నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి జెకర్యా 9:12వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "బంధకములలో పడియుండియు నిరీక్షణగలవారలారా, మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసెదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను'' అని చెప్పబడిన ప్రకారం ప్రభువు నుండి ఎంత శక్తివంతమైన నిరీక్షణను మనము కలిగియున్నాము కదా! అవును, ఆయన ఈ రోజు మీకు రెండింతలు మరల పునరుద్దరిస్తానని వాగ్దానం చేయుచున్నాడు!
అందుకే బైబిల్‌లో, నెహెమ్యా 1:7వ వచనము మనకు గుర్తు చేయుచున్నదిలా, "యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మికయుంచువారిని ఆయన ఎరుగును'' అని చెప్పబడినట్లుగానే, ఆయన మనకు ఆశ్రయ దుర్గము అని వాక్యము మనకు సెలవిచ్చుచున్నది. అయితే, ఆయనను ఆశ్రయ దుర్గముగా కలిగియుండుటకు మనము ఏమి చేయాలి? మనము మన పూర్ణ నమ్మకమును ప్రభువుపై మాత్రమే ఉంచాలి. ఎందుకనగా, ఆయన యందు విశ్వాసముంచినవారిని ప్రభువు ఎరిగియున్నాడు. అప్పుడు అట్టివారికి ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఇంకను బైబిల్‌లో సామెతలు 16:20 మరియు యిర్మీయా 17:7 అను లేఖనములను మనము చూచినట్లయితే, ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలునొందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు మరియు యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును'' అని చెప్పబడిన ప్రకారం, మనము యెహోవాను ఆశ్రయించినప్పుడు, మనము ధన్యులముగా ఉంటాడు. అందుకు ఒక చక్కటి ఉదాహరణను భక్తుడైన దావీదును మనము చూడగలము. దావీదును గురించి, బైబిల్‌లో చూచినట్లయితే, కీర్తనలు 31:4 మరియు కీర్తనలు 43:2వ వచనముల ప్రకారం, "నా ఆశ్రయ దుర్గము నీవే... మరియు నీవు నాకు దుర్గమైన దేవుడవు'' అని చెప్పబడినట్లుగానే, అది దావీదు యొక్క నిరీక్షణయై ఉన్నది. అతడు కేవలం ఒక గొఱ్ఱెల కాపరియై ఉంటున్నాడు. కానీ, కీర్తనలు 23:1వ వచనములో చూచినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు'' అని అంటున్నాడు. దావీదు దేవుని సన్నిధిలో, "ప్రభువా, నీవే నా కాపరి, నాకు లేమి కలుగదు '' అని తెలియజేయుచున్నాడు.
నా స్నేహితులారా, ఈ రోజు మీకున్న నిరీక్షణ ఏమై యున్నది? ఈ రోజు మీ నిరీక్షణ ఒక మానవులపైన లేక మీ స్నేహితులపైన ఉంచుతున్నారా? వారంద రు లోకస్థులే. వారందరిని మనము నమ్మలేము. కానీ, మన పూర్తి నమ్మకము ప్రభువు మీద ఉంచినప్పుడు, ప్రభువు మీకు రెండంతల మేలు తప్పకుండా కలుగజేస్తాడు. ఈ రోజు మీకు అనేకమైన అవసరాలు ఉన్నాయి అంటున్నారా? అయితే, మీ పూర్తి నమ్మకాన్ని ఆయన మీద ఉంచండి. అప్పుడు, బంధకములలో పడియున్న మీకు ఆయన ఒక నిరీక్షణ కలిగించి, రెండంతలుగా మీకు మేలు కలుగజేసి మిమ్మును నేటి వాగ్దానము ద్వారా మరల పునరుద్ధరింపజేసి, ఆశీర్వదిస్తాడు.
ప్రార్థన:
అమూల్యమైన మా పరమ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ అద్భుతమైన సన్నిధానమునకై వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, నీవు మాపై నీ సన్నిధానమును కుమ్మరించుము. దేవా, మేము మా కుటుంబముగా నీలో ఏకీభవించుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, మేము నీ యందు నమ్మిక యుంచియున్నాము, మాకు అవసరమైనవన్నియు కూడా మాకు రెండంతలుగా దయచేయుము, దేవా, మా ప్రార్థనను ఆలకించి, మమ్మును దీవించుము. ప్రభువా, మేము హృదయపూర్వకంగా నమ్మకంతో నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, ఆపత్కాలములో నీవు మా కోటగా ఉన్నందుకై నీకు వందనాలు. ప్రభువా, చింతలను, మా అవసరాలను, మా కోరికలను నీ చేతుల్లోకి అప్పగించుచున్నాము. దేవా, నీవు మా మంచి కాపరివి, నీలో మాకు ఏమీ లోటు లేకుండా చేయుము. ప్రభువా, మా బంధకములను తొలగించి, మమ్మును పునరుద్ధరించుము, మాకు రెట్టింపు ఆనందం మరియు శాంతిని అనుగ్రహించుము. దేవా, లోకంపై కాకుండా నీ మీద మాత్రమే ఆధారపడటానికి మా విశ్వాసాన్ని బలపరచుము. ప్రభువా, దావీదు జీవితములో చేసినట్లుగా, నీపై పూర్తి నమ్మకంతో నడవడానికి మాకు సహాయం చేయుము. దేవా, ఈ రోజు మాలో నీ వాగ్దానాలు సజీవంగా ఉండునట్లుగా కృపను మాకు అనుగ్రహించి, మమ్మును రెండంతలుగా మాకు మేలు దయచేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.