నా ప్రియమైన స్నేహితులారా, బైబిల్ నుండి నేటి వాగ్దానముగా యెషయా 31:5వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును దాని కాపాడుచు విడిపించుచునుండును దానికి హానిచేయక తప్పించుచునుండును.'' అదేవిధంగా, పక్షిరాజువలె ప్రభువు మనలను భద్రపరచువాడై యున్నాడు. బైబిల్‌లో అనేక సందర్భాలలో దేవుడు పక్షిరాజైన గ్రద్దకు పోల్చబడియున్నాడు. పక్షిరాజుయైన గ్రద్ద వలె ఆయన మనపైన ఎగురుచూ, మనలను కాపాడుచున్నాడు. బైబిల్‌లో పక్షిరాజైన గ్రద్దను పక్షులన్నిటికంటెను రాజువంటిదని పోల్చబడియున్నది. దానికి ఎంతో శక్తి కలదు. అది తన శత్రువులందరి మీద కూడ దాడి చేయగలదు. తనకు ఆహారమైయున్న దాని మీద దాడి చేయుటకు మనిషినైనను సరే, పక్షిరాజైన గ్రద్ద మన మీదికి దాడి చేయుటకు వెనుక తీయదు. ఎందుకంటే, అది ఎంతో బలమును, శక్తియు కలిగి ఉంటుంది.


అదేవిధముగా, సర్వశక్తిగల దేవుడు మనలను భద్రపరచి కాపాడువాడై యున్నాడు. దావీదు దేవుని యొక్క భద్రతను గురించి భాగుగా ఎరిగి యున్నాడు. బైబిల్‌లో చూచినట్లయితే, కీర్తనలు 32:7వ వచనములో, " నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు'' అని అంటున్నాడు. సర్వశక్తిగల దేవుని రెక్కల చాటున మనము దాగుకొనవచ్చును. ఏ సమయమునైనను లేక ఆపద యందైనను సరే, సంతోషముగా ఆయన రెక్కల చాటునకు వెళ్లి, భయము లేకుండా మనము భద్రంగా దాగుకొని ఉండవచ్చును.


ఒక ఫర్యాయము మేము విమానము దిగి వెళ్లుచున్నప్పుడు, మమ్మును ఆ ప్రాంతమునకు ఆహ్వానించిన వ్యక్తి, మేము ఉండవలసిన ప్రాంతానికి అక్కడకు మమ్మును తీసుకొని వెళ్లడము జరిగినది. అక్కడ ఉన్నవారు మమ్మును చూచి ఎంతగానో ఆనందభరితులైయ్యారు. నిరంతారయంగా, అతడు మాతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆలాగుననే, మేము కుటుంబముగా కలిసి ఆ యొక్క కారులో కూర్చుని ఉన్నాము, ఆయన ఆనందంతో ఉండుట వలన సిగ్నిల్ లైట్‌ను కూడ గమనించలేదు. ఆకస్మాత్తుగా సిగ్నిల్ లైట్ ఎరుపు రంగులోనికి మార్చబడినది. అయినప్పటికిని అతడు ఆ ఎరుపు రంగు గమనించకుండా, ఆ గీతను దాటి ఆలాగుననే, కొనసాగుతూ ముందుకు వెళ్లిపోయాడు. ఆకస్మాత్తుగా ఎడమ వైపు నుండి ఒక కారు వచ్చి, మేము ప్రయాణము చేయుచున్న కారును డీకొట్టడము జరిగినది. కారు లోపల ఉన్న మాకైతే, అస్సలు ఏమి జరుగుతుందో తెలియలేదు. అన్నియు కూడ కనురెప్పపాటు కాలములో జరిగిపోయాయి. మేము కేవలము 'యేసూ,' అని మాత్రమే కేకలు వేశాము. ఆ ఒక్క మాట మాత్రమే మేము చెప్పగలిగాము. అటువంటి సమయములో మహాద్భుతంగా దేవుడు మా స్నేహితులతో కలిపి, మా కుటుంబమంతటిని ఎంతగానో రక్షించి, కాపాడియున్నాడు. కేవలము, కారుకు మాత్రమే నష్టము జరిగినది. మేమందరము కూడ క్షేమముగా కాపాడబడ్డాము. ప్రియ స్నేహితులారా, మనలను కాపాడుటకు మనలను భద్రపరచుటకు ఎంత మంచి దేవుని మనము కలిగి యున్నాము కదా. ఆయన మనము దాగు చోటువంటివాడై యున్నాడు. శత్రువు ఏ సమయములోనైనను మన మీదికి దాడి చేయవచ్చును. బైబిల్‌నందు, 1 పేతురు 5:8వ వచనములో సెలవిచ్చిన రీతిగా, "నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు'' అన్న వచనము ప్రకారం అపవాదియైన శత్రువు ఎవరినైనను మ్రింగివేయాలని గర్జించు సింహము వలె వెదకుచూ, తిరుగుచున్నాడు. అయితే, అపవాదియైన శత్రువు నుండి ప్రభువు మనలను భద్రపరచువాడై యున్నాడు. అపవాదియైన దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు అని చెప్పబడినట్లుగానే, బైబిల్‌లో కీర్తనలు 121:7వ వచనము దేవుని యొక్క వాక్యములో చెప్పబడినట్లుగానే, "ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును'' అని చెప్పినట్లుగానే, మనలను కాపాడే ఎంతమంచి దేవుని మనము కలిగి యున్నాము కదా!


మా జీవితములో చూచినట్లయితే, సేవాపరిచర్య చేయు నిమిత్తమై దాదాపుగా 40 దేశములకు పైగా ప్రయాణము చేసియున్నాము. అయినప్పటికి కూడ అన్ని ప్రాంతములకు ప్రభువు మాతో కూడ వచ్చియున్నాడు. ప్రియ స్నేహితులారా, పక్షి తన పిల్లలను కాపాడునట్లుగా, ప్రభువు మమ్మును ఎంతగానో కాపాడి యున్నాడు. పక్షులు తన పిల్లలను కాపాడునట్లుగా మా యొక్క ప్రయాణములన్నిటిలోను మమ్మును ఆయన భద్రపరచి, కాపాడి యున్నాడు. ఏ దుష్టత్వము మరియు కీడు కూడ మాకు ఎటువంటి హాని చేయకుండా ఆయన మమ్మును కాపాడి యున్నాడు. ఆలాగుననే, ప్రియ స్నేహితులారా, మీకు కూడ ప్రభువు జరిగిస్తాడని మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. ఆయన మిమ్మును భద్రపరచడము మాత్రమే కాకుండా, విడిపించును, తప్పించును, కాపాడును. ఆయన ఆపద మరియు కీడు నుండియు మిమ్మును విడిపించి, రక్షించును మరియు కాపాడును. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నీ రక్షణ మరియు ప్రేమకు కృతజ్ఞతతో మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. ప్రభువా, నీవు యెరూషలేమునకు కేడెముగా ఉండి, బలమైన పక్షిరాజు వలె దాని మీద సంచరించినట్లు, నీవు ఎల్లప్పుడూ మమ్మును చూస్తున్నావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మా దాగు చోటు మరియు మమ్మును విడిపించువాడవు నీవే గనుకనే నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, ఆపద సమయాలలో, నీవు మమ్మును సురక్షితంగా ఉంచుతావని తెలుసుకుని, నీ రెక్కల క్రింద మేము ఆశ్రయం పొందుకొనుటకు మాకు సహాయము చేయుము. దేవా, సరైన మార్గములో మమ్మును నడిపించుము మరియు మమ్మును చుట్టుముట్టే ప్రమాదాలు మరియు శత్రువుల నుండి మమ్మును రక్షించుము. ప్రభువా, నీ వాగ్దానములు మా హృదయాన్ని శాంతిసమాధానముతోను మరియు విశ్వాసంతోను నింపునట్లు చేయుము. దేవా, నీవు మమ్మును మరియు మా ప్రియులైన వారిని కాపాడుచున్న అనేక మార్గాలను బట్టి మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, నీ శక్తి మరియు ప్రేమను ఎల్లప్పుడు గుర్తుంచుకోవడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా రక్షకుడవనియు, మా విమోచకుడనియు, మమ్మును కాపాడువాడవనియు మేము నీ మీద నమ్మకం కలిగియున్నాము. ప్రభువా, మా విశ్వాసమును ఘనపరచి మమ్మును నీ రెక్కల క్రింద భద్రముగా దాచుకొని, మా ఆపదలలోను మరియు కీడులలోను మమ్మును భద్రపరచి, కాపాడి, విడిపించి, తప్పించి, సంరక్షించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.