నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ రోజు బైబిల్ నుండి కీర్తనలు 107:20వ వచనమును నేటి వాగ్దానముగా మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను'' అన్న వచనం ప్రకారం దేవుడు తన వాక్కును పంపించి, మనలను బాగు చేయుచున్నాడు. కాబట్టి, ఆయన వాక్యములో ఎంతో గొప్ప శక్తి ఉన్నది కదా!
నా ప్రియులారా, దేవుని వాక్యమును మీరు ధ్యానించునప్పుడు, ఆయన యొద్ద నుండి అనేకమైన దీవెనలను పొందుకొనగలరు. ఆ దీవెనలేవనగా, స్వస్థత మరియు అనేకమైన ఇతర ఆశీర్వాదాలను మీరు పొందుకుంటారు. ఇంకను బైబిల్ నుండి యెషయా 66:2,5వ వచనములలో మనము చూచినట్లయితే, ప్రభువు ఇలాగున అంటున్నాడు, " అవన్నియు నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను మరియు యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన మాట వినుడి మిమ్మును ద్వేషించుచు నా నామమునుబట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమనొందును గాక అని చెప్పుదురు వారే సిగ్గునొందుదురు'' ప్రకారం, దేవుని వాక్యమునకు భయపడువారిని ఆయన ఆశీర్వాదిస్తాడు. నా ప్రియ స్నేహితులారా, మీలో ఎంతమంది దేవుని యెదుట వణికి, ఆయన వాక్యమును జాగ్రత్తగా చదువుచున్నారు? లేక ఏదో నామాకార్థముగా దేవుని వాక్యమును మీరు చదువుచున్నారా? ఏదో బైబిల్ గ్రంథమును ఆలాగున తెరచి, కొన్ని వచనాలు చదివి, వెళ్లిపోవడం అది సరియైన పద్ధతి కాదు. ఒక స్థలములో కూర్చుని, ఎంతో భక్తి శ్రద్ధలతో మీ బైబిల్ గ్రంథాన్ని తెరచి, ఎంత ఎక్కువగా చదవగలిగితే, అంత ఎక్కువగా చదవండి. దేవుని వాక్యము ఇలాగున అంటున్నది, 'ఆయన వాక్యమును మీరు ఆహారముగా భుజించాలి' అని సెలవిచ్చుచున్నది. ఏదో మీకు నచ్చినట్లుగా చదివినట్లయితే, కొన్ని నిమిషాలు సరిపోదు. దేవుని లేఖనము అంటున్నది, 'ఆయన వాక్యమునకు మనము వణుకుతూ ఉండాలి. '
నా ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ, ఆయన వాక్యమునందు వణకుతూ ఉన్నట్లయితే ఏమి జరుగుతుంది? "మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి స్తోత్రము '' (ఎఫెసీయులకు 3:20) ప్రకారంగా మీకు ఏది అవసరమో మీరు అడుగువాటన్నిటికంటెను తన శక్తి చొప్పున దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి, మీకు ఏది అవసరమో, కేవలము ఆయనను అడగండి. 'తండ్రీ, నీ వాక్యములో నీవు ఇలాగున చెప్పియున్నావు, కనుకనే, నన్ను ఆశీర్వదించుమని అడగండి.' రోమీయులకు 10:17లో, "కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును'' ప్రకారం మీరు దేవుని వాక్యమును వినినట్లయితే, మీ విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. ఇంకను, లూకా 10:42లో చూచినట్లయితే, మరియ అను స్త్రీని గురించి మనము అక్కడ చదవగలుగుతాము. మార్తా యొక్క సహోదరి, ఆమె యేసయ్యనే పట్టుకొని ఉండెను. యేసయ్య, పాదములనే ఆమె గట్టిగా పట్టుకొని ఉండెను. ఆయన మాటలన్నిటిని ఆలకించినది. అందును బట్టి ఆమె ఉత్తమమైన భాగమును యెంచుకొనెనని యేసయ్య సెలవిచ్చాడు. అదేవిధముగా, నా ప్రియులారా, నేడు మీరు కూడ మరియవలె అదేకార్యము చేయవలసి ఉన్నది. ఆలాగున చేసినట్లయితే, దేవుని గొప్ప ఆశీర్వాదాలను మీరు పొందుకుంటారు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మహిమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేడు నీవు మాకిచ్చిన గొప్ప వాగ్దానము బట్టి నీకు వందనాలు. దేవా, నీ యొక్క గొప్ప శక్తి చేత నీ వాక్యమును చదువుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, నీ అద్భుతమైన మరియు శక్తివంతమైన వాక్యాన్ని మా యొద్దకు పంపినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, నిన్ను బాగా తెలుసుకోవడం మరియు నీ వాక్యాన్ని నిరంతరం ధ్యానించడం మా గొప్ప కోరికయై యున్నది. అయినప్పటికి, అనేకసార్లు మా హృదయం నిజంగా పట్టింపు లేని విషయాల వైపు మళ్లుతుంది. ప్రభువా, మా హృదయాన్ని, కోరికలను, ఆలోచనలను మరియు భావోద్వేగాలను నీ మాటవైపు మొగ్గు చూపునట్లు మాకు నీ కృపను దయచేయుము. దేవా, దావీదు చెప్పినట్లుగా, పనికిమాలిన వాటి నుండి మా దృష్టిని మరల్చుము మరియు మమ్మును నీ నీతిగల మార్గంలో నడిపించుము. యేసయ్యా, నీ అమూల్యమైన వాక్యము ద్వారా మా మనస్సులను పునరుద్ధరించుము మరియు మాకు జీవము అనుగ్రహించుము. ప్రభువా, నీ వాక్యంలో దాగివున్న సంపదలను మేము చూడగలుగనట్లుగాను మరియు నీ మహిమతో నింపబడునట్లుగాను మా కళ్లను తెరువుము. దేవా, వ్యాధితో ఉన్న మమ్మును మరియు మా ప్రియులగువారి యొద్దకు నీ వాక్కును పంపి, నీ యొక్క స్వస్థతా శక్తితో మమ్మును ముట్టి బాగుచేయుము. ప్రభువా, నీవు మా ప్రార్థనకు జవాబిస్తావని నాకు తెలుసు. కనుకనే, నేడు మరియ వలె మేము కూడ ఉత్తమమైనదానిని గట్టిగా పట్టుకొని, మమ్మును నడిపించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.