నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి దానియేలు 12:3వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకా శించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు'' ప్రకారం, అవును, ప్రియులారా, మీరు జ్ఞానము కలిగి ఉన్నట్లయితే, మీరు ఆకాశములోని జ్యోతుల వలె ప్రకాశించుదురు.

జ్ఞానం అంటే అర్థం ఏమిటి? బైబిల్‌లో యాకోబు 3:17వ వచనములో మనము చూచినట్లయితే, "అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది'' అని చెప్పబడియున్నది. అనేకసార్లు, మనము తెలివికి మరియు జ్ఞానానికి ఉన్న వ్యత్యాసమును గమనించము. ఏమి చెప్పాలో తెలుసుకోవడం తెలివి అంటారు మరియు ఎప్పుడు చెప్పాలో తెలుసుకోవడమే జ్ఞానము అవుతుంది. అసలు చెప్పాలా లేక వద్దా అనేది జ్ఞానము.

బైబిల్ గ్రంథములో యేసు ప్రభువు యొక్క జ్ఞానమును చూచినట్లయితే, అనేకులు ఆయన యొద్దకు వచ్చి ఆలకించడానికి ఆయన జ్ఞానము ఎలా ఆకర్షించినదో మనము బైబిల్‌లో చూడగలుగుచున్నాము. దేవుని వాక్యాన్ని ఆయన అందించిన తీరు ఎంతో మనోహరమైనది. ఆయన మాట్లాడుచున్నప్పుడు ఆలకించడానికి అనేకమంది అరణ్యమునకు సహితము వచ్చియున్నారు. యేసయ్యా, మాటలను ఆలకించడానికి వేలకొలది మంది ప్రజలు అక్కడ బహుసమూహముగా కూడి యున్నారు. ప్రజలు అర్థము చేసుకొను రీతిలో ఉపమాన రీతిలో బోధించాడు. ఇంకను 1 కొరింథీయులకు 1:24వ వచనములో మనము చూచినట్లయితే, "ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు'' అని చెప్పబడినట్లుగానే, యేసు క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు. ఇంకను కొలొస్సయులకు 2:3వ వచనములో చూచినట్లయితే, "బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై యున్నవి'' అన్న వచనం ప్రకారం ఇటువంటి జ్ఞానమును ఇచ్చే యేసును పొందుకొనుటకు మనము ప్రార్థిద్దాము. ఆయన తన యందు గుప్తములై ఉన్న శక్తిని, తెలివిని, జ్ఞానమును మనకు అనుగ్రహిస్తాడు.

నా ప్రియులారా, ఇంకను మనము ఏమి చెప్పాలో మనకు తెలియని సమయములో మనలను బాధపెట్టుచున్న ప్రజలకు ఎలా చెప్పాలో తెలియనప్పుడు, మన జవాబును కోరుకుంటున్న ప్రజల యెదుట, మన ఆలోచనలు కావలసిన వారి యెదుట మనపైన మరియు మన మనస్సుపైన మనము ఆధారపడవద్దు. అయితే, అటువంటి సమయములో మనము యేసు వైపు మాత్రమే చూద్దాము. ఇంకను బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై యున్నవి. మీకు ఏమి చెప్పాలో తెలియనప్పుడు, ప్రభువే మీకు బోధిస్తాడు. సరియైన మాటలను ప్రభువు మీకు అందిస్తాడు. చక్కగా చెప్పగలిగే ధైర్యమును మీకు ఇస్తాడు. కనుకనే, ప్రభువునందు ఆనందించండి.

నా ప్రియులారా, నేడు మీరు ఏదైన ప్రదర్శన చేయవలసి యున్నదేమో? లేక మీరు ముఖ్యమైన ప్రజలను కలుసుకొని, వారితో మాట్లాడవలసిన అవసరమున్నదేమో? మిమ్మును బాధిస్తున్నవారితో మీరు మాట్లాడాలి అని అనుకుంటున్నారేమో? ప్రభువు మీకు ఈ రోజు తప్పకుండా తన యందు గుప్తములై యున్న జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఇంకను మీరు ఏమి చెప్పాలో మీకు ఆ తెలివిని ఇస్తాడు మరియు ఎలా చెప్పాలో ఆ జ్ఞానమును కూడా దేవుడు మీకు నేడు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. అందుకే యాకోబు 1:5వ వచనములో మనము చూచినట్లయితే, "మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న యెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడు ను. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు'' అని చెప్పబడిన ప్రకారం నేడు మనము ఆకాశములోని నక్షత్రముల వలె ప్రకాశించుట కొరకు, ఈ రోజు ఈ ఇంతటి గొప్ప ధారాళమైన జ్ఞానమును మనము ప్రభువు యొద్ద నుండి పొందుకుందాము. తద్వారా మనం ఆకాశంలో నక్షత్రాల వలె ప్రకాశించుదాము. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీకు కావలసిన జ్ఞానమును ఇచ్చి, మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మహ్నోతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, ఈ రోజు మేము నీ యందు గుప్తమైన ఉన్న జ్ఞానాన్ని మరియు సర్వసంపదలను కోరుతూ నీ ముందుకు వచ్చుచున్నాము. ప్రభువా, మా సంబంధాలలో, పనిలో లేదా మమ్మును బాధపెట్టేవారిని ఎదుర్కొన్నప్పుడు కూడా ఏమి చెప్పాలో లేదా పరిస్థితులను తెలివిగా ఎలా నిర్వహించాలో మాకు తరచుగా తెలియదని మేము అంగీకరిస్తున్నాము. దేవా, దయచేసి మీ దివ్య జ్ఞానంతో మమ్మును నింపుము, సరైన పదాలను మాట్లాడటానికి, సరైన మార్గంలో వ్యవహరించడానికి మరియు మేము చేయు ప్రతిదానిలో నిజాయితీగా ఉండటానికి మమ్మును నడిపించుము. ప్రభువా, నీవే సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇచ్చేవాడివి మరియు నీలో జ్ఞానం మరియు తెలివి, సర్వ సంపదలు గుప్తములై యున్నవి గనుకనే, నీ యొద్ద అటువంటి జ్ఞానమును పొందుకొనుటకు మాకు సహాయము దయచేయుము. దేవా, నిన్ను సంపూర్ణంగా పొందుకొనే కృపను మాకు అనుగ్రహించుము. ఇంకను మా నోట నుండి వచ్చు ప్రతి మాట జ్ఞానవంతమైనదిగా మరియు తెలివితో కూడినదిగా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, ఈరోజు నీ సన్నిధిని పూర్తిగా స్వీకరించడానికి మాకు సహాయం చేయుము మరియు మా నోటి నుండి వచ్చే ప్రతి మాట ఆలోచనాత్మకంగా, దయతో కూడినదిగాను మరియు తెలివైనదిగా ఉండునట్లుగా చేయుము. దేవా, మమ్మును నీ యొక్క జ్ఞానంతో సన్నద్ధం చేయుము, మమ్మును ఆశీర్వదించుము మరియు ప్రతి క్షణం నీ యొక్క జ్ఞానంలో నడవడానికి మరియు ఆకాశములో జ్యోతుల వలె ప్రకాశించుటకు మాకు నీ యొక్క జ్ఞానమును అనుగ్రహించి, మమ్మును సరైన మార్గములో నడిపించుమని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.