నా ప్రియమైన స్నేహితులారా, మీకందరికి ఆశీర్వాదకరమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. యేసు యొక్క జననము మీ హృదయాలలో ఎనలేని గొప్ప ఆనందమును నింపును గాక. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి లూకా 2:10వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనమును చూచినట్లయితే, "అయితే ఆ దూత భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను'' అని సెలవిచ్చెను. ఇది కేవలం సువర్తమానము మాత్రమే కాదు గానీ, శ్రేష్టమైన సువర్తమానము. గొఱ్ఱెల కాపరులైన వారు హృదయపూర్వకముగా సత్యమును స్వీకరించారు. రక్షకుడైన యేసు మా కొరకు జన్మించాడు అను సత్యమును వారు అంగీకరించారు. వారు సువర్తమానమును అంగీకరించిన మరుక్షణమే వారు క్రియల వైపునకు మరలుకున్నారు. యేసు ఎవరో చూడాలనే ఆకాంక్షను కలిగి ఉంటూ వారు ఎంతగానో త్వరితముగా ముందుకు సాగి వెళ్లారు. ఆ తర్వాత, వారు అట్టి సువర్తమానమును ఇతరులకు కూడా పంచుటకు ప్రారంభించారు. అందుకే బైబిల్‌లో లూకా 2:17లో చూచినట్లయితే, " వారు చూచి, యీ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి'' అని చెప్పబడిన ప్రకారము, వారు ప్రగాఢమైన వాంఛతో ఈ సువర్తమానమును ఇతరులకు తెలియజేసియున్నారు. ఎందుకంటే, ఇది మనకు నిజమైన మరియు శాశ్వతమైన ఎనలేని ఆనందాన్ని కలిగించే ఒక సందేశం.

నా ప్రియులారా, ఎందుకనగా, ఈ యొక్క సువర్తమానమే నిజమైన సంతోషకరమైనది. ఎందుకనగా, ఈ సువర్తమానము ప్రయోజనకరమైనది మరియు లాభదాయకమైనదిగా ఉన్నది. ఎందుకనగా, ఈ సువర్తమానము వ్యక్తిగతమైనది. ఈ యొక్క సువర్తమానము గొప్ప సంతోషమును తీసుకొని వస్తుంది. మహిమవంతమైన రాజ్యమునకు మనము వారసులమయ్యాము అనే గొప్ప రాజరికపు వారసత్వపు ఆనందమును తీసుకొనివస్తుంది. తద్వారా, దేవుడు మనలను కుమారులను, కుమార్తెలనుగా పిలువడము అనేది ఎంత గొప్ప సంతోషము కదా. మనము దేవుని యందు విశ్వాసముంచునప్పుడు, ఆయన మనలను కుమారులనుగాను, కుమార్తెలనుగా పిలుచుచున్నాడు. వెనువెంటనే, ఆయన తన కుటుంబముగా మనలను తన రాజ్యములోనికి అంగీకరించుచున్నాడు. మనమందరము కలిసి, రాజరికపు కుటుంబాన్ని ఏర్పరచుకుంటున్నాము. ఈ యొక్క సువర్తమానము రాజరికపు ఆనందమును మనకు అనుగ్రహిస్తుంది.

ఎందుకనగా, రాజులకు రాజైనవాడు ఈ లోకములోనికి జన్మించియున్నాడు. ఈ శుభవార్త రాజుల రాజైన యేసుక్రీస్తు జననంలో వేళ్లూనుకున్న ఆనందాన్ని తీసుకొని వస్తుంది. మన నుండి ఈ సంతోషమును ఏ నరుడు కూడా తీసివేయలేడు. అదియే మనకు క్రిస్మస్ ఆనందము. ఈ యొక్క ఆనందము ఈ కాలమునకు మాత్రమే కాకుండా నిరంతరము కూడా మనతో భద్రపరచబడి ఉంటుంది. ఈ యొక్క సంతోషము దానిని ఎవరైతే ప్రచురము చేస్తారో, అది వారికి చెందినది. ఈ సంతోషము మరియు ఈ వర్తమానమును ఆలకించేవారికి చెందినది. ఈ సంతోషము మరియు ఈ వర్తమానమును విశ్వసించేవారికి చెందినది. కనుకనే, దిగులుపడకండి. యేసు ప్రభువు మీ కొరకు జన్మించాడన్న ఆనందమును నేడు అనుభవించండి.

నా ప్రియులారా, మనము కూడా గొఱ్ఱెల కాపరుల వలె ఈ యొక్క సువర్తమానమును ప్రచురము చేయవలెను. యేసు మన జీవితాలకు కారణమై యున్నాడు. మన జీవితాలకు యేసు మాత్రమే మూలవనరు. కనుకనే, యేసును ఈ లోకములోనికి తీసుకొని రండి. క్రిస్మస్ సమయములలో మనము ఆంగ్లములో ఈ కీర్తన పాడుతూ ఉంటాము కదా, " గో టెల్ ఇటీ ఆన్ ది మౌంటెన్ దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ లార్డ్'' (వెళ్లండి, యేసు క్రీస్తు ప్రభువై యున్నాడని ఈ సువర్తమానము లోకమంతట చాటి చెప్పండి). యేసు ఈ లోకమునకు రాజువలె జన్మించియున్నాడు. మనకు రాజరికపు ఆనందమును అనుగ్రహించుటకొరకే ఇట్టి ఆనందమును నిరంతరము మీతో కూడ నిలిచియుండును గాక. ఈ రాజరికపు ఆనందం ఎల్లప్పుడూ మీతో కూడా ఉండనివ్వండి. ఈ సమయములో యేసు మీ జీవితంలో జన్మించాలి. ఆయనను మీ హృదయంలోనికి స్వీకరించండి మరియు ఆయనను గురించి ఇతరులకు చాటి చెప్పండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీకు ఇంత గొప్ప ఆనందమును ఇచ్చి మిమ్మును దీవించును గాక. 

ప్రార్థన:
మహా గొప్ప మహిమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, న్టే వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన తండ్రీ, నీ కుమారుడైన యేసుక్రీస్తు, మా రక్షకుడు మరియు రాజు అందరికంటే గొప్ప వరమును కొరకు మేము నీకు వందనాలు. దేవా, దయచేసి నీ కుమారుని మరియు మా పట్ల ఆయనకున్న ప్రేమను గుర్తించడం ద్వారా వచ్చే రాజరికపు ఆనందముతో మా హృదయాన్ని నింపుము. ప్రభువా, ఈ సువర్తమానమును ఇతరులతో గొఱ్ఱెల కాపరుల వలె వాంఛతోను మరియు యథార్థతతోను పంచుకోవడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ మహిమను, ప్రేమను ప్రతిబింబిస్తూ నీ బిడ్డలవలె జీవించడం మాకు నేర్పించుము. ప్రభువా, ఈ క్రిస్మస్ ఆనందం మా హృదయంలో ఒక కాలానికి మాత్రమే కాదు, శాశ్వతంగా నిలిచి ఉండునట్లు చేయుము. దేవా, ఈ లోకానికి యేసు యొక్క వెలుగును తీసుకువచ్చే నిరీక్షణను కలిగించే దూతగా మమ్మును బలపరచుము. క్రీస్తునందు ఆనందముతో మేము ఈ క్రిస్మస్‌ను జరుపుకొనులాగున మాకు అటువంటి కృపను దయచేయుము. ప్రభువా, ఈ క్రిస్మస్ కాలములో మా విచారములన్నియు కొట్టివేయబడునట్లుగా చేయుము. దేవా, మా జీవితమును తలక్రిందులుగా మార్చి, మా కుటుంబములోని అపరాధములన్నియు తొలగించి, ఐక్యముగా ఉండునట్లుగా సమకూర్చుము. ప్రభువా, ఈ క్రిస్మస్ కాలములో మా కుటుంబము నీతో కలిసి ఆనందముతో జీవించునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. తండ్రీ, నీ కుమారుడైన యేసే మా జీవితానికి కారణం మరియు ప్రతి ఆశీర్వాదానికి మూలం అని ధైర్యంగా ప్రకటించడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా జీవితం మాకు శాశ్వత జీవమును మరియు ఆనందాన్ని ఇవ్వడానికి జన్మించిన రాజుల రాజుకు ఘనతను తీసుకొని వచ్చునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మమ్మును మేము నీకు అప్పగించుకుంటున్నాము మరియు మేము చేయు ప్రతి పనిలో నీ నడిపింపును మాకు దయచేయుమని యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ ఆమేన్.