నా ప్రియమైన స్నేహితులారా, ఈ దినము వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 119:76వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నీ సేవకునికి నీవిచ్చిన మాటచొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక'' ప్రకారం, అవును, స్నేహితులారా, ఈ దినము ప్రభువు యొక్క దృఢమైన ప్రేమ మరియు కృపయు మిమ్మును ఆదరించును గాక.
'దృడమైన' అనే పదానికి అర్థమేమై ఉంటున్నది? స్నేహితులారా, అది ఎన్నటికిని మారనిది అని అర్థము నిచ్చుచున్నది. అది స్థిరముగా ఒక స్థలములో నియమించిబడినదని అర్థము. ఇంకను కదిలించబడనిది అని అర్థము మరియు ఎటువంటి మార్పునకు గురికానిది. ఇంకను దృఢమైనది అనగా ఎప్పటికిని మారనిది అని అర్థము. అవును, ప్రియులారా, దేవుని కృప మరియు ప్రేమ ఆవిధంగా మన యెడల విస్తారముగా ఉంటున్నది. ఆయన ప్రేమ ఎన్నటికిని మారనిది. ఇంకను కీర్తనలు 57:9వ వచనములో కూడ ఈలాగున చెబుతుంది, "నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించియున్నది'' అన్న వచనం ప్రకారం ఆయన ప్రేమ కృప ఆకాశము కంటె ఎత్తైనది. అవును, ఈరోజు ఆయన ప్రేమను మరియు కృపను మీ మీద కుమ్మరించుచున్నాడు. కాబట్టి, నేడు మీరు దేనిని గూర్చి చింతించకండి.
హచికో కుక్క పిల్ల మనకందరికి తెలుసు కదా! జపాను దేశములో ఈ కథ పుట్టినది. ఆ కుక్క పిల్ల పేరు హచికో. తన యజమాని ప్రతిరోజు పనికి వెళ్లుచున్న ఒక ప్రొఫెసర్‌గా ఉంటున్నాడు. హచికో కుక్క పిల్ల తన యజమానితో పాటు రైల్వే స్టేషన్ వరకు వెళ్లి, అతను తిరిగి వచ్చేవరకు అక్కడనే వేచి ఉండేది. ఆలాగుననే, ఒక సంవత్సరము వరకు ఇదేవిధంగా కొనసాగుచుండేది. అయితే, ఒకరోజు ఆ యజమాని చనిపోయాడు. తన యజమాని తిరిగి వస్తాడని ఆశిస్తూ, ఈ కుక్క పిల్ల ఆ రైల్వే స్టేషన్ యొద్దనే కనిపెడుతూ ఉండేది. ఈ కుక్క పిల్ల తన యజమాని తిరిగి రావాలని కనిపెడుతూ, కనిపెడుతూ ఆలాగుననే వేచి ఉండేది. సంవత్సరాలు గడిచిన కొలది, హచికోను చూచిన ప్రజలలో ప్రతి ఒక్కరు కూడ దానికి ఆహారము పెడుతూ, దానిని ఆదరిస్తూ ఉండేవారు. తన యొక్క విశ్వాస్యత ఇప్పటికి మారలేదు అని గమనించారు. తన యజమానుని కొరకు ఇంకను వేచి ఉండడము చూశారు. ఆ కుక్క పిల్ల తన యజమానుడు మరణించినప్పటికిని, తన యొక్క విశ్వాస్యత దానిలో ఆలాగుననే దృఢంగా ఉండిపోయినది. అనేకమంది దీనిని చూచి, ప్రేరణ పొందియున్నారు. అవును, నా ప్రియ స్నేహితులారా, ఒక కుక్క పిల్ల తన యజమానుని పట్ల ఇంత దృఢమైన ప్రేమను చూపెట్టగలిగినట్లయితే, మరెంతగా ప్రభువు మనలను ప్రేమించి, మన పాపములను తన మీద మోపుకొని, మరణించి యున్నాడు కదా. మనము ఒంటరిగా ఉండకూడదని మన గురించి ఆయన ఎంతగానో ఆలోచించి, తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు.
నా ప్రియులారా, ఆలాగుననే, నేడు మీరు, 'దేవునికి వ్యతిరేకముగా నేను ఎన్నో పాపములు చేసియున్నాను అని అంటున్నారేమో? ప్రభువు యొద్దకు వెళ్లాలని అనుకుంటున్నాను. కానీ, వెళ్లతానో? లేదో? అని మీ హృదయములో తలంచుకొనుచుండవచ్చును. కానీ, బైబిల్ గ్రంథములో రోమీయులకు 8:38-39వ వచనములలో ఈలాగున చెప్పబడియున్నది, "మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను'' ప్రకారం అవును, మరణమైనను జీవమైనను సరే, దేవుని ప్రేమ నుండి మనలను ఏదియు కూడ విడదీయలేదు. ఈ రోజు కొరకు మన భయాలు, లేక రేపటిని గురించిన చింతలైనను సరే, నరకపు శక్తులైనను సరే, ఏదియు కూడ దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపజాలవు. కాబట్టి, ధైర్యము వహించండి, నా ప్రియ స్నేహితులారా. దేవుని దృఢమైన ప్రేమ ఈ రోజు మీ మీద కుమ్మరించబడుచున్నది. అది ఎన్నటికిని మారనిది. దేవుని ప్రేమ నుండి మిమ్మును ఏదియు వేరుపరచజాలదు. అవును, మిమ్మును ఆ ప్రేమ ఆదరిస్తుంది. దేవుడు ఇచ్చిన వాగ్దానము ప్రకారం నేడు మీరు ఆదరించబడతారు. ఈ రోజు మీరు ఎటువంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికిని, దేవుడు తన ప్రేమను మీ మీద కుమ్మరించుచున్నాడని మాత్రము జ్ఞాపకము ఉంచుకోండి. ఈ సవాళ్లకు మధ్య కూడ దేవుడు మిమ్మును ఆదరించుట కొరకై మరియు వాటిని అధిగమించడానికి సహాయము చేయుట కొరకై ఆయన మీ కొరకు వేచియున్నాడు. కాబట్టి, నేడు ఇటువంటి దృఢమైన ప్రేమను మరియు కృపను మనము పొందుకుందామా? ఆలాగున మనము చేసినట్లయితే, నిశ్చయముగా, దేవుడు నేటి వాగ్దానము ద్వారా మనలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ దృఢమైన ప్రేమను కుమ్మరిస్తున్నందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నేడు మేము ఎటువంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికిని, నీవు మాకు అనుగ్రహించుచున్న వాగ్దానాలను నీవు ఆదరిస్తున్నందుకై నీకు వందనాలు. దేవా, నీ ప్రేమా కృప ఈ రోజే మమ్మును నింపునట్లుగా చేయుము. ప్రభువా, దయచేసి ఈ రోజు నీ ప్రేమతో మమ్మును నింపడం కొనసాగించి, మేము ఎదుర్కొనే ప్రతిదానిని అధిగమించడానికి మాకు సహాయం చేయుము. దేవా, మేము ఎల్లప్పుడు ఒంటరిగా ఉండకుండునట్లుగా, దానికి బదులుగా మాలో ఉన్న నీ పరిశుద్ధాత్మ యొక్క ఎదుగుదలను మేము అనుభూతి చెందునట్లుగా మాకు ఆదరణను దయచేయుము. దేవా, మా మార్గములో ఎదురగుచున్న ఆటంకాలను అధిగమించుట కొరకు మరియు ప్రభువా, మేము ఎన్నటికిని ఒంటరిగా భావించకుండా ఉండుట కొరకు నీవు మాకు అటువంటి నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, నీ ఆత్మ మాలో ఉండి, ఉదయించి, మాకు ఆదరణ కలుగజేయునట్లుగా నీ కృపను మా మీద కుమ్మరించుము. దేవా, మా అవసరతలన్నిటిని తీర్చుము, మమ్మును సమృద్ధిగా దీవించుమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.