నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మనం అత్యంతమైన శ్రద్ధతో మనలను నడిపించే మన ప్రభువు యొక్క మృదువైన మరియు ప్రేమగల తల్లి సమక్షంలో ఆశీర్వదించబడియున్నాము. ఇప్పుడు కూడా, బైబిల్ నుండి యెషయా 51:16వ వచనములో ఉన్న వాగ్దానాన్ని ఆయన మనకు అనుగ్రహించుచున్నాడు, "నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవేయని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను.'' అవును, ప్రభువు ఈ రోజు తన మాటలను మీ నోటిలో ఉంచి, తన ఉద్దేశ్యం కొరకు మిమ్మును బలమైన సాధనంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుకనే, మీరు బలహీనులని చెప్పకండి. ఆయన మిమ్మును తన చేతి నీతో కప్పియున్నాడు. కనుకనే, మీరు ధైర్యంగా ఉండండి.
నా జీవితములో చూచినట్లయితే, నేను దేవుని మాటలను పొందుకున్నప్పుడు ఆ మాటలలో ఉన్న వ్యత్యాసమును నేను తరచు నా జీవితములో అనుభవించాను. ప్రతి క్షణం నేను ప్రభువు నామంలో మాట్లాడటానికి పైకి లేవనెత్తబడినప్పుడు కూడా నేను నా స్వంత మాటలపై ఆధారపడను. కానీ, దేవుడు ఆత్మచేత నన్ను తన మాటలతో నింపుతాడు. నేను ఆయన మాటలను మాట్లాడినప్పుడు, అది ఆయన చిత్తాన్ని, ఆయన శక్తిని మరియు ఆయన సన్నిధిని ఆ స్థలానికి తీసుకొని వస్తుంది. కాలక్రమేణా, నా మాటలకు మరియు ప్రభువు మాటలకు మధ్య గల ఒక గొప్ప వ్యత్యాసాన్ని ప్రాముఖ్యంగా నేను అర్థం చేసుకున్నాను. చూడండి, దేవుని మాటలు ఎంత శక్తివంతమైనవి కదా!
అవును నా ప్రియులారా, ప్రభువు వాక్కు మీ నోటి నుండి బయలుదేరి వచ్చి, మీ కార్యాలయంలో మరియు మీకంటే ఉన్నత అధికారంలో ఉన్నవారి చెవులకు చేరుతుంది. ఆ మాటలు మీ దేశంలోని నాయకుల ముందు, రాజుల ముందు, మీ జీవితంలోని కష్టాలు సృష్టించేవారి ముందు కూడా తీసుకొని వెళుతుంది. మీరు ప్రజల యెదుట నిలబడినప్పుడు, అది పాఠశాలలో, మీ ఉద్యోగములోను, వ్యాపారములో అయినా, లేదా సమాజంలో అయినా, మీరు మాట్లాడేది మీ స్వంత మాటలు కాదు, ప్రభువు వాక్కును మాత్రమే మాట్లాడాలి. అవును స్నేహితులారా, మీరు అలాగున మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నప్పుడు, ఆయన సన్నిధి మిమ్మును ఆవరించును మరియు ఆయన తన చేతి నీడతో మిమ్మును కప్పుతాడు. అంతమాత్రమే కాదు, మీరు దేవుని అత్యంత కృప క్రింద నిలువబడతారు. ఎందుకనగా, ఆయన మనలను 'తన జనము' అని పిలుచుచున్నాడు మరియు తన శక్తి ద్వారా, మనం ఆయనకు స్వంత జనమని ఆయన కనుపరుస్తాడు మరియు ఆయన వాక్యాన్ని అధికారంతో మాట్లాడునట్లుగా మనలను ఆయత్తపరుస్తాడు. ఆ విధంగానే, మీరు పిలువబడే ప్రతి ప్రదేశానికి ఆయన ఉద్దేశ్యం మరియు మహిమను మీ ద్వారా తీసుకువస్తాడు. హల్లెలూయా!
ఆలాగుననే, బైబిల్‌లో భక్తుడైన మోషే జీవితమును చూచినట్లయితే, నోటి మాంద్యముతో బాధపడుచున్న మోషేకు దేవుడు ఇలాగే జరిగించాడు. దేవుడు అతనిని ఐగుప్తు రాజైన ఫరోను ఎదుర్కోవడానికి పంపబడ్డాడు. ఎంతో శక్తివంతమైన ఆ నాయకుడు మోషేను ఒక్క మాటతో అణిచివేయగలడు. కానీ, బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయులను విడుదల చేయమని అడగమని అతనికి ఆజ్ఞాపించాడు. ఆ రాజు యొక్క ప్రతిచర్యను ఊహించుకోండి! అయినప్పటికిని, మోషే తన సొంత మాటలతో కాదు, ప్రభువు వాక్కుతో మాట్లాడాడు. ఆ మాట దేవుని యొక్క అద్భుతాలను రాజు యెదుటకు మోసుకెళ్లునట్లు చేసినది. తద్వారా రాజు హృదయంలో భయాన్ని కలిగించినది మరియు దేవుని శక్తివంతమైన అధికారము అక్కడ విడుదల చేయబడినది. ఆలాగుననే, నా ప్రియులారా, మీలో ఉన్న దేవుని వాక్యం యొక్క శక్తి అలాంటిది. కనుకనే, ఈరోజే దేవుడు మీకనుగ్రహించు ఆ మాటను పలుకుతూ, దేవుని కృపను ధైర్యంగా అనుభవించండి. ఆయన తన చిత్తాన్ని మరియు అద్భుతాలను మీ జీవితంలోని ప్రతి చోటకు మోసుకొని వెళ్లడానికి మిమ్మును ఆయన ఒక సాధనంగా ఉపయోగించుకొనుటకు మీ జీవితాలను ఆయనకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, బలహీనులైన, నోటి మాంద్యము గల మీకు దేవుడు తన వాక్కును పంపించి, మిమ్మును బలమైన సాధనములుగా మీరు వెళ్లుచున్న ప్రతి ప్రాంతములో ఉపయోగించుకుంటాడు. ఆలాగుననే, మిమ్మును అనేకులకు ఆశీర్వాదకరముగా మారుస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, నీ మాటలను మా నోటిలో ఉంచి, నీ చేతి నీడతో మమ్మును కప్పినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము.దేవా, మమ్మును నీ సొంత జనమని పిలిచినందుకు మరియు నీ దైవీకమైన అధికారాన్ని మాకు అనుగ్రహించినందుకై నీకు వందనాలు. దేవా, దయచేసి నీ మాటను ధైర్యంగా మరియు కృపతో అందరి యెదుట మాట్లాడటానికి మరియు ప్రతి పరిస్థితిలోనూ నీ చిత్తాన్ని మోసుకెళ్ళడానికి మాకు నీ బలమైన శక్తిని అనుగ్రహించుము. ప్రభువా, నీ మాటల ద్వారా మేము సమాధానమును, స్వస్థతను మరియు మారుమనస్సును కలిగి యుండునట్లుగా మమ్మును నీ ఆత్మశక్తితో నింపుము. దేవా, అధికారులు, నాయకులు మరియు విరోధుల ముందు కూడా స్థిరంగా మరియు ధైర్యంగా నిలబడటానికి, నీ సత్యాన్ని ప్రకటించడానికి మాకు సహాయం చేయుము. యేసయ్యా, నీ కృపతో మమ్మును కప్పి, నీ సన్నిధి మాకు దుర్గముగాను మరియు కేడెముగాను ఉండునట్లుగా చేయుము. దేవా, మోషేవలె మా సరిహద్దులను అధిగమించడానికి మరియు నీ శక్తివంతమైన అధికారము మీద నమ్మకం ఉంచడానికి మాకు అటువంటి కృపను దయచేయుము. ప్రభువా, మా హృదయాన్ని నీకు అప్పగించుచున్నాము. దేవా, నీ మహిమ కొరకు మమ్మును ఉపయోగించుకొనుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.