నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 32:8వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, ‘‘నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గ మును నీకు బోధించెదను నీ మీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను’’ ప్రకారం అవును, దేవుని బిడ్డలారా, ప్రతిదినము ప్రభువు సన్నిధిలో వేచి ఉండే అలవాటును మనము కలిగి ఉండాలి. మీకు ప్రభువు యొద్ద నుండి ఏమి కావాలన్నను సరే, మీరు ప్రభువు పాదల చెంత మోకరించి, మొఱ్ఱపెట్టండి, ‘‘ ప్రభువా, నీవు మాకు బోధించి, నేర్పించుము, ’’ అని చెప్పినప్పుడు, ఆయన అద్భుత రీతిగా మీకు బోధిస్తాడు. 

బైబిల్‌లో చూచినట్లయితే, యెషయా 30:21 వ వచనములో ఈ విధంగా వ్రాయబడియున్నది, ‘‘మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును’’  ప్రకారం అవును, ప్రియులారా, ప్రభువు పాద సన్నిధి లో వేచి ఉండడం ఎంతో అద్భుతమైన సమయం. కనుకనే నేడు మీరు మోకరించి ప్రభువు వైపు చూచినప్పుడు, ప్రభువు మీతో మాట్లాడానికి మరియు మిమ్మును చూడడానికి ఎంతో ఆనందముతో మీ యొద్దకు దిగివస్తాడు. ఇంకను కీర్తనలు 37:7వ వచనములో చూచినట్లయితే, ‘‘యెహోవా యెదు ట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్థిల్లువాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసనపడకుము’’ అని దావీదు వ్రాసియున్నాడు. అదే కీర్తనలు 37:5వ వచనములో చూచినట్లయితే, ‘‘నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును’’ ప్రకారం ఈ లోకములో ప్రతిదినము మనము అనేక శ్రమలను ఎదుర్కొంటూ, అనేక సమస్యలను చూస్తుంటాము. ఈ సమస్య నుండి మనము ఎలా బయటకు రావాలి మరియు ఈ శ్రమలను జయించడానికి ఏమి చేయాలి? అని మనము చింతిస్తూ ఉంటాము. లేదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కేవలం దేవుని సన్నిధానములో మోకరించి, మీరు చింతించకుండా, మీకు కావలసిన వాటన్నిటిని కూడా ప్రభువుతో పంచుకొని, ఆయనతో మాట్లాడాలి. అందుకే కీర్తనలు 62:5,6 వ వచనములలో దావీదు ఈలాగున అంటున్నాడు, ‘‘ నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము నా రక్షణాధారము నా ఎత్తయిన కోట ఆయనే, నేను కదలింపబడను’’ అని చెప్పబడిన ప్రకారము మీరు ఆయనను నమ్ముకొని మౌనముగా ఉన్నప్పుడు, నిశ్చయముగా, ఆయన మీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. 

కాబట్టి, నా ప్రియమైన స్నేహితులారా, మీరు దేనిని గురించి చింతించనవసరము లేదు. ఒకవేళ నేడు మీకున్న సమస్య మీకు ఎంతో పెద్దదిగా ఉండినను సరే, అది ప్రభువు దృష్టిలో ఎంతో చిన్నదిగా ఉంటుంది. కనుకనే, మీరు దేనిని గురించి చింతించకండి, కేవలం మీరు ప్రభువును వెదకండి, ఇప్పుడు కూడా ప్రభువును గట్టిగా పట్టుకొని, ఆయనను హత్తుకొని ఉండండి. అంతమాత్రమే కాదు, నేడు కూడా మనకు కావలసిన వాటన్నిటిని ప్రభువును అడిగి, ఆయనకు మొఱ్ఱపెడదామా? రండి ప్రార్థన చేద్దాము. దేవుని సన్నిధిలో మీరు మౌనముగా ఉండి, ఆయనకు మొఱ్ఱపెట్టినప్పుడు, దేవుడు మీ ప్రార్థనలకు జవాబిచ్చి, మీరు నడవవలసిన మార్గమును మీకు బోధించి, మిమ్మును నడిపిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మా ప్రశస్తమైన పరలోకమందున్న తండ్రీ, నీ వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మేము ఈ లోకములో సమస్యలు మరియు చింతల ద్వారా ఉన్నాము. కానీ, నీవు మాత్రమే మమ్మును అద్భుతమైన, రీతిలో నడిపించుగలిగిన దేవుడవు, మా యొక్క మొఱ్ఱలను ఆలకించుము, మా అవసరతలను తీర్చుము. దేవా, మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడవు, నీవు నేడు మా ప్రార్థనలకు జవాబును దయచేయుము. ప్రభువా, కృతజ్ఞతతో నిండిన హృదయంతో మేము నీ సన్నిధికి వచ్చుచున్నాము. దేవా, మేము వెళ్ళవలసిన మార్గంలో మమ్మును నడిపించి, మాకు బోధించే నీ వాగ్దానానికి వందనాలు. ప్రభువా, నీ జ్ఞానాన్ని మరియు మార్గమును కోరుతూ, నీ పాదాల వద్ద ఓపికగా వేచి ఉండటానికి మాకు నేర్పించుము. దేవా, శోధనలు మరియు శ్రమలు తలెత్తినప్పుడు, నిన్ను పూర్తిగా విశ్వసించడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా చెవులు నీ స్వరాన్ని శ్రద్ధగా వినడానికి మరియు మమ్మును సరైన మార్గంలో నడిపించునట్లుగా చేయుము. ప్రభువా, మేము భయం లేకుండా నీ సన్నిధిలో విశ్రాంతి తీసుకునేలా మా విశ్వాసాన్ని బలపరచుము. దేవా, నీవు సమస్తమును మా పట్ల నెరవేరుస్తావనియు గుర్తెరిగి, మా మార్గాలను నీ చేతులలోనికి మేము సమర్పించుకొనుచున్నాము. యేసయ్యా, మా కష్టాలు ఎంత పెద్దవిగా అనిపించినా, మేము వాటన్నింటిని నీకు అప్పగించి, మౌనముగా నీ సన్నిధిలో ఉండి, నీకు మొఱ్ఱపెట్టుటకును మరియు నీ నడిపింపును పొందుకొనుటకు మాకు నీ కృపను దయచేయుము. ప్రభువా, నీవు మాకు చాలిన దేవుడవుగా ఉన్నావని మేము తెలుసుకొని, నిన్ను హత్తుకొని జీవించునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.