నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములను తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానము బైబిల్ నుండి యాకోబు 1:17 అను అద్భుతమైన ఒక దేవుని లేఖన భాగమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " శ్రేష్ఠమైన ప్రతి యావియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును; ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయయైనను లేదు. '' ప్రకారము ఇది ఎంత అద్భుతమైన వాగ్దానమై యున్నది కదా. అవును, ప్రతి యీవియు, ప్రతి వరమును జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చుచున్నది. కాబట్టి, మీరు చింతించకండి. ధైర్యముగా ఉండండి.

అవును, స్నేహితులారా, సమస్తమును తండ్రి నుండి మీ యొద్దకు వచ్చుచున్నవి. మీరు, 'నేను చీకటిలో ఉన్నాను మరియు నాకు సహాయము చేయుటకు ఎవరు లేరు అని అంటున్నారా? నేను ఎదుర్కొంటున్న ఇంత గొప్ప పెద్ద సమస్య నుండి నన్ను బయటకు తీసుకొని వచ్చేవారు ఎవరు కూడా లేరు అంటున్నారా? ఈ చింత నన్ను చంపుతుంది అని అంటున్నారా? ఇంకా నాకు ఆత్మహత్య మాత్రమే శరణ్యము అని మీరు భావిస్తున్నారా? మీరు ఎన్నో కష్టాలలో ఉన్నారా?' అయితే, ఈ వాగ్దానమును జ్ఞాపకము ఉంచుకొనండి. అవును, స్నేహితులారా, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి శ్రేష్ఠమైన ప్రతియావియు మరియు సంపూర్ణమైన ప్రతివరమును కూడా మీ యొద్దకు వస్తుంది. ఇటువంటి దేవునితో మీరు అన్యోన్యసహవాసము కలిగియుండాలి. అంతమాత్రమే కాదు, మీరు మీ పూర్ణ హృదయముతో దేవుని నమ్మినట్లయితే, తండ్రి యొద్ద ఉన్న గొప్ప ఆశీర్వాదములను మీరు చూచెదరు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 85:12 వ వచనములో చూచినట్లయితే, "యెహోవా ఉత్తమమైనదాని ననుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును''ప్రకారం దేవుని యొక్క ఉత్తమమైన దానిని పొందుకోవాలని దేవుడు మన పట్ల వాంఛ కలిగియున్నాడు. కనుకనే, ప్రభువునందు ఆనందించండి.

అవును, నా ప్రియులారా, దేవుని యొద్ద నుండి ఉత్తమమైన దానిని ఎలా పొందుకొనగలము? బైబిల్ నుండి కీర్తనలు 23:1వ వచనములో మనము చూచినట్లయితే, " యెహోవా నా కాపరి '' అని దావీదు అంటున్నాడు. అవును, "యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు'' అని దావీదు ఎంతో స్పష్టముగా పలుకుచున్నాడు. నేడు మీరు అనేకమైన వాటిని గురించి చింతించుచున్న నా ప్రియ స్నేహితులారా, నేడు మీకు కూడా అదే జరుగనై యున్నది. దేవుని హత్తుకొని ఉండండి, మీరు ఆయనను మీ కాపరిగా కలిగియుండండి. ఎల్లప్పుడు ఆయన చెంతకు చేరండి. అప్పుడు ప్రభువు మీకు కృపాక్షేమములను అనుగ్రహిస్తాడు. ఇంకను, కీర్తనలు 23:6వ వచనమును మనము చదివినట్లయితే, " నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను'' ప్రకారము మీరు చింతించకండి, ప్రభువును గట్టిగా హత్తుకొనండి, దేవుని యొక్క కృపాక్షేమములు మీ జీవితములో మీరు చూచెదరు. మీ జీవితములో ప్రభువు ఈ అవసరతలన్నిటిని నేడు తీర్చబోవుచున్నాడు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపాకనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. తండ్రీ, నీ అద్భుతమైన సన్నిధానమునకై నీకు వందనాలు. దేవా, ఈ లోక చింతలన్నిటిని మాలో నుండి ఇప్పుడే తొలగించి, మా జీవితాలలో కృపాక్షేమములతో మమ్మును నింపుము. ప్రభువా, మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడవు, కనుకనే, మా మొఱ్ఱలను ఆలకించి, మా ప్రార్థనలకు జవాబును దయచేయుము మరియు మా అవసరతలన్నిటిని ఇప్పుడే తీర్చుము. ప్రభువా, నీవే మా కాపరి అని మేము గుర్తెరుగునట్లుగా మాకు అటువంటి కృపను అనుగ్రహించుము. ప్రభువా, చీకటి మరియు నిరాశ సమయాలలో, నిన్ను అంటిపెట్టుకుని ఉండటానికి మరియు మా నిరీక్షణను కోల్పోకుండా ఉండటానికి మాకు నీ కృపను దయచేయుము. దేవా, మా జీవితంలోని అన్ని రోజులలో నీ మంచితనం మరియు కృప మమ్మును వెంబడించునట్లు చేయుము. ప్రభువా, మాకు కాపరిగా ఉండి, మమ్మును పచ్చిక బయళ్లకు మరియు శాంతికరమైన జలముల యొద్ద నడిపించుము. దేవా, మా హృదయం నుండి చింత, భయం మరియు దుఃఖం యొక్క ప్రతి భారాన్ని తొలగించుము. యేసయ్యా, మాకు కావలసని వాటన్నిటిని నీవు మాకు అనుగ్రహిస్తావని నీ శాంతి మరియు నీ యందు నమ్మకముతో మా జీవితాన్ని నింపుము. ప్రభువా, మా ప్రతి కష్టాల నుండి మరియు నీ మహిమాన్వితమైన వెలుగులోనికి నీవు మమ్మును తీసుకువస్తావని మేము నమ్ముచున్నాము. దేవా, నీ యొక్క మార్పులేని ప్రేమకు మరియు రాబోయే సమృద్ధిగా ఆశీర్వాదాలకు నీకే సమస్త మహిమ చెల్లించుచు యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.