నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మత్తయి సువార్త 5:13వ వచనమును ధ్యానించుకుందాము. ఆ వచనము, "మీరు లోకమునకు ఉప్పయి యున్నారు...'' అని యేసు చెప్పాడు. ప్రభువు ఈ లోకములో మీరు ఉప్పు వలె ఉండునట్లుగా ఎంపిక చేసుకున్నాడు. ఉప్పు ఆహారానికి మరియు భోజనానికి జీవాన్ని తీసుకొని వస్తుంది. కనుక మీరు ప్రజలకు జీవాన్ని తీసుకొని వచ్చి, యేసు యొక్క జీవదాతగా ఉన్న ఆ శక్తి ద్వారా వారు జీవించునట్లుగా చేయుచున్నారు. మన జీవితములో అన్నిటిని కోల్పోయిన స్థితి అంటు ఉండవచ్చును. కానీ, అటువంటి సమయములో జీవాన్ని అనుగ్రహించే శక్తి ద్వారా మనము ఉప్పు వలె మరొకరికి జీవాన్ని అనుగ్రహించినప్పుడు, దేవుడు మన జీవితములోనికి ఉప్పును (ఆశీర్వాదములను)తీసుకొని వస్తాడు.

ముంబై నుండి సహోదరులు రూబెన్ యొక్క ఈ అద్భుతమైన సాక్ష్యమును మీతో పంచుకోవాలని నేను మీ పట్ల కోరుచున్నాను. ఇతడు కోచింగ్ క్లాసులను నిర్వహించే వ్యాపారమును చేస్తుంటాడు. ఆ వ్యాపారములోనే తన ఆస్తులను మరియు ధనమునంతటిని వెచ్చించాడు. అయితే, కోవిడ్ సమయములో తన ధనమంతటిని మరియు ఆస్తులనంతటిని కోల్పోయారు. తద్వారా, తనకు ఒక పెద్ద బ్యాంకు లోన్ సిద్ధమైనది. అతడు బ్యాంకులో లోన్ తీసుకున్న అప్పును తీర్చుటకు ఎంతగానో బాధపడ్డాడు. అతని భార్య పని చేయుచుండెను. తద్వారా, ఆ అప్పును చెల్లించుచు వచ్చారు. ఆమె ఈ కుటుంబానికి సహాకారమును అందించుచున్నారు. అయితే, ఆమె కూడా ఉద్యోగమును కోల్పోయారు. కుటుంబము మరింత తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేయడం జరిగింది. మరల ఒక ఆవేదనను ఎదుర్కొన్నాడు, అతని సహోదరుడు వచ్చి, ఇతని ఆస్తిని తీసుకొని వెళ్లిపోయాడు. రూబెన్ సొంత తమ్ముడు మరల వచ్చి ఇంటిని అన్యాయంగా స్వాధీనం చేసుకున్నాడు.ఈలాగున ఒకదాని వెంబడి ఒక బాధను ఎదుర్కొన్నాడు.

అటువంటి సమయములో మేము ఢిల్లీలో నిర్వహించిన ప్రవచనాత్మకమైన సదస్సుకు రూబెన్ పాల్గొనడము జరిగినది. అక్కడ నేను రూబెన్ అని పేరు పెట్టి పిలిచియున్నాను. గతంలో అతని స్థితి ఏమిటో ముందుగా నాకు తెలియదు. కానీ, పరిశుద్ధాత్ముడు నాకు ఏమి బయలుపరచాడో, దానిని నేను మాట్లాడాను. 'రూబెన్ దేవుడు మిమ్మును ఆర్థికంగా ఆశీర్వదించుచున్నాడు. మీ ఋణము అంతయు కూడ తీర్చబడుతుంది. మీ ఆస్తి మీ యొద్దకు మరల తిరిగి వస్తుంది అని నేను చెప్పాను.' ఈ మాటలు విన్న రూబెన్ ఎంతగానో సంతోషముతో పొంగిపోయాడు. దానిని నమ్మాడు. తన భారములన్నియు కనుమరుగై పోయాయి. అతడు, డాక్టర్. పాల్ ద్వారా నీవు ఇచ్చిన వాగ్దానమును నేరెవేరుస్తావని నేను నమ్ముచున్నాను. మహా అద్భుతమైన రీతిలో, 3 నెలల వ్యవధిలో అతని సోదరుడు అతనిని పిలిచాడు. నేను నీ ఆస్తిని నీకు తిరిగి ఇస్తున్నాను అని చెప్పాడు. తద్వారా రూబెన్ తన ఋణములన్నిటిని చెల్లించగలిగాడు. దేవుడు అతనిని ఆర్థికంగా ఆశీర్వదించి భద్రపరచి ఉన్నాడు. ఈ రోజు అతడు ముంబైలో బాంద్రా ప్రార్థనా గోపురములో మేనేజర్‌గా పనిచేయుచు, తన యొక్క సేవలను కొనసాగించుచున్నాడు. దేవుడు అతనిని తన సేవా పరిచర్యలో కూడా బలంగా వాడుకొనుచున్నాడు.

ఇటీవల పూనె నుండి ఒక డాక్టర్ పేరు సచిన్, సహాయం కోరుతూ ప్రార్థనా గోపురమునకు వచ్చాడు. ప్రభుత్వ వైద్య కళాశాలలో అతడు ప్రొఫెసర్‌గా ఉన్నాడు. పదహారేళ్లుగా, అతను ప్రమోషన్‌ను కోల్పోయాడు మరియు తన సీనియర్ల నుండి నిరంతర వేధింపులను ఎదుర్కొన్నాడు. రూబెన్ అతని యొక్క ఆవేదనలను అర్థము చేసుకొని, యేసుకు ఎంతో భారముతో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్ధనకు జవాబుగా, మహా అద్భుతంగా దేవుడు డాక్టర్ సచిన్‌గారికి పదోన్నతిని అనుగ్రహించాడు. డాక్టర్. సచిన్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్‌ను ఎట్టకేలకు పొందుకున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక.

నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు ఈ లోకమునకు ఉప్పుయై యున్నారు. 'నా యొక్క ఉప్పు, లేక నేను కలిగియున్న సకల సంతోషమును అను ఉప్పును నేను కోల్పోయాను' అని మీరు అంటున్నప్పుడు, మీ యొక్క బ్రద్ధలైన హృదయానికి దేవుని యొక్క ఉప్పు వంటివారుగా మార్చబడుచున్నారు. దేవుడు మీ జీవితములో కూడ ఉప్పును మరల తీసుకొని వస్తాడు. కనుకనే, మనలను మనము దేవునికి సమర్పించుకుందామా? దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ఈ లోకమునకు ఉప్పుగా మమ్మును ఎన్నుకున్నందుకు నీకు వందనాలు. అన్ని కోణాల నుండి మమ్మును తరుముచున్న అనేక శోధనల కారణంగా నీవు మమ్మును కోరుకుంటున్న ఉప్పుగా ఉండటం చాలా కష్టమని మేము ఒప్పుకుంటున్నాము. కానీ నేడు, ఇతర విరిగిన జీవితాలకు నీవిచ్చే రుచిని జోడించే నీ ఉప్పుగా మారడం ద్వారా మా కొరకు నీవు కలిగి ఉన్న పిలుపుకు మేము సమర్పించుకొనుచున్నాము. దేవా, దయచేసి నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ పిలుపు కొరకు సిద్ధపరచుము, తద్వారా మేము హృదయంలో పవిత్రంగాను మరియు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, ఇతరుల నిన్ను రుచి చూడగలిగేలా మరియు నీవు ఉత్తముడవని రుచి చూడగలిగేలా నీ యొక్క రుచితో నిండిన ఉప్పులాంటి జీవితాన్ని నీవు మమ్మును మార్చగలవని నమ్ముచున్నాము. ఇంకను దేవా, మేము ఇతరుల కొరకు ఆదరణగా ఉండునట్లుగా, మేము నీకు పరిచర్య చేయుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, మేము ఇతరుల కొరకు ప్రార్థన చేయుచుండగా, మా ప్రార్థనకు జవాబును దయచేసి, వారి పట్ల అద్భుత కార్యములను జరిగించుము. దేవా, నీ గురించి, మరొకరితో మేము పంచుకొనుచుండగా, మరొకరికి నిరీక్షణ ఇస్తుండగా, దయచేసి, మా జీవితములో మేము కోల్పోయిన సంతోషాన్ని తిరిగి మాకు దయచేయుము. దేవా, మేము కోల్పోయిన సమస్తమును తిరిగి మేము పొందుకొనునట్లుగా మా జీవితాలను మార్చుము. ప్రభువా, మా ఉద్యోగము మాకు తిరిగి వచ్చునట్లు చేయుము. మేము ఇతరులకు ఇచ్చిన డబ్బును తిరిగి పొందుకొనుటకు మాకు నీ కృపను దయచేయుము. యేసయ్యా, మేము కోల్పోయిన సమస్తమును యేసు నామములో తిరిగి వచ్చునట్లు చేయుము. దేవా, యేసు నామమున ఈ రోజు, మమ్మును మరియు మా కుటుంబమును ఆశీర్వదించుము. ప్రభువా, నీ బిడ్డలైన మేము సంతోషముగా జీవించునట్లు చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.