నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములను తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 3:5వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము ఈలాగు చెబుతుంది, " యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును'' అను ఈ లేఖనము ద్వారా ప్రభువునందు ఎంత గొప్ప నిరీక్షణను మనము కలిగియున్నాము కదా. కావుననే, "నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును, యెహోవా నాకు ఆధారమై యున్నాడు'' అని భక్తుడు తెలియజేయుచున్నాడు. కాబట్టి, ప్రభువే మీకు ఆధారమని మీరు కూడా ధైర్యంగా ఉండండి.

నా ప్రియులారా, నేటి దినాలలో అనేకులు సమాధానము లేకుండా నిద్రపోతుంటారు. ఈ లోకములో ఉన్న అనేక సమస్యలను గురించి వారు చింతిస్తుంటారు. కానీ, నా స్నేహితులారా, నేడు మీరేమి చేయాలి? అని చూచినట్లయితే, నా సొంత అనుభవము నుండి మీకు నేను చెప్పాలని అనుకుంటున్నాను. అది నా భర్త యొక్క అనుభవము నుండి నేను మీకు తెలియజేయుచున్నాను. మా పరిచర్యలో మేము అనేక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చినది. ఆ సమయములో మేము ఏమి చేసేవారమో తెలుసా? ఏ సమయమైనను సరే, అది రాత్రి 11 గంటలైనను, 2 గంటలైనను లేక 3 గంటలైనను సరే, మేము వెంటనే మోకాళ్ళూని దేవుని సన్నిధిలో ప్రార్థించేవారము. కనుకనే, నా ప్రియులారా, మనము హృదయములో కలత చెందినప్పుడు, మనము పడుకోవాలని అనుకొనకూడదు. మనము చేయవలసింది వెంటనే మోకరించాలి.

అవును నా ప్రియులారా, తప్పనిసరిగా మోకారించాలి, మనము చేయవలసినది కూడా అదియే అయి ఉంటుంది. కనుకనే, మీరు ఎటువంటి స్థితిలో ఉన్నను సరే, వెంటనే మోకరించండి మరియు ప్రభువునకు మొఱ్ఱపెట్టండి. ఏ సమయమందున్నను సరే, ప్రభువు మీ సమస్యలన్నిటికి మరియు చింతలన్నిటికి జవాబిస్తాడు. పగలైనను సరే, అర్థరాత్రియైనను సరే, ఆయన ఎల్లప్పుడు మనకు లభ్యముగాను ఉంటాడు. నా ప్రియులారా, దేవుని గొప్పతనము అదియే అయి ఉన్నది. మీరు ఆయనకు మొఱ్ఱపెట్టినప్పుడు, ఆయన మీకు ఏమి చేస్తాడు? ప్రభువు మీకు ఆధారముగా ఉంటాడు. ఈ వాగ్దానమును మరల, మరల చదవండి. ఇంకను కీర్తనలు 18:35 మరియు 63:8 వ వచనములలో చూచినట్లయితే, "నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్పచేసెను'' ప్రకారం, " నీ కుడి హస్తము నన్ను ఆదుకొనును'' అని వ్రాయబడియున్నది. అవును, ప్రభువు యొక్క కుడి హస్తము ఎల్లప్పుడు మనలను ఆదుకుంటుందని కీర్తనాకారుడు నమ్మియున్నాడు. కనుకనే, కీర్తనాకారుడు మనకు స్పష్టముగా తెలియజేసియున్నాడు. ప్రియులారా, అర్థరాత్రి వేళ కూడ మీరు మొఱ్ఱపెట్టినప్పుడు, ఆయన మీ మొఱ్ఱను ఆలకిస్తాడు నా స్నేహితులారా. ఇంకను కీర్తనలు 145:14వ వచనము ప్రకారము, " యెహోవా పడిపోవు వారినందరిని ఉద్ధరించువాడు క్రుంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు'' అని చెప్పబడినట్లుగానే, "యెహోవా పడిపోవు వారినందరిని ఉద్ధరించువాడు'' ప్రకారము మీరు పడిపోవుచున్నప్పుడు ఉద్ధరిస్తాడు. నా స్నేహితులారా, చీకటి సమయంలో కూడా మిమ్మును తన కుడి హస్తముతో పట్టుకొని పైకి లేవనెత్తడానికి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. కనుకనే భయపడకండి.

అయితే, నా ప్రియులారా, నేడు మీరు ఏమి చేయాలి? ఆయన సన్నిధిలో నివసించాలి. అందుకే బైబిల్‌లో కీర్తనలు 91:1వ వచనములో చూచినట్లయితే, "మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు'' ప్రకారము, మహోన్నతుని చాటున మీరు నివసించాలి. అప్పుడు మీరు సర్వశక్తుని నీడను విశ్రమిస్తారు. కనుకనే, మీరు చింతలు ఎదుర్కొన్నప్పుడు, మీరు ఆయన సన్నిధి నీడలో నివసించినప్పుడు ఆయన మిమ్మును ఆదరిస్తాడు, మీకు విడుదలను కలుగజేస్తాడు మరియు సమాధానము అనుగ్రహిస్తాడు. అప్పుడు మీరు సమాధానముతో పండుకొని నిద్రపోతారు. మా జీవితములో మేము అదే అనుభూతి చెందాము.

నా ప్రియులారా, నేడు మీ హృదయములో మీరు కలత చెందుచున్నారా? రాత్రి వేళలలో సమాధానముతో నిద్రపోలేకపోవుచున్నారా? దేవుని హత్తుకొనండి. ఆయనను గట్టిగా పట్టుకొనండి. ప్రభువు మీ జీవితములో అద్భుతము చేసి మీకు సమాధానమును అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఆయన అనుగ్రహించే సమాధానమును ప్రార్థించి, పొందుకుందామా? నేడు మీరు కూడ నెమ్మదిలేకుండా ఉన్నట్లయితే, నిశ్చయముగా, మీ జీవితాలను మిమ్మును ఆదుకునే ఆయన చేతులకు సమర్పించినట్లయితే, నిశ్చయముగా, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రశస్తమైన మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. అయ్యా, నీవు ఎంతైన గొప్ప దేవుడవయ్యా. దేవా, మమ్మును ఆదరిస్తున్న మా దేవుడిగా ఉన్నందుకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. యేసయ్యా, పడిపోవుచున్న మా జీవితాలను నీవు పట్టుకొని, ఆదుకొనుము. ప్రభువా, మా శ్రమలన్నిటిని నీ మీద వేయమని నీవు వాగ్దానం చేసినట్లుగానే, మేము మా చింతలన్నిటిని నీ మీద వేయుచున్నాము. నేడు మేము దేనిని గురించి చింతించకుండా లేదా దిగులుపడకుండా, నీ నిష్ఫలమైన ప్రేమను విశ్వసించ డానికి దయచేసి మాకు సహాయం చేయుము. ప్రభువా, ఇప్పుడు కూడా, నీవు ఎల్లప్పుడూ మా జీవితములో ప్రధాన ప్రాధాన్యతగా ఉండాలని మేము కోరుచున్నాము. దేవా, ఎటువంటి పరిస్థితులలోను మేము నిన్ను మొదట వెదకడానికి మమ్మును నడిపించుము. ప్రభువా, దయచేసి మా ఆందోళనలను ఎవరితోనైనా పంచుకునే ముందు వాటిని ప్రార్థనలో నీ వద్దకు తీసుకురావడానికి మరియు మోకాళ్ళూని నీ సన్నిధిలో ప్రార్థించడానికి మాకు సహాయం చేయుము. ఎందుకంటే నీలో మాత్రమే మేము నిజమైన విశ్రాంతి ని మరియు మా సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనగలము. కనుకనే, నీ కృప ద్వారా మేము జయించువారముగా ఉండునట్లుగాను, ప్రతి క్లిష్టమైన పరిస్థితులలో కూడా దృఢంగా మరియు సమాధానముగా ఉండేలా నీ బలమైన కుడి చేయి మమ్మును నిలబెట్టి, మమ్మును ఆదరించి, బలపరచుము. ప్రభువా, నీ సమాధానముతో మమ్మును నింపుము మరియు మాకు సమాధానకరమైన నిద్రను దయచేయుము, నీవు మాతో ఉన్నావనియు, మమ్మును ఆదరిస్తావనియు, రక్షిస్తావనియు మరియు మమ్మును ఘనపరుస్తావనియు నమ్ముచూ, మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.