నా ప్రియ స్నేహితులారా, నేటి దినమును బట్టి, ఉత్సాహభరితుడను అగుచున్నాను. ఇటువంటి దైవాశీర్వాదము మన మీదికి దిగి వస్తుందని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాను. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి నిర్గమకాండము 17:15వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఈ వచనమును మనము చూచినట్లయితే, "మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి 'యెహోవా నిస్సీ' అని పేరు పెట్టెను.'' 'యెహోవా నిస్సీ' అనగా, ప్రభువు మనకు ధ్వజముగా ఉన్నాడు. కనుకనే మీరు ధైర్యంగా ఉండండి.
నా ప్రియులారా, మీకు తెలుసు కదా, ప్రభువు మనకు సంకేతముగా ఉన్నప్పుడు, ఆయన మన ధ్వజము మీద సంకేతముగా ఉన్నప్పుడు, కార్యాలు భయపడి, అన్నియు కూడా జరగడము ప్రారంభిస్తాయి. మా తాతగారికి ఆకస్మాత్తుగా పరలోక దర్శన భాగ్యము కలిగినప్పుడు, ఒక దూత ఆయన దగ్గరకు వచ్చి, ఆయనను తీసుకొని వెళ్లి, పాతాళమును చూపించినది. అక్కడ వివిధ రకాల దురాత్మలను మరియు సాతాను ఆయన చూచారు. అక్షరాల అక్కడ సాతాను యేసయ్య వలె సింహాసనము మీద కూర్చుని ఉండి, మిగిలిన దయ్యాలతో ప్రణాళికలను మరియు ఆలోచన చేయుచుండెను. అదేమనగా, ఒక దేశాన్ని ఎలా చెరపట్టాలి అని పన్నాగాలు వేయుచుండెను. ఒక దేశమును చెరపట్టడానికి ఏ మనిషిలోనికి ప్రవేశించాలని ఆలోచన చేయుచుండెను. ఈలాగున వారు చర్చించుకుంటుండగా, ఇప్పుడు మా తాతగారి వైపు తిరిగి దూత ఆయనతో ఏమని చెప్పాడనగా, 'ఇదిగో దినకరన్, ఇప్పుడు తమషా చూడు,' అని చెప్పి, ఆ దూత, 'యేసూ' అను పేరును మెల్లగా ఉచ్చరించెను. ఆ యొక్క మెల్లని స్వరము పాతాళలోకము యొక్క గదులలో ప్రకంపించెను. అది సాతాను యొక్క చెవికి చేరగానే, సాతాను సింహాసనము మీద నుండి పైకి లేచెను. సాతాను, ఇలాగున పలికెను, 'నిరంతరము మనము బంధించబడునట్లుగా యేసు ఇక్కడకు వచ్చాడా? ' అని చెప్పి దురాత్మలు భయముతో వణికిపోయెను. అవును, నా ప్రియులారా, యేసు నామము అటువంటి గొప్ప నామము. అట్టి నామమును, ఆయన ధ్వజముగా నేడు మీ మీద ఉంచుచున్నాడు. అదే దేవుడు నేడు మీతో కూడా ఉన్నాడు అని తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. కనుకనే, సాతానును చూచి భయపడకండి. ధైర్యంగా ముందుకు సాగండి.
నా ప్రియ స్నేహితులారా, మనము ఎందుకు భయపడాలి? మనము చేయవలసిందల్లా ఒక్కటే, మనము ఆయన నామమును ధరించాలి. అంతమాత్రమే కాదు, ఆయన నామమును మనము ఘనపరచాలి. ఎప్పుడు కూడా ఆ నామమును కాదనుకూడదు మరియు ఎంతమాత్రము త్రోసివేయకూడదు. ఆ నామమును మీ పరిచర్యలో మీరు కలిగియుండాలి మరియు నిరాంతరాయముగా సమాజములోను, ఆలాగుననే, మీరు పనిచేయుచున్న స్థలములో కూడా ఆ నామము మీ మీద మీరు కలిగి ఉండాలి. ఎందుకనగా, యేసు నామమును మీ మీద మీరు మోయుచున్నప్పుడు, మీరు వెళ్లి, ఆయన కోరిన దానిని నెరవేర్చినప్పుడు, దేవునికి సంతోషకరమైనవాటిని మీరు చేసినప్పుడు, దాడులు, మీకు విరుద్ధముగా వస్తుంటాయి. ప్రజలు మిమ్మును పరీక్షించడానికి ప్రయత్నిస్తుంటారు. అపవాది పరీక్షించుటకు ప్రయత్నిస్తాడు. వారు, ఈ వ్యక్తిని పట్టించినట్లయితే, ఆ వ్యక్తి మీద తప్పుడు సంగతులు చెప్పినట్లయితే, నీకు పదోన్నతిని కల్పిస్తామని చెబుతారు. ఈ లంచమును చెల్లించినట్లయితే, నీవు ముందుకు వెళ్లగలవు అని చెబుతుంటారు. అటువంటి పరీక్షలు వస్తాయి. కానీ, మనము తప్పు మార్గములో పడిపోతామేమో, లేక యేసయ్యా నామమును కాదనుకుంటామో అని అనుకుంటాము.
కానీ, నా ప్రియులారా, అటువంటి పరిస్థితిలో కూడా మీరు దేవుని కొరకు స్థిరంగా నిలిచి ఉన్నప్పుడు, ప్రభువును మీ యొక్క ధ్వజముగా మీరు కలిగియున్నప్పుడు ఆయన మిమ్మును ఉన్నతముగా పైకి లేవనెత్తుతాడు. ఏ మానవుడు ఇవ్వగలిగిన దానికన్నను, అంత ఉన్నతముగా మిమ్మును పైకి లేవనెత్తుతాడు. ప్రభువును మన ధ్వజముగా కలిగియున్నప్పుడు, అట్టి ఆశీర్వాదమును మనము కలిగియుంటాము. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీకు విజయవంతమైన జీవితమును అనుగ్రహించి, మిమ్మును ఉన్నత స్థానమునకు హెచ్చించును గాక.
ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ గొప్ప ఆశీర్వాదములకొరకు నీకు వందనాలు. దేవా, ఈ రోజున నీవు మాకు ధ్వజముగాను మరియు మా యొక్క సంకేతముగా ఉండుము. ప్రభువా, నీ నామమును మా మీద ఉంచుము, ఎంత బలమైన నామమును మేము మోయుచున్నాము. దేవా, మేము సర్వశక్తిగల దేవుని బిడ్డలముగా ఉండునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. దేవా, మా పరీక్షలలో ఉన్న ఆటంకములను తొలగించి, మాకు జయమును దయచేయము. దేవా, మేము నీకు నమ్మకస్థులముగా ఉంటూ, నీలో బలంగా ఉండుటకు మాకు సహాయము చేయుము. దేవా, నీవే, మా యెహోవా నిస్సీ - మా విజయ పతాకంగా ఉన్నందుకు వందనాలు. ప్రభువా, నీ నామము నిజంగా మా విజయ పతాకంపై చిహ్నం ఉండునట్లుగా చేయుము. తద్వారా మా శత్రువుల దాడులకు మేము భయపడకుండా, మేము విజయం పొందడానికి యెహోవా నిస్సీగా మాతో ఉండుము. ప్రభువా, మా జీవితంలోని ప్రతిదానికంటే మేము యేసు నామాన్ని ఉన్నతంగా హెచ్చించునట్లుగా మాకు నీకృపను దయచేయుము. మేము ఎన్నడును కదిలించకుండా, నీ నామాన్ని ఎప్పుడూ తిరస్కరించకుండా, ప్రతి శోధనలలో కూడా విశ్వాసంలో స్థిరంగా నిలబడి ఉండునట్లుగా చేయుము. ప్రభువా, మేము చేయు ప్రతి పనిలోనూ నిన్ను మహిమపరచగలిగేలా దయచేసి నీ చిత్తానికి అనుగుణంగా మమ్మును నడిపించి, హెచ్చించుమని యేసు క్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.