నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఆదికాండము 17:7వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "నేను నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను'' ప్రకారం నా స్నేహితులారా, దేవుడు మిమ్మును తన బిడ్డలనుగా మార్చుకోవడానికి ఒక నిబంధన చేసియున్నాడు, అది ఒక నిత్య నిబంధన. ఈ నిబంధన ఏమిటి? ఇది పావురముల రక్తంతోనో లేక గొఱ్ఱెపిల్లల యొక్కయు, మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు రక్తముతోను కాదు, యేసుక్రీస్తు ద్వారా సిలువ మీద చిందించబడిన దేవుని యొక్క స్వరక్తం ద్వారా చేయబడిన ఒక నిత్య నిబంధన. అవును, దేవుడు యేసు అనే మానవ రూపం ధరించి ఈ లోకమునకు వచ్చాడు. కనుకనే, ఆయన రక్తం పరిశుద్ధమైనది. ఎందుకంటే, ఆయన తల్లియైన మరియ అనే కన్య గర్భంలో దేవుని విత్తనం నుండి ఏర్పడ్డాడు. ఇంకను ఆ మరియ అను కన్య గర్భంలో, ఏ మానవునిచేత మలినము కాకుండా, దేవుడు యేసు రూపములో శరీరధారియైయ్యాడు, ఆయన రక్తము దేవుని పరిశుద్ధ రక్తముగా మార్చబడినది. కాబట్టి, నేడు యేసు మీ పాపాలను, నా పాపాలను, పాపం ద్వారా వచ్చిన ప్రతి శాపాన్ని తాను మోయుచూ, సిలువకు వెళ్ళాడు. మన పాప క్షమాపణ కొరకు ఆయన తనను తాను బలిగా అర్పించుకున్నాడు. మరియు నేడు, యేసు రక్తం ద్వారా, మనం విశ్వాసంతో ఆయన వద్దకు వచ్చినప్పుడు, ఆయన రక్తంతో మనలను కడగమని అడిగినప్పుడు, మన ప్రతి పాపం నుండి మనం కడగబడి, పవిత్రులుగా చేయబడతాము.

నా ప్రియులారా, నేడు మీరు యేసు రక్తాన్ని వెదకవలసిన అవసరం లేదు. అది ఒక్కసారి మాత్రమే చిందించబడినది. మీరు దానిని విశ్వాసం ద్వారా, "యేసు ప్రభువా, నా పాపమును క్షమించు,'' అని చెప్పాలి. ఇంకను, ' ప్రభువైన యేసయ్యా, నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడిగి, నా హృదయమును పవిత్రముగా చేయుము. ప్రభువైన యేసు, నా పాప స్వభావమును నా నుండి తొలగించుము. ప్రభువైన యేసు, నన్ను కడిగి పరిశుద్ధపరచుము' అని ఈ ప్రార్థనను మీరు మీ హృదయ పూర్వకంగా చేయుచూ, మీరు పాపి అని ఒప్పుకుంటూ, మీ పాపాలను ఆయన యెదుట ఒప్పుకుంటూ, యేసు రక్తం యొక్క శుద్ధీకరణ శక్తిపై మీ నమ్మకాన్ని ఉంచినప్పుడే, ఆయన మిమ్మల్ని పరిశుద్ధులనుగా చేస్తాడు. ఇప్పుడే, మీరు ఎక్కడ ఉన్నా, మీరు దేవుని బిడ్డలుగా మార్చబడతారు. ఆయన మరియు మీరు, తండ్రి మరియు బిడ్డలుగా బంధింపబడాలని దేవుడు మీతో చేసిన నిబంధన ఇది. కనుకనే, ఆయన రక్తం మీలోనికి ప్రవహించి మిమ్మును కడిగినప్పుడు, మీరు నూతనంగాను మరియు పవిత్రంగాను మార్చబడతారు. మీకు ఇంతటి గొప్ప ఆశీర్వాదం కావాలా? అయితే, నేడు మీరు ఎక్కడ ఉన్నను సరే, ఇప్పుడే, మీరు యేసుకు మొఱ్ఱపెట్టినట్లయితే, మీరు ఇప్పుడు యేసు బిడ్డగా మార్చబడగలరు. కనుకనే, ఇది మీ కొరకైన ఒక నిత్య నిబంధనగా ఉంటుంది.

అవును, నా ప్రియులారా, మనం శోధనలతో నిండి యున్న లోకంలో జీవించుచున్నాము. ఆ శోధనలు జీవితంలోని వివిధ సమయాలలో మన పైకి వస్తాయి. కానీ, శోధనలు వచ్చిన ప్రతిసారీ, ప్రభువు మీకు గుర్తు చేస్తాడు, " నేను మీ కొరకు నా రక్తాన్ని చిందించాను'' అని చెబుతాడు. మరియు మీరు మొఱ్ఱపెట్టినప్పుడు, ఆయన రక్తం మీ పక్షమున మంచి కార్యాలను గూర్చి మాట్లాడుతుంది, మిమ్మల్ని బలపరుస్తుంది మరియు పాపం నుండి మిమ్మును రక్షిస్తుంది. అందుకే, మీరు మీ మోకాళ్లూని, 'మిమ్మును మరల కడిగి పవిత్రులనుగా చేయమని, మిమ్మల్ని పరిశుద్ధంగా ఉంచమని మరియు ఆ పాపాలు మీరు మరల చేయకుండా సహాయం చేయమని అడిగినప్పుడు, ఆయన మీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ, యేసు ఆత్మ, మీ బలహీనతలలో మీకు సహాయం చేస్తాడు. ఆయన మిమ్మును కాపాడి, రక్షిస్తాడు.

కాబట్టి, నా ప్రియులారా, ఈ రోజు, మీరు యేసును తన రక్తంతో కడగమని అడగండి, మరియు ఆయన ఆత్మతో, యేసు పరిశుద్ధాత్మతోను మిమ్మల్ని నింపమని అడగండి. మరియు దురాత్మల నుండియు, అపవాది శక్తుల ద్వారా తీసుకొని వచ్చుచున్న శోధనలు మరియు దాడుల నుండి ఆయన ఆత్మ మిమ్మల్ని రక్షిస్తుంది. అవును, "పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు.'' అవును, నా ప్రియులారా, నేడు మిమ్మును తన ప్రియ బిడ్డలనుగా మార్చుకోవడానికి, నేడు దేవుడు మీతో చేయుచున్ననిబంధన కూడా ఇదియే. కాబట్టి, నేడే మీరు యేసు దగ్గరకు రండి. మీరు ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆయన మిమ్మును చూచి, "బంధకములలో పడియుండియు నిరీక్షణగలవారలారా, మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసెదనని నేడు ప్రభువు మీకు తెలియజేయు చున్నాడు.'' ఆలాగుననే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీకు మరియు మీ తరముల మధ్యను ఆయన యొక్క నిత్యనింబంధనను స్థిరపరచి, మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపకు పాత్రుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ పరిశుద్ధ రక్తం ద్వారా నీవు మాతో నిత్య నిబంధన చేసినందుకు నీకు ధన్యవాదాలు. ప్రభువా, మా పాపాలను ఒప్పుకుంటూ మేము ఈ రోజు నీ సన్నిధికి వచ్చుచున్నాము. దేవా, నీ అమూల్యమైన రక్తంతో మమ్మును కడిగి, మమ్మును నూతనంగా మార్చుము. యేసయ్యా, మా ప్రతి పాపపు ఆలోచన, మాట మరియు క్రియల నుండి మమ్మును కడిగి పవిత్రపరచుము. దేవా, మా బలహీనతలో మాకు సహాయం చేయడానికి నీ పరిశుద్ధాత్మతో మమ్మును నింపుము. ప్రభువా, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నీ కృప మమ్మును విడిచిపోకుండా మరియు నీ యొక్క సమాధాన విషయమైన నీ నిబంధన మా నుండి తొలగిపోకుండా నిత్యము మాతో నిలిచి ఉండునట్లుగా చేయుము. దేవా, మేము, ఎదుర్కొంటున్న దుష్టుని యొక్క ప్రతి శోధన నుండియు మరియు కుట్రల నుండియు మమ్మును రక్షించుము. తండ్రీ, నీ కుమారుడైన యేసుని రక్తము ద్వారా, నీకు ప్రియమైన బిడ్డలనుగా నిత్యము ఉండునట్లుగా మమ్మును మరల కట్టుము. దేవా, నీ యొక్క ప్రేమగల నిబంధన మా జీవితం నుండి ఎన్నటికిని తొలగించబడకుండా ఉండునట్లుగా చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.