నా ప్రియ స్నేహితులారా, నేడు దేవుడు మీకు జ్ఞానమును తెలివిని మరియు సర్వసంపదలు మీకిస్తానని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 దినవృత్తాంతములు 1:12 వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును, ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను'' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, పైన చెప్పబడిన లేఖనం ప్రకారము, నేడు లోకము ఈ ఐదు ఆశీర్వాదముల కొరకు ఎదురుచూచుచున్నది. అయితే, దేవుడు సమస్త జ్ఞానానికి మూలమని బైబిల్‌లో యాకోబు 1:17వ వచనము చెబుతుంది మరియు కొలొస్సయులు 2:3 వ వచనములో చూచినట్లయితే, లేఖనం ఇలా ప్రకటించుచున్నది, "బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి'' ప్రకారం నేడు ఈ లోకము ఎదురు చూస్తున్న సర్వసంపదలు దేవుని యందు మాత్రమే గుప్తములై యున్నవి. మనకు ఈ ఐదు ఆశీర్వాదములు కావాలని మనం ప్రభువును అడిగినప్పుడు, ఆయన తన జ్ఞానాన్ని మనకు ధారాళంగా ఇస్తాడని బైబిలు మనకు వాగ్దానము చేయుచున్నది. బుద్ధిజ్ఞానములతో నిండియున్న ప్రభువైన యేసును మనం అంగీకరించినప్పుడు, మన భూసంబంధమైన ప్రయాణానికి మరియు యేసును అత్యధికంగా గుర్తెరగడానికి దైవీకమైన జ్ఞానంతో మనం ఆశీర్వదింపబడెదము.
నా ప్రియులారా, ఈరోజు, దేవుని జ్ఞానం మీలో ఉందని ఆయనకు స్తుతులు చెల్లించండి. మీలో దేవుని జ్ఞానం నింపబడియున్నది కాబట్టి, దేవుడు మీ కొరకు నిర్ణయించబడిన మార్గాలలో నడవడానికి జ్ఞానం మిమ్మల్ని అనుమతిస్తుంది. ప్రపంచంలో మరియు మీ భవిష్యత్తులో తలెత్తుచున్న సమస్యలను పరిష్కరించడానికి జ్ఞానం మిమ్మల్ని సన్నద్ధపరుస్తుంది. జీవితంలో ఉన్నత స్థానమునకు రావాలని కోరుకునేవారు ఎంతో మంది ఉన్నారు. వారు అపారమైన జ్ఞానాన్ని కలిగి ఉంటారు. వారు ఇతరులకన్నా ప్రకాశవంతంగా వెలిగించబడతారు, ఇంకను ఎక్కువగా సంపాదిస్తారు, అందంలో ప్రత్యేకంగా నిలబడతారు మరియు వారి యొక్క తెలివిజ్ఞానము కారణంగా ప్రజలను తమ వైపు ఆకర్షించుకుంటారు. కానీ అకస్మాత్తుగా, వారికి జ్ఞానం లేకపోవడం వలన వారు పడిపోతారు. దుష్టుల దాడులను, ఈ లోక శ్రమలను లేదా ప్రాణనష్టాలను ఎలా జయించాలో వారికి తెలియదు. ఇంకను వారిలో అటువంటి జ్ఞానం ఉండదు.
అందుకే యేసు ఇలా అంటున్నాడు, 'నేను మీకు బుద్ధి జ్ఞానమును అనుగ్రహించెదను, మీరు జ్యోతుల వలె ప్రకాశిస్తారు. ఇంకను, మీరు కూడా బలముగాను మరియు నిరంతరము నిలిచి ఉండునట్లుగా చేయుదును' అని సెలవిచ్చుచున్నాడు. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, "బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.'' ఆలాగుననే, దేవుని చిత్తమును జరిగించువాడు బలముగా నిలిచి, నిత్యము జీవిస్తాడు. అప్పుడు సంపద, ఐశ్వర్యము, ఘనత వారిని వెంబడించును. దేవుడు నేడు మీకును అటువంటి కృపను అనుగ్రహించును గాక.
డార్విన్ తంగప్పన్ అను కారుణ్య విశ్వవిద్యాలయంలో చదివిన పూర్వపు విద్యార్థి యొక్క జీవముగల సాక్ష్యమును నేను మీతో పంచుకోవాలని ఆశించుచున్నాను. ఆయన నాగర్‌కోయిల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసి, కారుణ్యలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీని పొందుకున్నాడు. అక్కడ, అతను జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకున్నాడు మరియు ఉన్నత స్థానమునకు ఎదగాలని నిశ్చయించుకున్నాడు. అతను ప్రభువుకు విధేయత చూపి ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, దేవుడు అతనిని పైకి లేవనెత్తాడు. యేసు తన తల్లిదండ్రులకు విధేయత చూపి గొప్ప జ్ఞానాన్ని, స్థాయిని పొందినట్లుగానే, అతడు దేవుని చిత్తానికి విధేయత చూపి అన్నింటికంటే మించి ప్రకాశించినట్లుగానే, డార్విన్ కూడా ఆలాగుననే, అనుభూతి చెందాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత, ఉద్యోగ మార్కెట్ కఠినంగా ఉండేది, కానీ దేవుడు అతనికి మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు మరియు అతను తన వృత్తి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగాడు. తరువాత, దేవుని యొక్క జ్ఞానం మరియు బుద్ధియు అతనిని ఆసిర్ టెక్నాలజీస్ (ఎఎస్ఐఆర్) అనే కన్సల్టింగ్ సర్వీస్ అనే సొంత కంపెనీని ప్రారంభించేలా చేసింది. ఆయన పూర్తికాల వ్యాపారాన్ని ప్రారంభించారు, మరియు ఈ రోజు, అతను దాని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అమెరికాలోని కాలిఫోర్నియా నుండి భారతదేశంలో ఉన్న శాఖలతో పనిచేస్తున్నాడు. నా ప్రియ స్నేహితులారా, నేడు దేవుడు మిమ్మును కూడా ఉన్నత స్థానమునకు హెచ్చించాలని మీ పట్ల కోరుకుంటున్నాడు! కాబట్టి, నేడు మీరు దేవునియందు గుప్తములై ఉన్న బుద్ధిజ్ఞానము సర్వసంపదలు మీరు పొందుకోవాలంటే, ఆయనకు విధేయత చూపుతూ, మిమ్మును మీరు ఆయనకు సమర్పించుకున్నప్పుడు, నిశ్చయముగా, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, బుద్ధిజ్ఞానములు సర్వసంపదలు మరియు ఘనతను మాకిస్తానని చేసిన నీ యొక్క వాగ్దానానికి మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, నీవు మా యెదుట ఉంచిన మార్గంలో మేము నడవడానికి మా హృదయాన్ని నీ యొక్క దైవీకమైన జ్ఞానంతో నింపుము. దేవా, విశ్వాసం మరియు తెలివి జ్ఞానముతో జీవితములో ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి మాకు కావలసిన బుద్ధి జ్ఞానాన్ని దయచేయుము.ప్రభువా, జ్ఞానము సర్వసంపదలన్నియునీలో గుప్తములై ఉన్న గుర్తెరుగునట్లుగా చేయుము. దేవా, అన్నింటికంటే మించి నిన్ను పూర్ణ హృదయముతో వెదకడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా జీవితం నీ యొక్క జ్ఞానంతో ప్రకాశింపజేయుము, ఇతరులను నీ యొక్క ప్రేమ మరియు సత్యం వైపు ఆకర్షించునట్లుగా చేయుము. దేవా, మా చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి మరియు నీ చిత్తం ప్రకారం మేము అభివృద్ధి చెందడానికి మమ్మును నడిపించుము. ప్రభువా, చేయుచున్న ప్రతి పనిలో నీ నామానికి మహిమ తీసుకురావడానికి నీ కృప మమ్మును ఉన్నత స్థానమునకు లేవనెత్తునట్లుగా చేయుము. ప్రభువా, మేము నీ యొక్క మార్గాలలో నడిచే వారిని అనుసరించే నీ యొక్క సమృద్ధి ఆశీర్వాదాలను మాకు అనుగ్రహించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.