నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 20:4వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనములో ఈలాగున తెలియజేయుచున్నది, "...మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే'' ప్రకారం, ఇశ్రాయేలీయులకు వాగ్దాన దేశములోనికి అడుగు పెట్టడానికి ముందు, మోషే కొంత సమయమును తీసుకొనియున్నాడు. వాగ్దాన దేశములోనికి ప్రవేశించి, ప్రభువు యొక్క ఆశీర్వాదములను స్వీకరించమని అతడు వారిని ప్రోత్సహించాడు. మరియు ద్వితీయోపదేశకాండము 20:1వ వచనములో," నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుఱ్ఱములను రథములను మీకంటె విస్తారమైన జనమును చూచునప్పుడు వారికి భయపడవద్దు; ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును అని మోషే ఆ ప్రజలకు చెప్పెను.'' కనుకనే, నేడు మీరు ఎదుర్కొనే ప్రతి పోరాటమును చూచి భయపడకండి.
నా ప్రియులారా, మన వ్యక్తిగత జీవితములో కూడా మనము సమస్యలతో పోరాడుచున్నప్పుడు, మనకంటె శక్తివంతమైన శత్రువులను మనము ఎదుర్కొన్నప్పుడు, మనము ఎంతగా నిరాశలోనికి మరియు నిస్పృహలోనికి వెళ్లిపోతుంటాము. ప్రియ స్నేహితులారా, ప్రభువు మీతో కూడా ఉన్నాడు. ప్రభువు మీకు వాగ్దానము చేసినట్లుగానే, ఆయన ఈ రోజు విజయపధములోనికి మిమ్మును నడిపించబోవుచున్నాడు. శత్రువు మీకు విరోధముగా లేచినప్పుడు, పరిశుద్ధాత్ముడు మీకు తోడై ఉండి, ఆ శత్రువుపైన మీకు విజయమునిస్తాడు. మీకు వ్యతిరేకముగా వస్తున్నటువంటి బలవంతులను చూచి ఎన్నడును, భయము నొందకండి. ఇంకను బైబిల్‌లో చూచినట్లయితే, 1 యోహాను 4:4వ వచనము ప్రకారము, "చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు'' అని చెప్పబడినట్లుగానే, ఈ లోకములో ఉన్నవానికంటె మనలో ఉన్నవాడు ఎంతో గొప్పవాడుగా ఉన్నాడని మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. ఎందుకనగా, మీలో ఉన్న దేవుడు గొప్పవాడు స్నేహితులారా.
నా ప్రియులారా, బైబిల్‌లో కీర్తనలు 20:7వ వచనమును చూచినట్లయితే, "కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము'' ప్రకారము మనము దేవుని బట్టి అతిశయపడవలెనని స్పష్టముగా మనకు తెలియజేయుచున్నది. ఈ లోకము ధనికులైన వారు వారి డబ్బుపైన నమ్మకముంచుకుంటారు. తమను తామే నమ్ముకుంటారు. చివరికి వారు క్రిందపడిపోయి వైఫల్యమును పొందుతారు. అయితే, ప్రభువునందు విశ్వాసముంచిన మనము నిశ్చయముగా, విజయమును పొందుకుంటాము నా స్నేహితులారా.
మరియు నా ప్రియులారా, సామెతలు 21:31లో చెప్పబడినట్లుగానే, " యుద్ధ దినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుటకద్దు గాని రక్షణ యెహోవా అధీనము '' ప్రకారం విజయము దేవునిదే. ఇంకను నిర్గమకాండము 17వ అధ్యాయములో చూచినట్లయితే, ప్రభువు ఇశ్రాయేలీయులకు తోడై ఉండి, అమాలేకీయులపైన విజయమును ఇచ్చినప్పుడు, మోషే ఒక బలిపీఠమును కట్టి, "యెహోవా నిస్సీ'' ప్రభువే మన ధ్వజము అని పేరు పెట్టియున్నాడు. ప్రభువు యుద్ధములో వారితో కూడా ఉండి వారి శత్రువులందరిపైన విజయమునిచ్చి, శత్రువులను నశింపజేసియున్నాడు. కనుకనే,"యెహోవాయే మా ధ్వజముగా ఉన్నాడు '' అని అంటున్నారు. అనగా, "దేవుడే మన విజయమై ఉంటున్నాడు '' అని మోషే చెప్పాడు.
అవును, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మీతో ఉండి మీ యుద్ధములతో పోరాడుచున్నాడు. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, "అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను.'' ఆలాగుననే, నా ప్రియులారా, మీరు ఊరకుండండి, ప్రభువు ఈ రోజు మీకిచ్చుచున్న విమోచనను మరియు రక్షణను చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను అనగా, మీ శత్రువులను మీరు ఇకమీదట మరి ఎన్నడును చూడరు. ప్రభువే మీ యుద్ధములను చేస్తాడు. మీరు కేవలము ప్రభువు యందు విశ్వాసముంచండి. ఈ రోజు కూడా మీరు అన్ని కార్యములలో విజయాన్ని పొందుకుంటారు నా స్నేహితులారా, దేవుడు మిమ్మును దీవించును గాక. ప్రభువు మీతో కూడా ఉండి మీకు విజయమును అనుగ్రహించును గాక. కాబట్టి, మీరు నేటి నుండి సింహమువలె ధైర్యముగా ఉండండి. ప్రభువు యందు విశ్వాసముంచండి. నేటి వాగ్దానము ద్వారా ప్రభువు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ వాక్కు చొప్పున మమ్మును ఆశీర్వదించుము. ప్రభువా, నీవు ఇశ్రాయేలీయులతో ఉండి వారి పక్షముగా యుద్ధము చేసినట్లుగానే, మేము జీవితములో అనేక సమస్యలను ఎదుర్కొంటున్న మాతో నీవు ఉండి, మా పక్షమున యుద్ధము చేయుము. దేవా, మేము ఎదుర్కొంటున్న యుద్ధ పోరాటములలో నీవు మాకు విజయమును అనుగ్రహించుము. ప్రభువా, మాకు విరోధముగా లేచుచున్న అపవాదిని అణిచివేయుము. ప్రభువా, మేము ఎదుర్కొనే ప్రతి యుద్ధంలో మాతో ఉండి, శత్రువులు లేదా సవాళ్లు ఎక్కువగా అనిపించినప్పుడు, మేము నీ విజయ వాగ్దానాన్ని విశ్వసించునట్లు చేయుము. యేసయ్యా, ఈ లోకములో ఉన్నవారికంటె మాలో ఉన్న నీవు గొప్పవాడనియు, నీవు మా కొరకు పోరాడుతున్నావని తెలిసి మేము సమాధానమును పొందుకొనునట్లుగాను, మా భయాలను, చింతలను నీ పాదాల దగ్గర ఉంచుతున్నాము. దేవా, మా విశ్వాసాన్ని బలపరచుము. ప్రభువా, మేము ఊరకుండి నీ రక్షణను మేము చూచునట్లుగాను, నీవు ఇశ్రాయేలీయులను రక్షించినట్లుగానే, మా ప్రతి పోరాటము నుండి మమ్మును రక్షిస్తావని విశ్వసించేలా మాకు సహాయం చేయుము. దేవా, మేము మా స్వంత బలం మీద ఆధారపడను, కానీ నీ శక్తి మీద ఆధారపడుచున్నాము. దేవా, నీవు మా ద్వజము మరియు మా విజయం. దేవా, ఈ రోజే మా విజయ దినముగా ఉండునట్లు చేయుము. దేవా, నేడు మా కోర్టు కేసులలోను మరియు మా కుటుంబ, ఉద్యోగ సమస్యలలోను మాకు నీ యొక్క విజయమును అనుగ్రహించి, మాకు విరోధముగా లేచు అపవాది శక్తులు మరియు శత్రువులు పరిపూర్ణంగా నశించిపోవునట్లు చేయుము. ప్రభువా, నీవే మా పక్షమున ఉండి యుద్ధము చేసి, మాకు విజయమును అనుగ్రహించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.