నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు యేసునకు చెందినవారు. ఈ రోజు వాగ్దానముగా బైబిల్ నుండి 2 కొరింథీయులకు 1:22 అను ఒక చక్కటి వాగ్దానమును కనుగొనబడినది. ఆ వచనము, "ఆయన (క్రీస్తు యేసు) మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడు.'' అవును, మీరు మరియు నేను యేసునకు చెందినవారమై ఉన్నాము.
నా ప్రియులారా, అందుకు ముద్రగా ఆయన తన పరిశుద్ధాత్మను మనలో సంచకరువుగా లేక నిల్వగా ఉంచియున్నాడు. రాబోవువాటికి ఛాయగా ఆయన నిర్థారణ అనుగ్రహించుచున్నాడు. అవును, దేవుని ఆత్మ మనలో ఉంచబడియున్న సంచకరువు లేక నిల్వ అయి ఉన్నాడు. అందుకే, ఈ దైవీకమైన యాజమాన్యానికి గుర్తుగా, ఆయన తన ఆత్మను, పరిశుద్ధాత్మను మన హృదయాలలో ఉంచియున్నాడు, రాబోవు వాటిని గురించి మనకు నిరీక్షణను కలిగించేదిగా ఉంటుంది. కనుకనే, దేవుని ఆత్మ మనలో ఉంచబడినప్పుడు, మన దేహము దేవుని యొక్క ఆత్మకు ఆలయముగా ఉంటుంది. పరిశుద్ధాత్మ ద్వారా మనము యేసునకు చెందినవారమని ముద్ర మన మీద వేయబడుతుంది. కనుకనే, ఈ రోజున యేసునకు మొఱ్ఱపెడుతూ, ఈలాగున చెప్పండి, 'ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మును నింపుము, పరిశుద్ధాత్ముడు నా ఆత్మలోనికి రావాలి, ఆయన దేవుని యొక్క నిల్వగా లేక సంచకరువుగా నాలో ఉండాలి' అని చెప్పినప్పుడు, దేవుని ఆత్మ మీలోనికి దిగివస్తుంది. అవును, పరిశుద్ధాత్మ మనలో దేవుడు దాచిపెట్టిన అమూల్యమైన నిధి! కనుకనే, అటువంటి నిధిని పొందుకొనుటకు మీ హృదయాలను దేవునికి సమర్పించుకొనండి, మీ ఆత్మలకు పరిశుద్ధాత్మ అను సంచకరువు ముద్రవేసుకొనండి.
నా ప్రియులారా, అనేక ఫర్యాయములు, పాత దినములలో ప్రజలు నదుల వెంబడి సుదూరమైన తీర ప్రదేశాలలో ప్రయాణించుచుండేవారు. ఎందుకనగా, పర్వత ప్రాంతాలలో అనగా, బంగారు దాచబడియున్నటువంటి ప్రాంతాలలో, ఆ యొక్క పర్వత ప్రాంతాలలో రాతి కొండల బండల నడుమ నీరు నదివలె ప్రవహిస్తున్నప్పుడు, ఈ యొక్క నది నీటి ద్వారా కొద్ది పాటి బంగారు నిల్వలను ఆలాగున నీటితో కూడా తీసుకొని వస్తుంది. ఆ చిన్న చిన్న బంగారు ముక్కల కొరకు వారు ఎదురు చూచ్తూ అక్కడకు వెళ్లేవారు. వారు వాటన్నిటిని కూడా ప్రోగు చేసుకొని, వారి భుజాల మీద వాటిని మోసుకొని వచ్చేవారు. వారు సమీపములో ఉన్న గ్రామానికి వచ్చియున్నప్పుడు, ప్రజలు వారి వైపు చూచేవారు. మీ దగ్గర బంగారము ఉన్నది అని చెప్పినప్పుడు, అది మీకు ఏలాగున తెలుసు అని వారు అడిగేవారు? ఆ చిన్న చిన్న బంగారపు ముక్కలను వారు సంచులలో దాచుకునేవారు. ఆ బంగారపు ముక్కలను భుజము మీద వాటిని ఆలాగున మోసుకొని వచ్చేవారు. అందుకు ప్రజలు వారిని చూచి ఏమంటారంటే, 'మీ ముఖాలు ప్రకాశించుచున్నవి, మీ ముఖాలు తేజోవంతముగా ఉన్నాయి, మీ ముఖాలు బంగారము వలె తేజరిల్లుచున్నాయి.' అవును, అది వారికి తెలియకుండానే, వారు పంటగా పొందియున్న బంగారపు నిల్వలు వారి ముఖము మీదికి వెలుగులను తీసుకొని వస్తాయి.
నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు పరిశుద్ధాత్మ అను నిల్వలను మీరు కలిగియున్నారు. కనుకనే, యేసు యొక్క ముద్ర మీ మీద ఉంచబడియున్నది, తద్వారా, మీ ముఖము యేసు చేత ప్రకాశింపజేయబడుచున్నది. కాబట్టి, సంపూర్ణ సంతోషముతో మీరు ఆయనను మోయండి, యేసులో ఉన్న ఆశీర్వాదములన్నియు మీ యొద్ద వచ్చి, మీ ముఖమును ప్రకాశింపజేయును.
చెన్నై నుండి రాజ్ పాల్ మోసస్ అను సహోదరుని యొక్క శక్తివంతమైన సాక్ష్యము ఇక్కడ చెప్పబడియున్నది. అతడు తాను పొందుకున్న సాక్ష్యమును ఈలాగున పంచుకున్నాడు. నేను నా తమ్ముని కోల్పోయాను, దానితో పాటు నేను నా ఉద్యోగమును కోల్పోయాను. నేను ఎంతగానో ఒత్తిడికి లోనయ్యాను. ఒకరు నన్ను యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమునకు తీసుకొని వెళ్లారు. ప్రార్థనా యోధులు నా కొరకు ఎంతో భారముతో ప్రార్థించుచుండగా, నా హృదయములోనికి శాంతి సమాధానము వచ్చినది. యేసు పిలుచుచున్నాడు కార్యక్రమములను వీక్షించుటకు ప్రారంభించాను. నా జీవితమును యేసునకు సమర్పించుకున్నాను. భవిష్యత్తు కొరకు యేసునందు నిరీక్షణ కలిగి ఉండుటకు ప్రారంభించాను. ఒకరోజు, ఆ కార్యక్రమములో డాక్టర్. పాల్ దినకరన్‌గారు సందేశము అందించుచున్నప్పుడు, మనము ప్రార్థన ద్వారా ఏలాగున ఆశీర్వదింపబడుదుమో అని బోధించాడు. ఆ తర్వాత నేను ఒక ఉద్యోగము కొరకు ఇంటర్య్వూకు వెళ్లాను. నేను ఆ మాటలను గుర్తుంచుకొని, ప్రార్థించి, దేవునితో ఒక ఒప్పందమును చేసుకున్నాను, "ప్రభువా, ఈ ఫర్యాయము నీవు నాకు ఉద్యోగము ఇచ్చినట్లయితే, ప్రజలకు దీవెనకరముగా ఉన్న యేసు పిలుచుచున్నాడు పరిచర్యకు నా మొదటి నెల జీతము ఇస్తానని ఒప్పుకున్నాను.' అద్భుతముగా నేను ఆ విధంగా ఆ ఉద్యోగమునకు ఎంపిక చేయబడ్డాను. అతిత్వరలోనే నాకు ఉద్యోగము వచ్చినది, నా జీవితములో వర్థిల్లత ప్రారంభమైనది. ఈ రోజు నాకు దేవుడు మంచి భార్యను మరియు కుమార్తెను అనుగ్రహించియున్నాడు. నేను అంబాసిడర్ (రాయబారుల) కూటములో పాల్గొన్నాను. యేసు పిలుచుచున్నాడు అంబాసిడర్ కూటములో ప్రభువు నన్ను పరిశుద్ధాత్మతో నింపాడు. ఈ రోజు యేసు పిలుచుచున్నాడు పరిచర్యతో కలిసి నేను ప్రభువునకు సేవ చేయుచున్నాను. ఇది ఎంత గొప్ప సంతోషము కదా! నా ప్రియులారా, ప్రభువు మిమ్మును కూడా నేడు ఇదే విధంగా దీవించును గాక. దేవుడు తన ముద్రను మీ మీద వేసి, పరిశుద్ధాత్మ అను సంచకరువును మీలో నిల్వను ఉంచియున్నాడు. కాబట్టి, మీరు యేసుతో, పరిశుద్ధాత్మ ద్వారా ప్రకాశించండి. నేటి వాగ్దానముగా ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రియమైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీవు మమ్మును ఆశీర్వదించుము, ప్రభువా, నీ యాజమాన్య ముద్రను మాపై ఉంచినందుకు నీకు కృతజ్ఞతలు. దేవా, నీ పరిశుద్ధాత్మను నింపి, మా హృదయంలో దాచి ఉంచిన దైవీకమైన నిల్వలకు నీకు వందనాలు. ప్రభువా, మమ్మును మేము సంపూర్ణముగా నీ హస్తాలకు సమర్పించుకొనుచున్నాము. దేవా, మా జీవితం నీ సన్నిధి నివసించే ఆలయంగా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, బంగారం దానిని కనుగొన్న వారి మీద వెలుగును కలుగజేసినట్లుగానే, నీ మహిమ మా ద్వారా ప్రకాశింపజేయుము. యేసయ్యా, మా ముఖం మరియు మా జీవితం మేము ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధిని ప్రతిబింబించునట్లుగా చేయుము. దేవా, యేసును ఆనందంతో మోయడానికి మరియు ఆయన ఆశీర్వాదాలను ఇతరులతో పంచుకోవడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ ఆశీర్వాదాలన్నియు క్రీస్తుయేసునందు మాకు చెందినవిగా ఉండునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మేము ఎప్పటికిని, నీకు చెందినవానిగా ముద్రించబడునట్లుగాను, నీ ఆత్మ అను సంచకరువును కలిగి ఉండడానికి మరియు నీ మహిమ కొరకు ప్రకాశించునట్లుగా మాకు కృపను అనుగ్రహించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.