నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మత్తయి 17:20,21 వ వచనములను మనము ధ్యానించబోవుచున్నాము. "అందుకాయన మీ అల్పవిశ్వాసము చేతనే; మీకు ఆవగింజంత విశ్వాసముండిన యెడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును; మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను'' అన్న వచనముల ప్రకారము అవును ప్రియులారా, మత్తయి 17వ అధ్యాయములో ఒక ప్రత్యేకమైన సందర్భములో ఈ లేఖనమును మనము చదువగలుగుతాము. వారు జనసమూహము నొద్దకు వచ్చినప్పుడు ఒక మనుష్యుడు ఆయన యొద్దకు వచ్చి ఆయన యెదుట మోకాళ్లూని, 'ప్రభువా, నా కుమారుని కరుణింపుము; వాడు చాంద్ర రోగియై మిక్కిలి బాధపడుచున్నాడు; ఏలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరుచుగా పడుచున్నాడు; నీ శిష్యుల యొద్దకు వానిని తీసికొని వచ్చితిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరి. కానీ, వాని రోగము నుండి వానిని విడిపించుమని కోరియున్నాడు. వానిని నా యొద్దకు తీసికొనిరండని యేసు చెప్పెను. అంతట యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదలి పోయెను; ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు నొద్దకు వచ్చి మేమెందుచేత దానిని వెళ్లగొట్టలేక పోతిమని అడిగిరి. అందుకాయన, మీ అల్పవిశ్వాసము చేతనే; మీకు ఆవగింజంత విశ్వాసముండిన యెడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును; మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను.''
అవును నా ప్రియ స్నేహితులారా, అటువంటి విధమైన విశ్వాసమును మనము కలిగి ఉండాలని ప్రభువు మన పట్ల కోరుకుంటున్నాడు. ఆయనను పూర్తిగా విశ్వసించే విశ్వాసం. మనము ఆయన యందు విశ్వాసముంచి, కొండలను పెకలింపమని పలికినప్పుడు, ఆ కొండలు సహితము కదిలిపోతాయి. అనేకసార్లు తల్లిదండ్రులు తమ బిడ్డల కొరకు ఎన్నో శ్రమలు పడుతుంటారు. వారిని చదివించడానికి ఎంతో కష్టపడతారు, వారి ఫీజు కొరకు ప్రయాసపడతారు. వారిని చక్కగా పెంచుతారు. చక్కగా అన్నిటిని నేర్పిస్తారు. ఇంతగా కృషి చేసిన తర్వాత కూడా ఆ బిడ్డ సరిగ్గా ప్రవర్తించకపోయినా, పరీక్షలలో వైఫల్యము పొందినా, తల్లిదండ్రుల మాట వినకపోయిన తల్లిదండ్రులు ఎంతగానో బాధపడతారు. అంతమాత్రమే కాదు, 'నా బిడ్డను ఎంతో కష్టపడి చక్కగా పెంచాను. అన్నిటిని చక్కగా నేర్పించాను. అయితే, ఇటువంటి ఫలితాలు ఎందుకు వచ్చాయి?' అని అనుకుంటారు.
నా ప్రియ స్నేహితులారా, యేసు ప్రభువు కూడా అదేవిధముగా, భావించి ఉండవచ్చును. వారికి అనేక అద్భుతాలు చూపించాను, వారు తెలుసు కోవలసినవన్నియు నేర్పించాను, అన్ని విధాలుగా వాటిని సమకూర్చాను- కానీ, వారు ఎందుకు నమ్మలేకపోయారు? అందుకు యేసు విశ్వాసములేని మూర్ఖ తరమువారలారా, మీతో నేనెంత కాలము ఉందును? ఎంత వరకు మిమ్మును సహింతును? మీరు ఎందుకు విశ్వసించలేకపోతున్నారు? అని ఆయన తన శిష్యులను ప్రశ్నించాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, ఆవగింజంత విశ్వాసమును మీరు కలిగి యుండాలని ప్రభువు మీ పట్ల కోరుకుంటున్నాడు. మీ యెదుట మీరు కదిలింపలేని గొప్ప కార్యాలు ఉండవచ్చు ను. స్వస్థత పొందలేనటువంటి అనారోగ్యము, మీరు పొందుకోలేకపోతున్న ఉద్యోగము, మీరు పొందుకోలేకపోతున్న ఉద్యోగ బదిలీ, మీ భవిష్యత్తులో మీరు చూడలేని జీవిత భాగస్వామిని అయినను సరే, ఆవగింజంత విశ్వాసమును మీరు కలిగి యున్నట్లయితే, మీ జీవితములో కొండలు కదిలిపోతాయి. మీరు దేని కొరకైతే, ఎదురుచూస్తున్నారో, దానిని పొందుకుంటారు మరియు మీ జీవితములో అద్భుతాలను పొందుకొని అనుభవిస్తారు.
నేడు నా ప్రియులారా, మనము ప్రార్థించుచుండగా, మనము కదిలించబడలేని విశ్వాసమును కలిగియుందాము. ప్రశ్నతో లేక అనుమానముతో ప్రార్థించుడము కాదు కానీ, ప్రియ స్నేహితులారా, యేసయ్యా యొక్క శక్తిని, విశ్వసిస్తూ, ప్రార్థిద్దాము. అప్పుడు మన జీవితములో కొండలు పెకలింపబడతాయి. జీవితములోనికి మనకు అడ్డుగా ఉన్న కొండలన్నియు కదిలిపోతాయి. ఆ విశ్వాసమును పొందుకొనుటకు ఇప్పుడే ప్రార్థిద్దామా? దేవునికి అసాధ్యమైనదేదియు లేదు. కాబట్టి, ఆవగింజంత విశ్వాసమును కలిగి యున్నప్పుడు, నేటి వాగ్దానము ద్వారా ఈ ఆశీర్వాదాన్ని పొందుకొని అనుభవిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
విశ్వాసమునకు కర్తవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, నీ శక్తిని పొందుకొనుటకు మేము నీ సన్నిధికి వచ్చి ప్రార్థించుచున్నాము, మా జీవితములో ఆశీర్వాదాలను అడ్డుకుంటున్న కొండల వంటి సమస్యలన్నిటిని కూడా, ఈ రోజు కదిలిపోవునట్లు చేయుము. దేవా, మమ్మును చుట్టుకొనియున్న బంధకములన్నియు విరిగిపోవునట్లు చేయుము. యేసయ్యా, మా గృహములో ఉన్న ప్రతి అంధకార దురాత్మ శక్తులన్నియు నీ నామమున విడిచిపోవునట్లు చేయుము. ప్రభువా, నేడు మా శరీరములను బాధపెట్టుచున్న ప్రతి అనారోగ్యము మా నుండి తొలగిపోవునట్లు చేయుము. దేవా, మా జీవితములో ఆటంకపరచబడిన ప్రతి ఆశీర్వాదము మా యొద్దకు వచ్చునట్లు చేయుము. అది బదలీయైన, ఉద్యోగమైనను, ప్రమోషన్ లేక సంతానమైనను అయినను మేము పొందుకొనునట్లు చేయుము. ఇంకను మా కోర్టుకేసు మరియు అప్పుల నుండియు మమ్మును విడిపించుము. యేసయ్యా, మా విశ్వాసం అల్పముగా ఉన్నను, ఆవగింజంత విశ్వాసము కలిగి ఉండునట్లుగాను, నీకు అసాధ్యమైనది ఏదీయు లేదని మేము నమ్మునట్లుగా కృపను దయచేయుము. ప్రభువా, మా జీవితంలోకి స్వస్థత, సదుపాయం మరియు అద్భుతాలను తీసుకొని వచ్చునట్లుగాను, నీ ప్రేమను లేదా నీ వాగ్దానాలను మేము ఎన్నటికిని అనుమానించకుండా మా విశ్వాసాన్ని బలపరచుము. దేవా, మేము అడుగువాటన్నిటికంటే లేదా ఊహించిన దానికంటే అత్యధికముగా మాకు దయచేస్తావని మా చింతలన్నింటిని నీ చేతులకు అప్పగించుచూ, యేసుక్రీస్తు అతి శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.