నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి హెబ్రీయులకు 10:25వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనం,"...ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము'' ప్రకారం మనము ప్రజలను ప్రేమించినప్పుడు, యేసు యొక్క ప్రేమ ద్వారా మనము వారికి సత్కార్యములు చేయుదము. మరియు ఈ రీతిగా జీవించెదము. మనము సత్కార్యములు చేసియున్నప్పుడు, ప్రతిఫలముగా దేవుడు మనకు సత్కార్యములను చేస్తానని ఆయన తెలియజేయుచున్నాడు. రూతు 2:12లో చెప్పబడినట్లుగానే, "యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకుత్తరమిచ్చెను'' ప్రకారం, మనము సత్కార్యములు చేసినప్పుడల్లా, మనము ఆయన రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లుగా వచ్చెదము. మనము ఇతరులకు చేసిన మంచి కార్యములకు తగినట్లుగా, తిరిగి ఆయన మనకు ప్రతిఫలమిచ్చును. రూతు స్వయంగా విధవరాలైనప్పటికిని, విధవరాలుగా ఉన్న రూతు తన అత్తకు చేసిన మంచి కార్యముల నిమిత్తము మంచి ప్రతిఫలమును పొందుకొనెను. కనుకనే దేవుడు సౌందర్యవంతమైన కుటుంబ జీవితమును తనకు అనుగ్రహించి, ఆ విధంగా ప్రతిఫలమునిచ్చాడు. మనము నిరంతరాయముగా ఆలాగున చేయుటకు సిద్ధముగా ఉన్నప్పుడు దేవుడు మన మంచి కార్యములకు తగిన ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు.

చెన్నైకి చెందిన సహోదరి అన్నమ్మ అగస్టిన్ దీనికి సరైన ఉదాహరణగా ఒక అద్భుతమైన సాక్ష్యమును తెలియజేయుచున్నారు. ఆమె కడుపులో రెండు ప్రమాదకరమైన గడ్డలు ఉన్నట్లు నిర్ధారణ అయినది. అయితే, ఆ రెండు గడ్డలు ఒక్కొక్కటి మూడు కిలోల బరువు ఉంటుంది. కనుకనే, డాక్టర్లు శస్త్రచికిత్సను చేయాలని చెప్పారు. ఇది చాలా ప్రమాదకరమైనదని చెప్పారు. వెంటనే ఆమె ప్రార్థించినది, ' ప్రభువా, నీవు నా ప్రాణమును రక్షించి, తిరిగి నాకు అనుగ్రహించినట్లయితే, నేను నిన్ను సేవిస్తాను మరియు నీకు సేవ చేస్తాను ' అని చెప్పి తనను తాను సమర్పించుకున్నది. వారు శస్త్రచికిత్సను ప్రారంభించారు. శస్త్రచికిత్స జరుగుచుండగా, ఒక గడ్డ పగిలిపోవడం జరిగింది. శస్త్రచికిత్స చేయడం వారికి చాలా కష్టతరం అనిపించినది. కానీ, మహాద్భుతంగా దేవుడు ఆమెను కాపాడి సంరక్షించాడు.

ఆమె దేవుని సేవ చేయడానికి తన అవకాశమును వినియోగించుకొనుచున్నారు. యేసు పిలుచుచున్నాడు బహిరంగ కూటములు నిర్వహించినప్పుడు, ఆమె ఆ కూటాలకు వెళ్లి, అక్కడికి వచ్చిన వారికి యేసును గురించి చెప్పడములో స్వచ్చంద సేవకురాలి పనిచేయుచుండెను. ఆ తర్వాత ఉద్యోగమునకు రాజీనామ చేసి, సంపూర్ణ సమయము దేవుని సేవ చేయుటకు వినియోగించుకొన్నారు. యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో చేయుచున్నారు. కనుకనే, దేవుడు తన బిడ్డలను అత్యంత సమృద్ధిగా దీవించడం ప్రారంభించాడు. వారి పిల్లలు విద్యలో ప్రావీణ్యతను పొందారు. శ్రేష్టమైన ఉద్యోగములలో ప్రవేశించారు. వారిద్దరికి కూడా మంచి జీవిత భాగస్వాములతో వివాహము జరిగినది. దేవుని యందు భక్తిగల జీవిత భాగస్థులకు దేవుడు వారికి ఇచ్చి వారిని ఆశీర్వదించాడు. దేవుడు వారి పిల్లలకు కూడా సంతానమును అనుగ్రహించాడు. వారిని కూడా ఈ పరిచర్యలో భాగస్థులుగా చేసియున్నందుకు దేవునికి వందనములు చెల్లించుచున్నాము. నా ప్రియులారా, ఈ రోజు అన్నివైపుల వారు సంపూర్ణంగా ఆశీర్వదింపబడియున్నారు. అవును, వారు యేసుక్రీస్తు ప్రేమ ద్వారా మంచి కార్యములను చేయుచున్నారు. దేవునికే మహిమ కలుగును గాక.

నేడు నా ప్రియులారా, మీరు కూడా మీ సమయమును ఇతరులతో యేసును గురించి మాట్లాడడానికి మరియు ప్రార్థించడానికి వెచ్చించి, వారి పట్ల సత్కార్యములు చేసి, ఒకరినొకరు పురికొల్పినప్పుడు, దానికి ప్రతిఫలముగా దేవుడు మీ జీవితములోనికి మంచితనమును తీసుకొని వచ్చి, మీ పిల్లల పిల్లలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

పార్థన:
పరలోక మందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, ఈ రోజున కూడా నీ సేవ కొరకు మేము పనిచేయుటకు సహాయము చేయుము. ఆలాగుననే, ప్రభువా, నీ ప్రేమతో ఇతరులకు మేలు చేయుటకు సహాయము చేయునట్లుగాను, ఒకరిలో ఒకరు ప్రేమను ప్రేరేపించడం మరియు మంచి కార్యములను చేయుటకు ప్రోత్సహించడం యొక్క ప్రాముఖ్యతను మాకు బోధించినందుకై నీకు వందనాలు. దేవా, నీవు నీ పిల్లలను ఓదార్చాలని మరియు మా మధ్య సంకేతాలు మరియు అద్భుతాలు చేయాలని కోరుకునే దేవుడవు కనుకనే, నేడు నీవు మా మధ్యన అద్భుత కార్యములను జరిగించి, ఇతరులకు దీవెనకరముగా ఉండునట్లుగా మమ్మును మార్చుము. ఈ రోజు, ప్రభువా, మేము మా కోరికలు మరియు ప్రణాళికలను నిర్దేశించుచున్నాము, నీవు మమ్మును సంపూర్ణంగా నీ స్వాధీనములోనికి తీసుకొని మరియు మీ జీవితం పట్ల నీవు కలిగియున్న ఉద్దేశమును మరియుపిలుపు ప్రకారం మమ్మును నడిపిస్తావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మా స్వంత అవసరాలకు మించి చూడడానికి మరియు నీ ప్రేమ మరియు కనికరముతో మా హృదయాన్ని నింపడానికి మాకు సహాయం చేయుము. దేవా, కోల్పోయిన మరియు బాధపెట్టేవారి కోసం మాకు భారమును దయచేయుము మరియు అవసరతలో ఉన్న వారి కొరకు ప్రార్థించడంలో మేము నమ్మకంగా జీవించునట్లుగా నీ కృపను మాకు దయచేయుము. ప్రభువా, నీవు మాకు దయతో ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఇతరులను ప్రేమించడం మరియు నీ మాటను పంచుకోవడం కొరకు మాకు నేర్పించుము. దేవా, నీ మహిమ కొరకు నీవు మమ్మును శక్తివంతంగా ఉపయోగించుకుంటావని మేము విశ్వసించుచున్నాము మరియు నీ నామమున ద్వారా మేము ప్రతి మంచి కార్యములకు ప్రతిఫలం దయచేయుమని మేము నమ్ముచూ, యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.