నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ రోజు వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 12:7వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము ఈలాగున చెబుతుందిలా, "భక్తిహీనులు పాడై లేకపోవుదురు నీతిమంతుల యిల్లు నిలుచును'' ప్రకారం ఇది ఎంతటి గొప్ప వాగ్దానము కదా స్నేహితులారా, నీతిమంతులు యిల్లు స్థిరంగా నిలిచి ఉంటుంది. కాబట్టి, మీరు ధైర్యంగా ఉండండి.
నా ప్రియులారా, నేడు మీ యిల్లు కూడా నిత్యమైన ఆశీర్వాదాలతో నింపబడాలంటే, మీరు కూడా ప్రభువునందు నీతి గలిగిన జీవితాన్ని జీవించినట్లయితే, మీ యిల్లు ఎల్లప్పుడు నిలుస్తుంది. దావీదు రాజైన సౌలును బట్టి, ఎంతగానో చింతించుచుండెను. కారణం, రాజైన సౌలు దావీదుపై ఉన్న అసూయతో అతనిని సంహరించాలని అనుకున్నాడు. అప్పుడు దేవుడు దావీదునకు ఒక శక్తివంతమైన వాగ్దానమును ఇచ్చాడు. ఆ వాగ్దానము బైబిల్ నుండి 2 సమూయేలు 7:16వ వచనములో చెప్పబడినట్లుగానే, " నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను.'' అవును, ఈ మాటలు ఒక దైవజనుని ద్వారా దావీదునకు ఇవ్వబడిన వాగ్దాన వచనము ఇది. ఇదే వాగ్దానమును మీరు చదివి, మీ కొరకు దానిని స్వంతం చేసుకొనండి. ఈ వాగ్దాన వచనము ద్వారా దావీదు ఎంతగా ప్రోత్సహించబడి ఉండవచ్చును కదా!
నా ప్రియులారా, ఇంకను 1 సమూయేలు 25:28వ వచనము ప్రకారము ఒక దైవజనురాలి ద్వారా దావీదునకు ఒక వాగ్దానము ఇవ్వబడినది, "నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. నా యేలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా యేలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతి నిచ్చును. నీవు బ్రదుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును'' అని తెలియజేసెను. అదేవిధముగా, మరొక వాగ్దానము అతనికి బయలుపరచబడెను. ఇంకను కీర్తనలు 23:6వ వచనములో తానే స్వయంగా ఈ విధంగా పలుకుచున్నాడు, "నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను'' అని చెప్పాడు. ఎందుకు అటువంటి కదిలించబడలేని నమ్మకాన్ని కలిగియున్నాడు? కీర్తనలు 23:1వ వచనమును చూచినట్లయితే, "యెహోవా నా కాపరి'' అని అంటున్నాడు. కనుకనే, దేవునిని నేడు మీ కాపరిగా కలిగి యుండునట్లుగా మీరు చూచుకోవాలి.
నా స్నేహితులారా, ఈ వాగ్దానం మీది కావాలంటే, ప్రభువు నిజంగా మీ కాపరి అని మీరు నిర్ధారించుకోవాలి. అంతమాత్రమే కాదు, మీరు ఆయనను ఘనపరచాలి. మీరు ఆయనను విశ్వసించాలి. ఎల్లవేళల మీరు ఆయనను వెదకాలి. అప్పుడే ఆయన మీకు కాపరిగా ఉంటాడు. మనము మన మాటల రూపములో చెప్పినట్లయితే సరిపోదు. క్రియా రూపముగా చూపెట్టాలి. ఆయనను విశ్వసించాలి, ఆయనతో సమయమును గడపాలి. అప్పుడు ఆయన మీకు కాపరిగా ఉంటాడు. మీరు దేనిని గురించి చింతించనక్కర్లేదు. ప్రభువు మీ గృహమును దీవిస్తాడు. ఇప్పుడు కూడా సమస్తమును ప్రభువు హస్తాలకు సమర్పించుకుందాము. ఆలాగున చేసినట్లయితే, నిశ్చయముగా, మీ యింటికి శాశ్వతమైన ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రశస్తమైన ప్రియ పరలోకమందున్న మా తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా కుటుంబ జీవితములో సమస్యలను బట్టి నిస్పృహ చెందుచున్న మమ్మును నీవు ఎరిగి ఉన్నావు. ప్రభువా, దావీదుకు సహాయము చేసినట్లుగా నీ బిడ్డలైన మాకు సహాయము చేయుము. ఇంకను నీతిగల జీవితమును మాకు దయచేసి, మమ్మును దీవించుము. దేవా, మా జీవితాలలో ఉన్న మా చింతలన్నిటిని తొలగించుము. మా జీవితములో సంతోషము సమాధానము కలిగియుండునట్లుగా చేయుము. ప్రభువా, నీతిమంతుల ఇల్లు స్థిరంగా నిలుస్తుందని మీ వాగ్దానాన్ని విశ్వసిస్తూ, విశ్వాసం నిండిన హృదయంతో మేము ఈ రోజు యెదుటకు వచ్చుచున్నాము. దేవా, నీవు మా కాపరివి మరియు మా జీవితంలోని ప్రతి భాగాన్ని, మా ఇంటిని మరియు మా కుటుంబాన్ని నీ ప్రేమగల చేతులలోనికి అప్పగించుకొనుచున్నాము. ప్రభువా, నీవు దావీదును రక్షించి, ఆశీర్వదించినట్లుగానే, నీ దైవానుగ్రహంతో మా ఇంటిని శాశ్వతంగా స్థిరపరచాలని మేము అడుగుచున్నాము. దేవా, మమ్మును నీతిమార్గంలో నడిపించుము మరియు మా జీవితంలోని ప్రతి క్షణంలో నిన్ను వెదకడానికి మాకు సహాయం చేయుము. యేసయ్యా, నీ సన్నిధి మా బలం, నీ శాంతి మా హృదయాన్ని నింపునట్లు చేయుము. దేవా, నిన్ను మేము ఘనపరచి, వెంబడించుట ద్వారా మా ఇల్లు శాశ్వతమైన ఆశీర్వాద స్థలంగా ఉంటుందని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మా కాపరి మరియు మా బలమైన పునాదిగా నీవు ఉండి మమ్మును నడిపించుమని మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.