నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 15:7వ వచనమును మనము తీసుకొనబడినది. ఆ వచనములో యేసు ప్రభువు, "నా యందు మీరును మీ యందు నా మాటలును నిలిచి యుండిన యెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును'' అన్న ఈ వచనం ప్రకారం, ప్రభువు మీ కోరికలను నెరవేర్చాలని మరియు మీ హృదయ వాంఛలను తీర్చాలని ఆయన మీ పట్ల కోరుకుంటున్నాడు. అదేవిధముగా, బైబిల్‌లో కీర్తనలు 20:4వ వచనములో ఈలాగున చెప్పబడియున్నది, "నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక.'' అవును, అయితే మనం కోరుకున్నది ఆయన ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడంటే, మనం యేసులో నిలిచి ఉన్నప్పుడు మరియు ఆయన మాటలు మనలో నిలిచి ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. అప్పుడు, మనం అడిగినట్లుగా, యేసు మన కొరకు దానిని తప్పకుండా జరిగిస్తాడు. ఎందుకంటే, మన విన్నపములు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంటాయి. గనుకనే, మనం దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించినప్పుడు, మనం నిత్యజీవమును పొందుతాము.
అయితే, నా ప్రియులారా, మనం దేవుని చిత్తం నుండి దూరమై, అపవాది మరియు ఈ లోకం లేదా మన స్వంత స్వార్థపూరితమైన కోరికలను అనుసరించినప్పుడు, మనకు మనమే నాశనమును తెచ్చుకుంటాము. దేవుడు లేకుండా మనం నశించిపోతాము మరియు ఈ లోకములో నాశనమవుతాము. ప్రపంచంలో ఎందరో తారలుగా ఎదగడం, పేరు ప్రఖ్యాతి, ఘన విజయాలు సాధించడం ద్వారా గర్వంతో ఉన్నత శిఖరాలను అందుకోవడం మనం చూస్తూనే ఉన్నాము. అయినప్పటికిని, వారు దేవుడు లేకుండా తమ కొరకు జీవించుచున్నప్పుడు, వారు తమ విజయాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతగానో కష్టపడతారు. అంతమాత్రమే కాదు, చాలామంది పడిపోతారు. కొందరు నిరాశతో పోరాడుతారు, కొందరు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారతారు, కొందరు సమస్తమును కోల్పోతారు మరియు విషాదకరంగా, మరి కొందరు తమ ప్రాణాలను కూడా తీసుకొనుటకు ఆత్మహత్యను చేసుకుంటారు. కానీ మనం యేసులో నిలిచి, ఆయన వాక్యానికి అనుగుణంగా మన జీవితాలను మార్చుకున్నట్లయితే, ఆయన మనలను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. మనం ఏమి అడిగినా, ఆయన మన కొరకు దానిని జరిగిస్తాడు. ఎందుకంటే, మన కోరికలు ఆయన పరిపూర్ణ సంకల్పం ద్వారా రూపుదిద్దుకుంటాయి. ఇప్పుడే ప్రభువు మీ కొరకు దానిని చేస్తాడు! అద్భుతంగా, ఆయన ఒక గృహము, ఒక ఉద్యోగం, సమాధానము మరియు శ్రేయస్సును అనుగ్రహిస్తాడు. ఆయన మీ చదువులలో, ఇంటర్వ్యూలలో, వ్యాపారంలో, పరిచర్యలో మరియు మీ వ్యవసాయంలో కూడా మిమ్మల్ని పైకి లేవనెత్తుతాడు. ఈ రోజు, ఈ దైవీకమైన ఆశీర్వాదాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి దేవుని హస్తం మీ మీదికి దిగివస్తుంది.
తిరుచ్చి నుండి వచ్చిన సహోదరి రెబెక్కా దేవుని విశ్వసనీయతను గురించి శక్తివంతమైన సాక్ష్యాన్ని పంచుకున్నారు. ఆమె భర్తయైన ఇశ్రాయేలు, ఒక ్రపైవేట్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేశాడు. కానీ, అతని సహోద్యోగుల యొక్క అసూయ కారణంగా ఆ ఉద్యోమును విడిచిపెట్టి, వెళ్ళవలసి వచ్చినది. అతను నూతన ఉద్యోగం కొరకు ఎంతగానో కష్టపడ్డాడు మరియు అతనికి ఇచ్చిన జీతం అతను గతంలో సంపాదించిన దానికంటే చాలా తక్కువ. అయినప్పటికిని, అతను ఒకప్పుడు సంపాదించిన జీతం పొందాలనే తన కోరికను కొనసాగించాడు.
ఇటువంటి క్లిష్టమైన సమయంలో, వారు తిరుచ్చిలోని యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురములో నిర్వహించబడిన ప్రార్థనా కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ, దేవుడు 'వారిని వెయ్యి రెట్లు ఆశీర్వదిస్తాడని' ద్వితీయోపదేశకాండము 1:11 వ వచనము నుండి వారు ఒక ప్రవచనాత్మకమైన వాగ్దానమును పొందుకున్నారు. వారు ఈ వాగ్దానానికి విధేయతను చూపుతూ, సహోదరులు ఇశ్రాయేలు, నాకు ప్రార్థన కొరకు ఒక ప్రార్థనా విన్నపమును వ్రాసి పంపించారు. మరియు నేను ఆ విన్నపము కొరకు ప్రార్థించి ఈలాగున జవాబును పంపించాను, ' దేవుడు సరైన మంచి ఉద్యోగమును అనుగ్రహిస్తాడని' నేను అతనికి హామీ ఇచ్చాను. వెంటనే, అతను ఒక పాఠశాలలో ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అద్భుత విధంగా, అతను కోల్పోయిన అదే జీతం అతనికి తిరిగి వచ్చింది! అతని జీవితములో దేవుని వాగ్దానము నెరవేరింది మరియు వారి కుటుంబం ఆయన సమృద్ధియైన ఆశీర్వాదమును అనుభవించింది. నా ప్రియ స్నేహితులారా, దేవుడు వారికి చేసినట్లుగానే, నేడు ఆయన మీకును కూడా జరిగిస్తాడు! కాబట్టి, నేడు మీరు యేసులో నిలిచి ఉండండి, ఆయన మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మహోన్నతుడవైన మా ప్రేమగల పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, మా హృదయ కోరికలను నెరవేరుస్తానని నీవు మాకు ఇచ్చిన వాగ్దానానికి మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, మేము నీలో నిలిచి ఉండటానికి మరియు నీ మాటలు మా యందు నిలిచి ఉండడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ మాటలు మాలో నివసించునట్లుగా చేయుము. దేవా, మా ప్రార్థనలు నీ హృదయానికి ఆనందాన్ని కలిగించేలా మా హృదయాన్ని నీ పరిపూర్ణమైన చిత్తంతో ఏకీభవించడానికి సహాయము చేయుము. దేవా, ఈ లోక మార్గాలలోనికి, మా స్వంత కోరికలలోనికి లేదా శత్రువు ప్రణాళికలలోనికి మేము వెళ్లకుండా మమ్మును కాపాడుము. ప్రభువా, నీలో మాకు నిత్యజీవం కలదని మేము గుర్తెరిగి, అన్నింటికంటే మించి మేము నిన్ను వెదకుటకు మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, నీ హస్తము మా మీద ఉంచి, మా జీవితంలోనికి శాంతి సమాధానము, వర్థిల్లతను, శ్రేయస్సు మరియు దైవీకమైన కటాక్షమును వచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మేము నీలో నిలిచి ఉన్నప్పుడు, నీ ప్రేమగల చేతుల ద్వారా మేము సమృద్ధిగా ఆశీర్వదించబడగలమని మేము నీ యందు నమ్మికతో మమ్మును మేము సంపూర్ణముగా నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము. యేసయ్యా, ద్రాక్షవల్లి వలె మేము నీలో నిలిచి ఉంటూ, మేము అడిగినవన్నియు పొందుకొనునట్లుగా మాకు అటువంటి గొప్ప కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.