నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు శక్తివంతమైన నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 కొరింథీయులకు 6:20వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "(మీరు) విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి'' అన్న వచనము ప్రకారము మనము దేవుని చేత కొనబడియున్నాము కనుకనే, మన దేహముతో మనము ఆయనను మహిమపరచవలెను.

యేసుక్రీస్తు సిలువలో అనేక శ్రమలను పొంది, చంపబడ్డాడు. ఆయన పొందిన సిలువలో శ్రమల ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా, మనకు రక్షణ కలుగుతుంది. కనుకనే, 2 కొరింథీయులకు 5:17 వచనములో చూచినట్లయితే, "కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను'' అని చెప్పబడినట్లుగానే, మీరు క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు, మీ జీవితం నుండి అన్ని పాత అలవాట్లు మరియు పాపపు మార్గాలు తొలగిపోతాయి, క్రీస్తు యేసునందు మీరు నూతనంగా మార్చబడతారు. అందుకే యేసు క్రీస్తు ఇటువంటి దైవీకమైన రూపాంతరము పొందుకొనే గొప్ప అనుభవమును ఇవ్వడాని కొరకే ఈ లోకానికి వచ్చియున్నాడు. యేసు క్రీస్తు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు, ఆయన చిందించిన రక్తము మనలను కడిగి శుద్ధి చేసి, నూతన సృష్టిగా మార్చుటకు శక్తిని కలిగియున్నది.

బైబిల్‌లో సౌలు అను ఒక వ్యక్తి జీవితమును మనము చూచినట్లయితే, అతడు క్రీస్తుకు విరోధముగా ఉండెను. క్రీస్తుకు విరోధముగా అతడు అనేకమైన కార్యములను జరిగించాడు. అయితే, యేసయ్యా, అతనిని దర్శించి, ప్రేమతో అతనిని పిలుచుకొని, అతని పట్ల కనికరమును చూపించాడు. వెంటనే, యేసు ప్రేమ అతనిని మార్చి, తనను నూతనపరచి, అతడు పౌలుగా మారాడు. అంతమాత్రమే కాదు, అతడు దేవుని యొక్క దైవజనునిగా మార్చబడ్డాడు. నా స్నేహితులారా, నేడు యేసుక్రీస్తు రక్తము మీ జీవితమును ఆ విధంగా కూడా మార్చగలదు. కనుకనే, ఇప్పుడే మీరు సిలువ వైపు చూచినప్పుడు, ప్రభువు మిమ్మును శుద్ధి చేసి, నూతనంగా మారుస్తాడు. సౌలును, పౌలునుగా మార్చినట్లుగానే, నేడు మిమ్మును కూడా మారుస్తాడు. కాబట్టి, యౌవనస్థులారా, ప్రభువు చెంతకు రండి, 'నా కుమారుడా/ కుమార్తె, నా యొద్దకు రండి, మీకు నూతన హృదయమును ఇస్తానని' ప్రభువు అంటున్నాడు. సిలువలో ఆయన చేసిన త్యాగము మీ కొరకే. కనుకనే, నేడు మిమ్మును మీరు తగ్గించుకొని, ప్రభువు చెంతకు వచ్చి, ఆయనకు మొఱ్ఱపెట్టండి, 'తండ్రీ, నన్ను క్షమించు, నా పాపముల నుండి నన్ను కడుగుము. సౌలును పౌలుగా మార్చిన దేవా, నేడు నన్ను కూడా పౌలు వలె నూతన సృష్టిగా మార్చుము' అని చెప్పినట్లయితే, ఆయన మిమ్మును ఆ విధంగానే మారుస్తాడు. హల్లెలూయా!!

నా ప్రియులారా, నేడు మీరు మీ హృదయపూర్వకంగా ఈ ప్రార్థన చేసినప్పుడు, పాపపు అలవాట్లు మీ నుండి తొలగించబడతాయి. ఇప్పుడే యేసుక్రీస్తు యొక్క రక్షణను మీరు పొందుకొనెదరు. పాపపు అలవాట్లు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువు చెంతకు రండి, ఆయన సన్నిధిలో ప్రార్థిద్దామా? ఆలాగున ప్రార్థించినప్పుడు, ఆయన మన పాత జీవితాన్ని మార్చి, నూతన సృష్టిగా చేస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, మేము నీ దయ మరియు కృపను కోరుతూ వినయపూర్వకమైన హృదయంతో నీ సన్నిధికి వచ్చుచున్నాము. యేసయ్యా, మా రక్షణ కొరకు చిందింపబడిన నీ యొక్క అమూల్యమైన రక్తానికి వందనాలు. ప్రభువా, మా పాపాలన్నిటి నుండి మమ్మును కడిగి శుద్ధులనుగా చేసి, క్రీస్తులో మమ్మును నూతన సృష్టిగా మార్చుము. తండ్రీ, మా కొరకు ఆ సిలువలో నీ ప్రాణము పెట్టినందుకై నీకు వందనాలు. నీ ప్రశస్తమైన రక్తముతో మమ్మును కడుగుము. ప్రభువా, మమ్మును క్షమించుము, నీవు మమ్మును తాకి, మమ్మును నూతన సృష్టిగా మార్చుము. యేసయ్య, నీవు సిలువలో కార్చిన రక్తమును బట్టి నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, సౌలును పౌలుగా మార్చినట్లుగానే, మా హృదయాన్ని మార్చి మా ఆత్మను నూతనపరచుము. ప్రభువా, మేము నీ మార్గాలలో నడవగలిగేలా మమ్మును నీ ప్రేమ, శాంతి మరియు నీతితో నింపుము. దేవా, ప్రతి పాపపు అలవాటును మానుకొనునట్లుగాను మరియు మమ్మును నీ నుండి వేరు చేయు ప్రతిదాని నుండి విడిపించుము. యేసయ్యా, మేము నేను నీకు చెందినవారము కనుకనే, మా శరీరం, మనస్సు మరియు ఆత్మలో నిన్ను మహిమపరచడానికి మాకు సహాయం చేయుము. దేవా, మేము నిన్ను హృదయపూర్వకంగా అనుసరించేలా మా విశ్వాసాన్ని బలమైనదిగా మార్చుము. ప్రభువైన యేసు, మా జీవితాన్ని పరిపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నాము. దేవా, మేము నీ యొక్క పరిపూర్ణ చిత్తములో మమ్మును నడిపించుము మరియు నీ యొక్క నిరంతర ప్రేమకు మరియు మమ్మును నీలో నూతన సృష్టిగా మార్చుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.