నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. మనలను ఆశ్చర్యకరంగా ఆశీర్వదించే దేవుని గురించి, ఆయన వాక్యమును గురించి మీతో మాట్లాడడము ఎంత అద్భుతము కదా! ఈ రోజు దేవుడు మనలను నూతనంగాను మరియు ఆశ్చర్యకరమైన రీతిలో ఆశీర్వదించబోవుచున్నాడు. కనుకనే, దేవుని వాక్యమును మనము కలిసి చదువుదాము. అందుకే నేటి దేవుని వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 14:26 ప్రకటించినట్లుగా: "ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును'' ప్రకారం ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా మీకు సమస్తమును బోధిస్తాడు. కనుకనే, మీరు చింతించకండి.

నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు ఒక గొప్ప ఆశీర్వాదమును పొందుకొనబోవుచున్నారు. కొంత సమయము ఉన్నప్పటికిని దేవుని యొద్ద నుండి గొప్ప ఆశీర్వాదమును పొందుకొనబోవుచున్నాము. బైబిల్ నుండి లూకా 11:13లో ఈలాగున చదువుచున్నాము, " పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను'' ఈ వచనము ప్రకారంగా ప్రభువు నేడు తన పరిశుద్ధాత్మతో మిమ్మును దీవిస్తాడు. నా పరిశుద్ధాత్ముడు ఎవరు? 2 కొరింథీయులకు 3:17వ వచనమును మనము చూచినట్లయితే, " ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ యెక్కడ నుండునో అక్కడ స్వాత్రంత్యము నుండును'' అని వ్రాయబడినట్లుగానే, ప్రభువే పరిశుద్ధాత్ముడై యున్నాడు. పరిశుద్ధాత్మ రూపములో ప్రభువే మీ జీవితములో అడుగుపెడతాడు. ఆయన మహిమార్ధమైన మిమ్మును ప్రకాశింపజేస్తాడు. అందుకే యెషయా 44:3లో దేవుడు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, "నేను దప్పిగలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టినవారిని నేనాశీర్వదించెదను'' ప్రకారం దేవుడు మీ మీదను మరియు మీ సంతతి మీదను తన ఆత్మను కుమ్మరించి, మిమ్మును ఆశీర్వదిస్తాడు.

నా స్వంత జీవితం నుండి ఒక సాక్ష్యాన్ని పంచుకుంటాను. 1962లో నా భర్తగారు పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్న తన అనుభవాలన్నిటిని ఆయన నాతో పంచుకునేవారు. ఆ సమయములో ఎన్నో సంవత్సరముల తర్వాత, ఒక మగ బిడ్డను పొందుకున్నాము. ఆ బిడ్డయే పాల్ దినకరన్. ఒక చక్కటి బిడ్డ బహుమానముగా ఉన్నప్పటికిని, నేను ఈ పరిశుద్ధాత్మను ఎలాగున పొందుకోవాలని ఆలోచించాను. ప్రభువు నా హృదయములో ఉన్న వాంఛతో పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలో అడుగుతూ ఉంటాను. నా తల్లిగారి ఇంటిలో బిడ్డతో నివసించాను. రాత్రి సమయములో మోకరించి, ప్రభువునకు మొఱ్ఱపెడుతూ ఉంటాను. ప్రతిరోజు మొఱ్ఱపెడుతూ ఉంటాను. పరిశుద్ధాత్మను అనుగ్రహించుట లేనట్లయితే, నేను మరణిస్తాను అని చెప్పి ప్రార్థించినప్పుడు, ప్రభువు నా మొఱ్ఱను ఆలకించాడు. పరిశుద్ధాత్మతో నాకు బాప్తిస్మమిచ్చాడు. అదే ఆశీర్వాదం ఈ రోజు మీ కొరకు వేచి ఉన్నది.

నా ప్రియ స్నేహితులారా, నేడు మీ జీవితములో ఈలాగున చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. "అడుగుడి మీకియ్యబడును'' అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. అవును, నేను దేవుని అడిగియున్నాను. కనుకనే, నేను పరిశుద్ధాత్మతో దీవించబడ్డాను. ఈ రోజు కూడా 86 సంవత్సరాల వయస్సులో కూడా నేను పరిశుద్ధాత్మ సహాయముతో దేవునికి పరిచర్యను చేయుచున్నాను. అదేవిధముగా, నేడు మీరు ఎటువంటి వారైనప్పటికిని లేక మీరు వృద్ధులైనప్పటికిని, పరిశుద్ధాత్మను మీరు అడగవచ్చును. మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలని వాంఛ కలిగి దేవుని అడిగినప్పుడు, ఇప్పుడే ప్రభువు మిమ్మును తన పరిశుద్ధాత్మ అభిషేకముతో దీవిస్తాడు. కనుకనే, నేడు మీకు అటువంటి పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకునే విశ్వాసము మీకున్నదా? రండి! ప్రార్థన చేసి, పరిశుద్ధాత్మశక్తిని పొందుకుందాము. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
అమూల్యమైన మా పరలోకమందున్న ప్రతి తండ్రీ, మా పూర్ణ హృదయంతో మేము నీ యెదుటకు వచ్చుచున్నాము. దేవా, అడిగే వారందరిపై పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానని నీ వాగ్దానానికై నీకు వందనాలు. ప్రభువా, ఈ రోజు ఈ అమూల్యమైన వరమును స్వీకరించడానికి మేము మా హృదయాన్ని తెరచుచున్నాము. ప్రభువా, నీ ఆత్మతో మమ్మును నింపుము మరియు నీ సర్వసత్యములోనికి మమ్మును నడిపించుము. ప్రభువా, నీ సన్నిధానమునకై నీకు వందనాలు. దేవా, నీ యొక్క ప్రభావము చేత మా మధ్యలోనికి దిగిరమ్ము. దేవా, నేడే నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో మమ్మును దీవించుము. ప్రభువా, 'అడుగుడి మీకియ్యబడును' అని సెలవిచ్చినట్లుగానే, నీ పరిశుద్ధాత్మ అభిషేకమును మేము అడుగుచున్నాము. ప్రభువా, మాకు సమస్తమును బోధించుము మరియు నీ పరిశుద్ధమైన వాక్యమును మాకు జ్ఞాపకము చేయుము. దేవా, మా ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చి, నీ మహిమ కొరకు మా జీవితాన్ని ఒక నీ కొరకు వాడబడు పాత్రగా మార్చుము. యేసయ్యా, నీ సన్నిధితోను మరియు పరిశుద్ధాత్మ శక్తితో మమ్మును మరియు మా కుటుంబాన్ని ఆశీర్వదించుము. దేవా, నీవు మా జీవితాన్ని మారుస్తావని తెలిసి విశ్వాసంతో నడవడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ ప్రేమ, దయ మరియు ముఖ్యంగా, నీ పరిశుద్ధాత్మ యొక్క అమూల్యమైన వరములను మాకు అనుగ్రహించి, అనేకులకు దీవెనకరముగా మమ్మును మార్చుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.