నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మీకు శుభములు తెలియజేయుటలో నాకు చాలా ఆనందముగా ఉన్నది. ప్రత్యేకంగా క్రీస్తునందు నా సహోదరీలైన మీకందరికి స్త్రీల దినోత్సవ శుభాకాంక్షలు మరియు ఆశీర్వాదములను తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 కొరింథీయులకు 6:2 వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా! ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము'' ప్రకారం ఈ వచనము మనకు ఎంతగానో నిరీక్షణను అనుగ్రహించుచున్నది. ప్రభువు మన ప్రార్థనలకు జవాబును అనుగ్రహించుటకు ఇదియే సరియైన సమయము. కాబట్టి, నా ప్రియులారా, నేడు మీరు ఎటువంటి ప్రార్థన విన్నపములను కలిగియున్నను సరే, నేటి దినముననే ప్రభువునకు వాటన్నిటిని కూడా సమర్పించండి. మీరు దేవుని యొక్క కనుదృష్టిలో అనుగ్రహమును పొందియున్నారు. ఆలాగుననే, ఈ సంవత్సరము ఆశీర్వాదపు జల్లుల వర్షము కురియు సంవత్సరము. దేవుడు మీలో ప్రతి ఒక్కరి ప్రార్థనకు ఆయన జవాబును అనుగ్రహించుచున్నాడు. కనుకనే, మీరు చింతించకండి.
బైబిల్‌లో నోవహును చూచినట్లయితే, నోవహు దేవుని దృష్టిలో దయను లేక అనుగ్రహమును పొందియున్నాడు. యేసు దేవుని దృష్టిలోను మరియు మనుష్యుల దృష్టిలోను దయను పొందుకొని యుండెను. ఆలాగుననే, మోషే దేవుని యొక్క దృష్టిలో దయను మరియు అనుగ్రహమును పొందుకొన్నాడు. అందుచేతనే, ప్రభువు తాను సెలవిచ్చిన సమస్తమును జరిగించాడు. కనుకనే, అతడు అడిగినదంతయు దేవుడు అతనికి అనుగ్రహించియున్నాడు. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, మీ జీవితములో అద్భుతములు జరగడానికి ఇదియే తగిన సమయము. 'ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. బైబిల్ అంతటిలోను పలుచోట్ల, "ఈ దినము మొదలుకొని, నేను నిన్ను ఆశీర్వదించెదను'' అను మాటను మనము చూడగలుగుచున్నాము. మరియు ఈ రోజున మీ యింటికి రక్షణ వచ్చియున్నదని సెలవిచ్చుచున్నాడు. దేవుడు విభిన్న రోజులను కలిగియున్నాడు, జన్మింపజేయుటకు ఆయన ఒక రోజును కలిగియున్నాడు, మరణింపజేయుటకు ఆయన ఒక రోజును కలిగియున్నాడు. ప్రేమించుటకు ఒక రోజును కలిగియున్నాడు, ద్వేషించుటకు ఒక రోజును కలిగియున్నాడు. ఈ విధంగా పట్టి కొనసాగుతూనే ఉంటుంది.
యేసు జక్కయ్య యింటికి ప్రవేశించగానే, అతని జీవితములో సంపూర్ణంగా పునరుద్ధరణను కలిగించాడు. ప్రభువు, 'ఇదిగో నేడే రక్షణ దినము' అని సెలవిచ్చుచున్నాడు. అందుకే బైబిల్‌లో మత్తయి 3:8వ వచనములో చూచినట్లయితే, జక్కయ్య జీవితము సంపూర్ణంగా మార్చబడినది. జక్కయ్య యొక్క మారుమనస్సు మరియు మారుమనస్సునకు తగిన ఫలములు ఫలించునట్లుగా చేసియున్నది. అతని జీవితము సంపూర్ణంగా రూపాంతరపరచబడియున్నది. అందుచేతనే, లూకా 19:8వ వచనములో చూచినట్లయితే, జక్కయ్య నిలువబడి, "ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసికొనిన యెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను.'' ఇది ఎంత గొప్ప రూపాంతరము కదా.
యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చియున్నది కేవలం నశించిన దానిని వెదకి రక్షించుట కొరకే. నా ప్రియులారా, ఈ రోజున రక్షణ మీ యింటికి వచ్చును గాక. ఇప్పుడు ఇదియే సరియైన సమయము, నేడే రక్షణ దినమై యున్నది. కనుకనే, ఈ రోజు దేవునితో ఒక ఒప్పందము చేసుకొనండి, నా ప్రియమైన స్నేహితులారా, ఆలస్యము చేయకండి. మీ యొక్క పాపముల కొరకు పశ్చాత్తాపము పొంది మారుమనస్సు పొందండి. ఈ రోజున మిమ్మును మీరు పూర్తిగా దేవుని స్వాధీనపరచుకోండి. 'నేను తర్వాత యేసును ఎంపిక చేసుకుంటాను,' అని చెప్పకండి. ఒకవేళ ఆ తదుపరి లేక మరల అను అవకాశము తిరిగి మీకు ఉండకపోవచ్చునేమో! కనుకనే, ఇదియే అంగీకారయోగ్యమైన అనుకూల సమయము. దేవుని యొక్క దయ మరియు కారుణ్యము మరి కొద్దికాలము మూతవేయబడుతుంది. యేసు అతిత్వరలోనే మరల రానై యున్నాడు. అతి త్వరలోనే కనికరపు ద్వారములు మూతవేబడబోవుచున్నవి. కాబట్టి, ఇప్పుడే, ఈ రోజు మనము క్రియాత్మకముగా చేయవలసియున్నది.
ఒకరోజు, నా యొక్క భర్తగారు ప్రార్థన విన్నపములన్నిటి కొరకు ప్రార్థన చేయుచున్నప్పుడు, ప్రపంచ వ్యాప్తముగా అన్ని ప్రాంతముల నుండి వారి యొద్దకు ప్రార్థనా విన్నపములు వస్తుంటాయి. ఆయనగారు ఎంతో భారముతో ప్రార్థన చేయుచుండేవారు. అటువంటి సమయములో ఒక వచనము, ఆయన కళ్ల ముందు మెరుపులా మెరవడము జరిగింది. ఆ వచనము, యోహాను 9:4వ వచనమును యేసు స్వయంగా ఆయనగారికి చెబుతున్నట్లుగా తనకు అన్పించడము జరిగినది. ఆ వచనము, "పగలున్నంత వరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు'' అని చెప్పబడినట్లుగానే, అవును, నా ప్రియ స్నేహితులారా, ఇది మీరు పనిచేయుటకు తగిన సమయమై యున్నది. ఇది మీరు దేవునికి సేవ చేయుటకు తగిన సమయమై యున్నది. ఇది మీరు పశ్చాత్తాపము పొందుటకు అనుకూల సమయముగా ఉన్నది. కనుకనే, ఆలస్యము చేయకండి, రక్షణ పొందనట్లయితే, వెనువెంటనే, యేసుక్రీస్తును మీ స్వంత రక్షకునిగా అంగీకరించండి. మీ యొక్క గతములో ఎటువంటి సంఘటనలను సంభవించినప్పటికిని సరే, వాటన్నిటిని మరచిపోండి. ఇప్పుడే రక్షించబడుటకు మీకు ఉన్న అవకాశమును ఏ మాత్రమును కూడా కోల్పోకండి. ప్రభువు ఈ రోజున మీ ప్రార్థన ఆలకించుటకు ఎంతగానో కృపాసహితుడుగా ఉన్నాడు. మీరు మీ హృదయమును దేవునికి సమర్పిస్తారా? ఇప్పుడే మోకరించి, దేవునికి ప్రార్థన చేయండి, మిమ్మును మీరు దేవునికి అప్పగించుకొనండి, మీరు క్రీస్తునందు దైవానుగ్రహమును మరియు దేవుని దయను పొందుకొనెదరు. నేడే మీకు రక్షణ దినము. మీరు మీ జీవితమును ఆ విధంగా సమర్పించుకొని, ఈ లాగున చెప్పండి, 'ప్రభువైన యేసయ్యా, నీవు మా హృదయములోనికి వచ్చినందుకు మరియు మాకు, మా కుటుంబ సభ్యులకు రక్షణను కలుగుజేసినందుకు నీకు వందనాలు,' ప్రతిదినము బైబిల్‌ను క్రమము తప్పకుండా చదవండి, దేవునికి ప్రార్థన చేయండి. ప్రభువు నిరంతము మీతో కూడా ఉంటాడు, దేవుడు నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసయ్యా, మమ్మును మేము నీకు సమర్పించుకొనుచున్నాము, నీవు మమ్మును అంగీకరించుము. దేవా, నీవు మా మీద కారుణ్యమును చూపించుము. దేవా, నీవు పక్షపాతికావు, కనుకనే, ఇప్పుడు మొఱ్ఱపెట్టుచున్న మమ్మును మరియు మా కుటుంబ సభ్యులను, ప్రియులను తాకి, రూపాంతరపరచుము. యేసయ్యా, మా పశ్చాత్తపమును నీవు అంగీకరించి, మా జీవితాలు మరి ఎక్కువగా ఫలించునట్లు చేయుము. ప్రభువా, ఈరోజు మేము నీ సన్నిధికి వచ్చుచున్నాము, నీ అంతులేని దయ మరియు ప్రేమకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, తగిన కాలంలో, నీవు మా ప్రార్థనలను వింటావనియు, నీవు వాగ్దానం చేసినట్లుగానే, ఈరోజు రక్షణ దినం మార్చుము. దేవా, మా ప్రతి భారాన్ని, ప్రతి పాపాన్ని, ప్రతి సందేహాన్ని నీ పాదాల వద్ద పెడుతున్నాము. యేసయ్యా, మమ్మును నీ రక్తము ద్వారా కడిగి శుభ్రపరచి, మా ఆత్మను పునరుద్ధరించు ము మరియు నీ అనుగ్రహం మా మీద కుమ్మరించుము. ప్రభువా, మా అద్భుతానికి ఇదే సమయం అని నేను నమ్ముచున్నాము. దేవా, నీవు మా ప్రార్థనలకు జవాబు ఇస్తావని మేము నమ్ముచున్నాము. యేసయ్యా, మేము ఇప్పుడు నిన్ను మా స్వంత రక్షకునిగా అంగీకరించుచున్నాము. దేవా, మా గతం నుండి దూరంగా వెళ్లి, నీవు మాకు అనుగ్రహించుచున్న నూతన జీవితాన్ని పొందుకొనునట్లుగా చేయుము. దేవా, ఈరోజు నీ రక్షణ మా ఇంటికి, మా కుటుంబానికి మరియు మా హృదయంలోనికి వచ్చునట్లుగా సహాయము చేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.