నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రేమగలిగిన రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున మీకు శుభములు. నేడు మీకందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. నేడు వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 3:16 ఒక అద్భుతమైన వాక్యమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వాక్యము, "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను'' ప్రకారం మనము నిత్యజీవమును పొందుకొనవలెననగా, ఆయన యందు విశ్వాసముంచవలెను. ఈ క్రిస్మస్ దినములో మీకు ఎటువంటి కొరత ఉన్నను సరే, మీరు ఆయన యందు విశ్వాసముంచండి. నిశ్చయముగా మీ కొరతలన్నియు తీర్చబడతాయి.
నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు డిసెంబరు 24వ తేదీ. కాబట్టి, మనమందరము రేపు క్రిస్మస్‌ను జరుపుకొనబోవుచున్నాము. మీలో అనేకమంది నూతన వస్త్రములను మరియు వస్తువులను పొందుకొని దీవించబడి ఉండవచ్చును. కానీ, కొందరికి ఆ అవకాశము లేదేమో? భయపడకండి. వస్త్రము మాత్రమే ప్రశస్తమైనది కాదు. యేసయ్యను మీ హృదయములో మరియు మీ గృహములో కలిగి ఉండడము, దేవుని యొక్క సమాధానమును కలిగి ఉండడము ఎంతో ప్రశస్తమైన విషయము. ఆ సమాధానము ఏదైనా భౌతిక సంపద కంటే చాలా గొప్పది. ఎందుకంటే, అది మనకు అన్నింటికన్నా గొప్ప బహుమతియైన ప్రభువైన యేసుక్రీస్తును గురించి గుర్తుచేస్తుంది. కనుకనే యేసు ప్రభువు ఈ లోకములో పుట్టడము ద్వారా ప్రభువు మనకు రక్షణను అనుగ్రహించియున్నాడు. అది ఉచితమైనది.
నా ప్రియులారా, సర్వశక్తిమంతుడైన దేవుడు మనందరికి రక్షణ కూడ అది ఉచితమైనది. కాబట్టి ఆయన ఈ లోకములోనికి రక్షకుడుగా దిగి వచ్చాడు. మనము అది కొనుక్కోవలసిన పని లేదు. కనుకనే, ఈ ఉచితమైన బహుమతిని పొందుకోవాలనగా, ప్రభువు యెదుట వాంఛతో అడిగి మొఱ్ఱపెట్టువారందరు పొందుకొని దీవించబడతారు. అదే చాలా ముఖ్యమైన విషయము. యేసయ్యను రక్షకుడుగా కలిగియుండడమే ప్రాముఖ్యమైన విషయము. మనము రేపటి దినమున క్రిస్మస్‌ను జరుపుకొనబోవుచున్నాము. అయితే, ఆయన మీ సొంత జీవితములలో జీవించాలి. అంతమాత్రమేకాదు, ఆయన మీ హృదయములలో జన్మించాలి. ఇంకను మీరు దేవుని బిడ్డలుగా మారాలి. అదియే ఎంతో ప్రాముఖ్యమైనది. నూతన వస్త్రములు, నూతన దీవెనలు, ప్రత్యేకమైన ఆహారము మాత్రమే కాదు, వస్త్రములు, వస్తువులను కొనుకొనలేకపోయినట్లయితే, చింతించనవసరము లేదు. కుటుంబముగా దేవుని సన్నిధిలో కూర్చుండి, రక్షణను ఇవ్వడానికి ప్రభువు ఈ లోకములోనికి వచ్చాడు గనుకనే, ఆయనను స్తుతించండి. దేవునిలో ఆనందించండి, ఆయనకు వందనాలు చెల్లించండి. అదియే ప్రాముఖ్యమైన విషయము. అది ఇప్పుడే చేయండి, అప్పుడు మీరు అద్భుతాన్ని చూస్తారు. ప్రభువు మీ పట్ల గొప్ప అద్భుతాలను జరిగిస్తాడు. శ్రేష్టమైన వస్త్రములనిస్తాడు, శ్రేష్టమైన ఆహారమును ఇస్తాడు. మీరు నమ్మకముతో ప్రభువు సన్నిధిలో వేచియుండండి. అది రేపు జరగనై యున్నది. వేచి ఉండి, చూడండి. హల్లెలూయా! ఎంతమంచి దేవుని మనము కలిగియున్నాము కదా!
నా ప్రియులారా, అందుకే బైబిల్ నుండి యెషయా 44:3వ వచనమును చూచినట్లయితే, "నేను దప్పిగలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టినవారిని నేనాశీర్వదించెదను'' ప్రకారము ప్రభువు యందు విశ్వాసముంచువారికి ఆయన తన ఆశీర్వాదములను కుమ్మరిస్తాడు. ఆయన యందు విశ్వాసముంచువారి మీద ఆయన తన ఆత్మను కుమ్మరిస్తాడు. కనుకనే, ప్రభువు సన్నిధిలో వేచి ఉండి, నేడే ఈ ఆశీర్వాదములను పొందుకొనండి. దేవుని శక్తిని, దేవుని మహిమార్థమైన మీరు ఫలించే విధముగా దేవుడు మిమ్మును దీవిస్తాడు. మీ జీవితము ఫలభరితమవుతుంది. అదియే ఎంతో ప్రాముఖ్యమైన విషయము. అటువంటి జీవితము కొరకు అడగండి. నూతన వస్త్రముల మరియు నూతన ఆహారము కొరకు అడగకండి. 'యేసయ్యా, మా హృదయములోనికి రమ్ము, మాతో కలిసి మా కుటుంబముతో జీవించుమని అడగండి.' ఇప్పుడే ప్రార్థించుదామా? హల్లెలూయా! ఎంత గొప్ప మంచి దేవుని మనము కలిగియున్నాము కదా! దేవుని సన్నిధితో మనము నింపబడ్డాము. నేడు మీలో ప్రతి ఒక్కరిని ఆయన దీవించుచున్నాడు. మీరు కుటుంబముగా ఆయన సన్నిధిలో మోకరించి, దేవుని మహిమపరచండి. మీకు అవసరమైన ప్రతి ఆశీర్వాదము అద్భుతమైన విధంగా నేడు మీకు అనుగ్రహింపబడుతుంది. అన్నిటికంటె ఎక్కువగా ప్రభువే మీతో కూడా ఉంటాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
అమూల్యమైన కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మా కొరతలన్నిటిని తీర్చి మాకు సమృద్ధిగా ఇస్తున్నందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, మమ్మును మరియు మా కుటుంబ సభ్యులను నేడు దీవించుము. మాలోను మరియు మాతో నివసించుము. ప్రభువా, నీ యొక్క ఆశీర్వాదములను మా మీద హెచ్చుగా కుమ్మరించుము. దేవా, నీ ఎడతెగని ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ వినయ హృదయంతో నీ ముందుకు వచ్చుచున్నాము. ప్రభువా, మమ్మును రక్షించడానికి మరియు మాకు నిత్యజీవమును అనుగ్రహించడానికి శాశ్వత జీవితాన్ని ఇవ్వడానికి నీ ఏకైక కుమారుడైన యేసును మా కొరకు ఈ లోకమునకు పంపించినందుకై నీకు వందనాలు. యేసయ్యా, ఈ రోజు నిన్ను మా హృదయంలోనికి మరియు మా గృహములోనికి ఆహ్వానించుచున్నాము. దేవా, నీ యొక్క శాంతి మరియు ఆనందంతో మమ్మును నింపుము. యేసయ్యా, ఈ లోకము ఇవ్వలేని శాంతిని మాకు నేడు అనుగ్రహించి మరియు నీ అమూల్యమైన రక్షణ వరమునకై నీకు కృతజ్ఞతతో ఈ క్రిస్మస్ జరుపుకోవడానికి మాకు సహాయం చేయుము. దేవా, నేడు భౌతిక వస్తువులన్నిటికంటే నీ యొక్క సన్నిధి ఎంతో విలువైనదిగా ఉంటుందని మాకు నేర్పించుము. ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మను నేడు మా మీద కుమ్మరించుము, నీ మహిమ కొరకు మా జీవితాన్ని ఫలవంతంగా చేయుము. దేవా, నీ యొక్క ప్రేమ ఇతరులకు సాక్ష్యంగా మా ద్వారా ప్రకాశింపజేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.