మనవడైన శామ్యేల్ మరియు తన భార్య శిల్పా వారి యొక్క 6వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారని తెలియజేయుటలో నేను ఎంతగానో ఆనందించుచున్నాను. ప్రభువు వారిని నూతనమైన మరియు అద్భుతమైన విధానాలలో తన ఆశీర్వాదాలను కుమ్మరించాలని నేను కోరుచున్నాను. నేడు ఈ సందేశమును చదువుచున్న మీలో ఎవరైతే, నేడు వివాహ దినములు, పుట్టినరోజులు లేదా ఇతర ప్రాముఖ్యమైన దినాలను జరుపుకుంటున్నారో ప్రభువు మిమ్మును కూడా నూతన విధానంగా దీవించును గాక.
నా ప్రియులారా, మనం నేటి వాగ్దానముగా బైబిల్ నుండి హోషేయ 6:3వ వచనమును ఈరోజు ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము ఇలాగున చెబుతుంది, "యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి; యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరి ంచుదము రండి. ఉదయము తప్పక వచ్చురీతిని ఆయన ఉదయించును; వర్షమువలె ఆయన మన యొద్దకు వచ్చును; భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును'' అని చెప్పబడిన ప్రకారం మనకు తగిన కాలములో వర్షం కురిసినప్పుడు, అది మనకు గొప్ప ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది కదా! అదేవిధంగా, ప్రభువు మీ జీవితంలో కూడా అత్యధికమైన ఆశీర్వాదములను వర్షము వలె కురిపిస్తాడు. కనుకనే, దిగులుపడకండి.
బైబిల్‌లో చూచినట్లయితే, ఆదికాండము 24:1వ వచనములో అబ్రాహాము ప్రభువు చేత ఆశీర్వదింపబడినట్లుగా మనము చదువుచున్నాము. " అబ్రాహాము బహు కాలము గడిచిన వృద్ధుడై యుండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను'' అని చెప్పబడిన ప్రకారం అబ్రాహామును ప్రభువు ఆశీర్వదించాడు. అబ్రాహాము ప్రభువును శ్రద్ధగా వెదికాడు. కాబట్టి, అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడని పై వచనము మనకు తెలియజేయుచున్నది. అదేవిధంగా, ఆదికాండము 32:26లో, మనం యాకోబును గురించి చదువుతాము. యాకోబు తన జీవితాన్ని పరిపూర్ణముగా ప్రభువునకు సమర్పించుకొని, ఆయన మీద ఆధారపడ్డాడు. 'ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా, 'ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యనని' అతడు చెప్పి మోకరించి ప్రార్థించాడు. అదేవిధంగానే, స్నేహితులారా, మనం కూడా పట్టుదలతోను మరియు విశ్వాసంతోను ప్రార్థించాలి. మనము దేవునితో మాట్లాడాలి, ఆయనతో నడవాలి. ఇంకను ప్రతిదినము ఆయన నడిపింపును మరియు ఆశీర్వాదం కొరకు అడగాలి. ఇంకను, 'ప్రభువా, నీవే నన్ను ఆశీర్వదించాలి, నీ చేయి నా మీద ఉంచి, నన్ను నడిపించాలని,' ఆయనకు మొఱ్ఱపెట్టాలి.
నా ప్రియులారా, మనం అలాగున ప్రార్థించినట్లయితే ఏమి జరుగుతుంది? యెషయా 26:3వ వచనములో ఉన్న లేఖనమును చదివినట్లయితే, "ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచియున్నాడు'' అని చెప్పబడినట్లుగానే, అవును, యాకోబు ఎల్లప్పుడు ప్రభువును తనతో ఉండునట్లుగా ఎంతో జాగ్రత్తపడ్డాడు. "అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను.'' కనుకనే, అతని విశ్వసనీయత కారణంగా, దేవుడు అతనికి 'ఇశ్రాయేలు' అనే ఒక కొత్త పేరును పెట్టాడు. ఈ రోజు కూడా ఆ దేశము యొక్క పేరు కూడా ఇశ్రాయేలుగా పిలువబడుచున్నది. అతడు ఎంత దీవింపబడిన వ్యక్తి కదా! ఇంకను ఇది గొప్ప ఎంత అసాధారణీయమైన ఆశీర్వాదం ఉన్నది కదా!
నా ప్రియ స్నేహితులారా, నేడు మీ పూర్ణ హృదయముతో మీరు ప్రభువును జాగ్రత్తగా వెదకినట్లయితే, మీరు కూడా అటువంటి సమృద్ధియైన ఆశీర్వాదమును పొందుకుంటారు. ఇప్పుడు ప్రార్థించి మనము అటువంటి ఆశీర్వాదమును పొందుకుందామా? నిత్యము దేవుని హస్తము మిమ్మును నడిపించును గాక మరియు మీ జీవితములో ఆయన ఆశీర్వాదములను పొంగిపోర్లుతాయి. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మా ప్రేమగల పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. సంపూర్ణమైన వర్షం వంటి నీ యొక్క సమృద్ధి ఆశీర్వాదాల వాగ్దానానికై నీకు వందనాలు. ప్రభువా, అబ్రాహాము వలె నిన్ను శ్రద్ధగా వెదకుటకు మరియు యాకోబు వలె మమ్మును మేము సంపూర్ణంగా అప్పగించుకొనుటకు మాకు నేర్పుము. దేవా, నీ సన్నిధిలో పట్టుదల మరియు అచంచల విశ్వాసంతో ప్రార్థించడానికి మా హృదయాన్ని బలపరచు ము. ప్రభువా, నీవు మమ్మును ఆశీర్వదించి, మా అడుగులు స్థిరపరచి మమ్మును ఆశీర్వాదపు మార్గములో నడిపించే వరకు మేము నిన్ను విడువకుండా పట్టుదలతో ప్రార్థించుటకు మాకు నేర్పుము. దేవా, మేము నీ మీద మా ఆలోచనలను స్థిరంగా నిలిపి ఉంచునట్లుగా దయచేసి నీ పరిపూర్ణ శాంతితో మా మనస్సును నింపుము. ప్రభువా, నీ నిత్య విశ్వాసాన్ని నమ్ముచూ, నీతో సన్నిహితంగా నడవడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా జీవితం మరియు మా ప్రియులైన వారి మీద నీ దీవెనల వర్షం కురిపించుము. ప్రభువా, మా జీవితం నీ మహిమను ప్రతిబింబించునట్లుగాను మరియు నీ పరిశుద్ధ నామాన్ని ఘనపరచునట్లుగా మాకు అటువంటి కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు జీవముగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.