నా ప్రియమైన వారలారా, నేడు బైబిల్ నుండి ఒక చక్కటి వాగ్దానము వచనముగా కీర్తనలు 94:18వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు ఈలాగున తెలియజేయుచున్నాడు, "నా కాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది'' ప్రకారం మన కాలు జారెనని అనుకున్నప్పుడు, దేవుని కృప మనలను బలపరుస్తుంది. ఇది ఎంత చక్కటి వాగ్దానముగా ఉన్నది కదా! ఈ లోకములో ఏ దుష్టత్వమూ మరియు శ్రమలు మనలను అణిచివేయజాలవు, ఇక మమనము నిలబడలేము అన్న విధముగా మనలను నిరాశకు గురిచేయజాలవు. దావీదు తన జీవితములో ఎన్నో శ్రమలను అనుభవించాడు. అతడు తన శత్రువుల చేత తరుమబడ్డాడు. వారు అతనికి వ్యతిరేకంగా ప్రణాళికలు పన్ని అతనిని చంపివేయాలని అనుకున్నారు. ఆ సమయములో దావీదు కీర్తనలు 38:16వ వచనములో ప్రభువునకు ఈలాగున మొఱ్ఱపెట్టాడు, "యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను నా కాలు జారిన యెడల వారు నా మీద అతిశయపడుదురని నేననుకొనుచున్నాను. ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు నన్నుబట్టి వారు సంతోషించక పోదురుగాక'' ప్రకారం ' ప్రభువా, నన్ను ఎవ్వరు కూడా అణచివేయకూడదు' అని అంటున్నాడు. ఇది దావీదు యొక్క ప్రార్థనయై ఉంటున్నది.
నా ప్రియులారా, మన దేవుడు నమ్మదగినవాడై ఉన్నాడు. కనుకనే, మన ప్రభువు మనలను ఎన్నడును విడువడు ఎడబాయడు. అందుకే కీర్తనలు 18:35వ వచనములో మనము చదివినట్లయితే, "నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్పచేసెను '' అని చెప్పబడిన ప్రకారం ప్రభువు మనకు రక్షణ కేడెమును అందించియున్నాడు. ఆయన కుడి చేయి మనలను ఆదుకొనును, ఆయన స్వాతికము మనలను గొప్పచేయును. కనుకనే, ప్రభువు నీతిమంతులను కాపాడుతాడు. బైబిల్‌లో సామెతలు 24:16 వ వచనములో చూచినట్లయితే, "నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు'' ప్రకారం ప్రభువు తన ప్రేమను బట్టి, మనలను లేవనెత్తుతాడు. మన పేరును గొప్ప చేస్తాడు. ప్రమభువు అబ్రాహామును ఆ విధంగా ఆశీర్వదించాడని లేఖనము మనకు స్పష్టమగా తెలియజేయుచున్నది. ఆలాగుననే, "నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించ బడునని అబ్రాముతో చెప్పెను.'' ఆలాగుననే, ప్రభువు నీతిమంతులను అట్టివిధముగా అధికారమును, కాపుదలను, కదల్చబడలేని ప్రేమతో ఆశీర్వదించుచున్నాడు. అదేవిధముగా, ప్రభువు, మీ కొరకు మరియు నా కొరకు ఎంత గొప్ప ప్రేమను కలిగియున్నాడు కదా! యేసయ్య యొక్క ప్రేమ ఎంతో ప్రత్యేకమైనదిగా ఉన్నది. ప్రభువు ప్రేమ నుండి ఎవ్వరు కూడా విడదీయజాలరు. ఏ పాపము మనలను విడదీయలేదు. ఎటువంటి రోగము కూడా మనలను దేవుని ప్రేమ నుండి ఎడబాపలేదు. ఈ లోకములో ఉన్న ఎటువంటి శ్రమయైన, కష్టమైనను సరే, ఏదియు కూడా దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపజాలదు.
నా ప్రియులారా, నేడు మీరు మీ పాపముల వలన బాధపడుచున్నారేమో? అనేక రోజులు మీ పాపముల నుండి మీరు శ్రమను అనుభవించుచున్నారేమో? అయితే, మీ పాపములన్నిటి నుండి యేసు రక్తము మిమ్మును శుద్ధులనుగా చేస్తుంది. మీ అతిక్రమములను బట్టి యేసయ్య గాయపరచబడ్డాడు. మీ దోషముల నిమిత్తమై ఆయన నలుగగొట్టబడియున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థపరచబడ్డారు. నిత్యము ఆయన కుడి చేయి మిమ్మును ఆదుకొనును. ఆయన ఎన్నడు మీరు క్రిందపడడానికి అనుమతించడు. దేవుని కృపాకనికరములు మరియు ఆయన జాలి మిమ్మును పైకి లేవనెత్తుతుంది. కనుకనే, నేడు మీ జీవితములో మీరు క్రిందపడిపోయిన అనుభవము ద్వారా వెళ్లుచున్నట్లయితే, మిమ్మును మీరు ఆయనకు సమర్పించుకొనండి. నిశ్చయముగా, దేవుడు నేటి వాగ్దానము ద్వారా మీ కాలు జారినప్పుడు, ఆయన మిమ్మును పట్టుకొని, ఆదరించి, మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, మా పాదము జారినప్పుడల్లా, నీ కనికరము మమ్మును ఆదరించునట్లుగా చేయుము. దేవా, మేము పడిపోయిన గుంటలలో నుండి నీ కుడి హస్తముతో మమ్మును పట్టుకొని పైకి లేవనెత్తుము. దేవా, నీ ప్రేమపూర్వక కృపలో మమ్మును పట్టుకుని, నీ రక్షణ కేడెముతో మమ్మును ఆవరించుము. ప్రభువా, మా శత్రువులు మా మీదికి లేచి, కష్టాలు కలిగించినప్పుడు, నీవు మాకు బండగా మరియు మా రక్షకుడిగా ఉండుము. యేసయ్యా, నీ ప్రశస్తమైన రక్తము మా యొక్క ప్రతి పాపమును కడిగి వేయునట్లుగా చేయుము మరియు నీ పరిశుద్ధమైన రక్తము మా శరీరము మీద ప్రోక్షింపబడి, మా అనారోగ్యములను ముట్టి స్వస్థపరచుము. మమ్మును గట్టిగా పట్టుకొనుము, మా నిరాశ, ఓటమిలన్నిటి నుండి మమ్మును విడిపించుము. దేవా, మరణకరమైన వ్యాధుల నుండి మమ్మును స్వస్థపరచుము. ప్రభువా, నీ దీనత్వము ద్వారా మమ్మును మలుచుకొని, నీతిమంతులనుగా చేయుము. యేసయ్యా, మేము బలహీనులముగా ఉన్నప్పుడు నీ కుడి చేతితో పట్టుకొని, మమ్మును బలపరచుము. ప్రభువైన యేసూ, నీ విలువైన రక్తంతో మా పాపాలను కడిగివేయుము. దేవా, మమ్మును గురించి, మా శత్రువులు ఎన్నడును కూడా అతిశయించకుండునట్లుగాను మరియు నీవు మాతో ఉన్నట్లుగా అనుభూతి చెందునట్లుగా నీ కృపను మాకు దయచేయుము. దేవా, మా జీవితంలోని ప్రతి శారీరక, భావోద్వేగ లేదా ఆధ్యాత్మిక గాయాలను స్వస్థపరచుము. దేవా, నీవు మమ్మును ఎన్నటికిని విడిచిపెట్టవని మేము నమ్ముచూ, నీ ప్రేమపూర్వక హస్తాలలో మేము విశ్రాంతి తీసుకొనునట్లుగా చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.