నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయ కాలములో మిమ్మును కలుసుకోవడం నాకెంతో సంతోషముగా ఉన్నది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 118:7వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము ఈలాగు తెలియజేయుచున్నది, "యెహోవా నా పక్షము వహించి నాకు సహకారియై యున్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను.'' అవును, ప్రియ స్నేహితులారా, ప్రభువు మీ పక్షమున ఉన్నాడు, మీ ప్రతి పరిస్థితులలో ఆయన మీకు సహకారిగా ఉంటాడు. ఒకవేళ, మీరు 'నాకు ఎంతోమంది శత్రువులున్నారని అని అంటున్నారా? నా చుట్టు ఉన్నవారు నాకు వ్యతిరేకముగా కుట్ర చేస్తున్నారు అని అంటున్నారా? నేను పడిపోవాలని ప్రజలు నా పట్ల ఆశించుచున్నారు. నన్ను జైలులో పడవేయాలని చూస్తున్నారు, నేను నా ఉద్యోగమును విడిచి పెట్టాలని ఎదురు చూస్తున్నారు, నా జీవితములో ఓడిపోవాలని వారు నా పట్ల కోరుకుంటున్నారు, ఈ సంవత్సరము కూడా ముగిసిపోతుంది, కానీ, నా జీవితములో నాకు విజయము లేదు అని మీరు అంటున్నారా? ' కానీ, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు ఈ రోజు మీ పట్ల వాగ్దానము ఏమనగా, మిమ్మును ద్వేషించేవారి మీద మీరు విజయమును సాధిస్తారు. కనుకనే, ధైర్యముగా ఉండండి.

భక్తుడైన దావీదు జీవితములో కూడా అదే జరిగినది. అతడు పడిపోవాలని ఆశించే శత్రువులు ఎంతో మంది అతనికి విరోధముగా లేచారు. ఎన్నో సార్లు దావీదు ఒంటరితనమును అనుభవించాడు. అటువంటి పరిస్థితులలో కూడా, దావీదు ధైర్యముగా ఉన్నాడు. ఇంకను, 'ప్రభువు నా పక్షమున ఉన్నాడని' అందుకే అతడు ధైర్యముగా వ్రాశాడు. అదియుగాక, 'ఆయనే నా సహాయకుడు, నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను' అని విశ్వాసముతో వ్రాశాడు. అవును, అతని యొక్క అనుభవము కూడా ఆలాగుననే ఉండెను.

షద్రకు మేషాకు అబేద్నెగోల కథ మీకందరికి తెలిసినదే కదా! ఈ ముగ్గురు కూడా ఇటువంటి అనుభవమును కలిగియున్నారు. బైబిల్‌లో దానియేలు 3వ అధ్యాయములో మనము ఈ కధను చూడగలుగుతాము. రాజు యొక్క అధికారులు ఆ ముగ్గురు వ్యక్తులను మండుచున్న అగ్ని గుండములో వారిని పడవేయడానికై వారికి వ్యతిరేకముగా పన్నాగము పన్నారు. 'ప్రభువునకు మాత్రమే మేము మ్రొక్కుతాము' అని వారు నిశ్చయముగా ఉండగా, అగ్ని గుండములో పడవేయాలని రాజును ప్రేరేపించారు. ఆలాగుననే ఆ ముగ్గురును త్రాళ్లతో బంధించి, అగ్ని గుండములోనికి పడవేశారు. అయితే, అక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయమును జరిగింది. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి, తీవ్రముగా లేచి, తన మంత్రులను ఈలాగున అడిగాడు, 'మనము ముగ్గురు మనుష్యులనే కదా బంధించి అగ్ని గుండములో వేశాము?' అందుకు వారు, రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి. అయితే, రాజు ఈలాగున అన్నాడు, 'నలుగురు మనుష్యులు అగ్నిలో సంచరించుట నేను చూస్తున్నాను, బంధకములు లేక, వారికి ఏ హాని కలుగక, నాలుగవ వ్యక్తి యొక్క రూపము దేవతల రూపమును పోలియున్నది, నాల్గవ వ్యక్తి యొక్క ముఖము దేవ కుమారుని వలె ఉన్నది ' అని చెప్పెను. అంతట నెబుకద్నెజరు వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి 'షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని బిగ్గరగా పిలువగా, ' షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చినప్పుడు అందరు వారిని చూచి ఆశ్చర్యపడ్డారు. వారి శరీరములకు అగ్ని యే హాని చేయకుండుటయు, వారి తలవెండ్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనయైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. అప్పుడు రాజగు నెబుకద్నెజరు 'షద్రకు, మేషాకు, అబేద్నెగో 'యను వీరి దేవుడు పూజార్హుడు; ఆయన తన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను అని చెప్పెను. వారు ఆయనను ఆశ్రయించి, ఆయన యందు నమ్మిక ఉంచెను గనుకనే, దేవుడు మండుచున్న అగ్ని గుండములో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా!

అవును నా ప్రియ స్నేహితులారా, ఆలాగుననే నేడు మిమ్మును ద్వేషించువారి మీద ప్రభువు మీకు విజయమును అనుగ్రహిస్తాడు. ప్రభువే మీ పక్షమున ఉంటాడు. షద్రకును మేషాకును అబేద్నెగోల ప్రక్కన నిలిచి ఉన్నట్లుగానే, మీకు కూడా ఆయన సహయకారిగా ఉంటాడు. భయపడకండి. మీరు, 'నేను చనిపోవాలని కోరుకునే ప్రజలు ఉన్నారు అని అనుకుంటున్నారా? నేను పడిపోవాలని వారు కుట్రలు చేస్తున్నారు అని అంటున్నారా?' చింతించకండి. నాల్గవ వ్యక్తిగా ప్రభువు మీ పక్షమున నిలిచి ఉన్నాడు, మీ శత్రువులపై మీరు విజయమును సాధిస్తారు. ప్రభువే మీకు విజయమును అనుగ్రహిస్తాడు. భయపడవద్దు, నిరాశ చెందవద్దు. దేవుడు మీతో కూడా ఉన్నాడు. ఆలాగుననే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీ శత్రువుల పట్ల మీకు విజయమును అనుగ్రహించి మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
దయాకనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ రోజు మాకు సహాయము చేయుచూ, మా పక్షమున నిలిచి ఉన్నందుకై నీకు వందనాలు. దేవా, మా ప్రక్కనే, మా పక్షమున నిలిచి ఉన్నావయ్యా, అన్ని పరిస్థితులలో నీవు మాకు సహాయము చేస్తావని మేము నమ్ముచున్నాము. ప్రేమగల ప్రభువా, మా సహాయకునిగా మా పక్షాన నిలబడి ఉండుము. దేవా, మా శత్రువులు మమ్మును చుట్టుముట్టినప్పుడు, నీవు మాలో ధైర్యమును మరియు విశ్వాసమును నింపుము. ప్రభువా, మా పట్ల నీవిచ్చిన వాగ్దానము మా యొక్క ప్రతి సవాలును ఎదుర్కొనే శక్తిని ఇస్తుందని మేము నమ్ముచున్నాము. దేవా, మేము ఒంటరిగా ఉన్నామని అనిపించినప్పుడు కూడా, నీవు ఎల్లప్పుడూ మాకు సమీపంలో ఉన్నావని మేము గ్రహించగలిగే కృపను మాకు దయచేయుము. ప్రభువా, మా కష్టాలను దాటి నీవు సిద్ధపరచిన విజయాన్ని మేము చూడడానికి మాకు సహాయము చేయుము. యేసయ్యా, నీ సన్నిధి మాకు ఓదార్పు మరియు నిరీక్షణను కలిగించునట్లు చేయుము. ప్రభువా, నీవు మా జీవితంలోనికి తీసుకొని వచ్చు విజయం కొరకు మేముు నిన్ను స్తుతించుచున్నాము. దేవా, ఈ రోజు మేము ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నాము, మా శత్రువులు మమ్మును వేదించుచున్నారు,ఈ రోజు మాకు పరిపూర్ణమైన విడుదలను అనుగ్రహించుము, అన్నివైపుల మాకు విజయమును దయచేయుము, మా కోర్టు కేసులో, చదువులలో, వ్యాపారములోను మాకు విజయమును దయచేయుము, మా ఉద్యోగములో సాఫల్యతను దయచేయుము. ప్రభువా, నేడు మమ్మును పట్టి పీడించుచున్న వ్యాధుల నుండి మమ్మును విడిపించి, పరిపూర్ణమైన స్వస్థతను మాకు కలుగజేయుము. దేవా, మా శత్రువుల పట్ల మాకు విజయమును దయచేయుము. ప్రభువా, నీవు మాతో ఉన్నావని మా శత్రువులు చెప్పునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.