నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికి నేను శుభములు తెలియజేయుచున్నాను. ఈ రోజు బైబిల్ నుండి ఒక అద్భుతమైన వాగ్దానముగా 1 కొరింథీయులకు 10:13 వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.'' అవును, ఈ వచనములో మనము రెండు విషయాలను గమనించగలము. మొదటిగా, దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. రెండవదిగా, ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేస్తాడు. కాబట్టి, మీకు శోధనలు వచ్చినప్పుడు మీరు దేనికిని భయపడకండి.

నా ప్రియ స్నేహితులారా, శోధింపబడుచున్నప్పుడు మీరు చింతించవలసిన అవసరము లేదు. కొన్నిసార్లు ఆ వేదనను, నొప్పి, బాధను భరించలేక ఎందుకు దేవుడు దీనిని నాకు అనుమతించాడు? ఈ కష్టమైన మార్గములో నేనెందుకు ప్రయాణించాలి? అనుకుంటున్నారేమో? మీరు గుర్తించుకోవలసిన విషయము, మీరు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును మీ కొరకు కలుగజేస్తాడు. మన దేవుడు ఎటువంటి వ్యక్తియై యున్నాడు? 1 కొరింథీయులకు 1:9 మరియు 1 థెస్సలొనీకయులకు 5:24 ప్రకారము దేవుడు నమ్మదగినవాడు. కనుకనే, మనము ఆరాధించు దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు, దేవుని వాక్యము నుండి మనము చదివినవన్నియు ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. తన బిడ్డలకు నిశ్చయముగా ఆయన విజయమును అనుగ్రహించుటలో జాగ్రత్త వహిస్తాడు.

కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, మీరు శోధన కాలములో నడుస్తున్నప్పుడు, భయము చెందకండి. మోషే మరియు దావీదు జీవించిన కాలములో వారి జీవితములను చూచినట్లయితే, వారు దేవునికి ఎంతో నమ్మకముగా ఉన్నారు. హెబ్రీయులకు 3:5 మరియు 2 సమూయేలు 2:6 వచనములో దీనిని మనము చూడగలుగుతాము. వారిరువురు కూడ అనేకమైన శోధనలను ఎదుర్కొనవలసి వచ్చినది. అయితే, వారు దేవునికి ఎంతో నమ్మకముగా ఉన్నారు. కనుకనే, వారికి ఏమి జరిగినది? సామెతలు 28:20 వచనములో చూచినట్లయితే, "నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును.'' వారు దేవుని యందు నమ్మకముగా ఉన్నందున చివరిగా వారు దేవుని యొద్ద నుండి అత్యధికమైన ఆశీర్వాదములను పొందుకున్నారు. ఆలాగుననే, లూకా 19:17 ప్రకారం, " అతడు భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై యుండుమని వానితో చెప్పెను.'' ఆలాగుననే, మనము దేవుని యందు నమ్మకముగా ఉన్నప్పుడు, దేవుడు మనలను అనేకమైన వాటి మీద అధికారులనుగా చేస్తాడు.

అవును, నా ప్రియ స్నేహితులారా, మీరు దేవుని యెడల ఎంతగా నమ్మకముగా ఉంటున్నారు? అని మిమ్మును మీరు శోధించుకొని చూడండి. ఎందుకంటే, మన దేవుడు నమ్మదగినవాడు, ఆయన మీ అవసరతలన్నిటిని తీరుస్తాడని మీరు విశ్వసించగలుగుచున్నారా? ఆలాగైనట్లయితే, ఇప్పుడు ధ్యానించిన రీతిగా దేవుడు మిమ్మును అత్యధికముగా దీవిస్తాడు. ఇప్పుడు ఆ విశ్వాసముతో దేవుని నమ్మి, ఆయన వైపు చూచినప్పుడు దేవుడు నేటి వాగ్దానము ద్వారా మీరు శోధింపబడినప్పుడు, శోధనతో కూడ మీరు తప్పించుకొను మార్గమును మీకు కలుగజేసి, మిమ్మును ఆశీర్వదిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రశస్తమైన మా పరలోకమందున్న తండ్రీ, నీవు ఎంతైన నమ్మదగిన దేవుడవై ఉన్నందుకై నీకు వందనాలు. దేవా, మాకున్న సమస్యలను బట్టి నీకు మొఱపెట్టుచున్నాము, నీవు నమ్మదగినవాడు కనుకనే, నేడు బంధింపబడిన బంధకములన్నిటి నుండి మమ్మును విడిపించుమని కోరుచున్నాము. ప్రభువా, మేము వెళ్లుచున్న శోధనలన్నిటిని నీవు చూస్తున్నావు తండ్రీ, నీ బలమైన హస్తమును నేడు మా మీదికి దిగివచ్చునట్లు చేయుము మరియు నీ పరాక్రమము గల హస్తమును మా మీద ఉంచుము. దేవా, మా సమస్యలన్నిటి నుండి ఇప్పుడే మమ్మును విడిపించుము. ప్రభువా, మేము నీ యెడల విశ్వాస్యతను కనుపరచునట్లుగా మా శోధనల నుండి మేము తప్పించుకొనే గొప్ప మార్గమును మాకు చూపించుము. దేవా, మేము ఓటమిలను అనుభవించిన ప్రతి స్థలములోను, నీవు మాకు అత్యధికమైన విజయమును అనుగ్రహించుము. దేవా, నీవు మాకు తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని కలుగజేస్తావని మాకు వాగ్దానము ఇచ్చినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నీ కాడి మోయడం సులభం ఎందుకంటే నీవు సమస్తమును మా పట్ల జాగ్రత్తగా చూసుకుంటావని మేము నమ్ముచున్నాము. యేసయ్యా, ఎటువంటి పరిస్థితులలోను మేము నిన్ను విశ్వసించి, విజయము పొందుకొనునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. ప్రభువా, శోధనలలో కూడ నీవు ఎప్పుడు మా చేతిని విడువకుండా, మమ్మును విజయ మార్గము వైపు చక్కగా నడిపిస్తావని మా పూర్ణ హృదయంతో మేము నిన్ను నమ్ముటకు మాకు నీ కృపను అనుగ్రహించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.