నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ నూతన మాసములో అడుగుపెట్టిన మిమ్మును ఈ నూతన మాసమంతయు ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా ఉత్సాహంగా ఉన్నది. ఆయన వాగ్దానము తేనెవలె మధురమైనది. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 28:1వ వచనం ప్రకారం మనం దానిని హృదయపూర్వకంగా తీసుకొనబోవుచున్నాము. ఆ వచనము ఈలాగున చెప్పబడియున్నది, " నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనిన యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును'' అన్న వచనము ప్రకారం, ఇది ఎంత గొప్ప వాగ్దానం కదా! 'సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును' అంటే అది ఎంతో అత్యున్నతమైన స్థానం.
నా ప్రియులారా, ఎవరికి దేవుడు ఈ వాగ్దానమును అనుగ్రహించుచున్నాడు? మీరు మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు ఆయన మీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినప్పుడు, ఆయన అటువంటివారికి ఈ వాగ్దానమును అనుగ్రహించుచున్నాడు. ఆ వచనములో మొదటి భాగంలో ఈ రీతిగా మనము చూడగలము. దేవునితో అనుసంధానించబడిన హృదయం ఎల్లప్పుడు, దేవుని చూచి, " ప్రభువా, నేను సరైన పని చేస్తున్నానా? ప్రభువా, నేను నీకు ఆనందాన్ని కలిగించుచున్నానా? నేను నీ చిత్త ప్రకారమే దీనిని ఎన్నుకుని చేస్తున్నానా? నేను ఈ స్థలానికి వెళ్లాలని నీవు కోరుకుంటున్నావా? నేను నా కుటుంబ సభ్యులను ఈ విధంగా చూసుకోవాలని నీవు కోరుకుంటున్నావా?'' ఎప్పుడు దేవుని, 'నేను ఏమి చేయాలి?' అని అడుగుతూ ఉండాలి. దేవుడు అలాంటి వారిని మరింత ఎక్కువగా ప్రేమించుచున్నాడు.
నా ప్రియులారా, మనము మన తల్లిదండ్రులకు విధేయత చూపుతూ, వారిని అడుగుతూ, వారి చెప్పిన వాటన్నిటిని అనుసరిస్తూ ఉంటాము కదా? ఎందు కంటే, వారు మన కంటికి కనిపిస్తూ ఉంటారు. కనుకనే, వారిని అసంతృప్తికి గురిచేస్తామని మనము భయపడతాము. అయితే, కంటికి కనిపించని అదృశ్యుడైన దేవుని అనుసరించే వారిని, ఆయన మరింత ఎక్కువగా ప్రేమించుచున్నాడు. అందువలన, ఆఫీసు నిర్ణయాలు తీసుకునేటప్పుడు, నేను చాలా భయము కలిగి ఉంటాను. దేవుని నడిపింపు కొరకు వెదకుతాను. ప్రభువా, ఈ కూటాలు నీ చిత్తానుసారంగా నిర్వహించబడాలి? ఏ వ్యక్తి అక్కడ మాట్లాడడానికి వచ్చినప్పటికిని మేము అక్కడికి వెళ్లవచ్చునా? మరియు ఈ సిబ్బందికి సంబంధించి మా నిర్ణయాలు సరియైన నిర్ణయమేనా. ఇంకను అనేకమైన కారకాలు ఉన్నప్పటికిని, ప్రభువా, నీ చిత్తానికి అనుగుణంగా ఇవన్నియు జరుగుచున్నాయా? అత్యంత ప్రాముఖ్యమైనదేమనగా, దేవుడు దానిని బట్టి సంతోషించుచున్నాడా? అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. ఆయన ఆ కార్యాలలో సంతోషించినప్పుడు, అందులో ఆశీర్వాదము ఉంటుంది. ఆయన ఆశీర్వాదం కూడా ఆయన అంగీకారంతో వస్తుంది. కాబట్టి, దేవుని దిశ నిర్దేశం లేకుండా ఏమైనా చేయాలంటే, మనము భయపడాలి. ఆలాగున దేవునితో అమర్చబడియున్న హృదయాన్ని కలిగియుండుట చాలా ప్రాముఖ్యమైన అంశం అని నేను నమ్ముతున్నాను. కాబట్టి, ఏదైనా చర్య తీసుకునే ముందు మనం ఎల్లప్పుడూ దేవుని దిశా నిర్దేశాన్ని వెదకాలి.
అవును, నా ప్రియులారా, తన హృదయం ప్రభువుతో అనుసంధానించబడిన వారితో దేవుడు ఏమంటున్నాడంటే, " భూమిపై ఉన్న సమస్త జనముల కంటే ఉన్నతంగా హెచ్చిస్తాను'' అని చెప్పబడినది. దీనికి అర్థం భూమి మీద ఉన్న ప్రజలందరి కంటే గొప్ప ఘనతను పొందడం మరియు కేవలం ఏదో, రాష్ట్రపతి లేదా ప్రధాన మంత్రి వంటి ప్రతిష్టాత్మకమైన పదవిని పొందడం కాదు. అది కూడా పొందవచ్చును. కానీ, దానికంటె అత్యంత గొప్పది, దేవుడు మిమ్మును ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటె, ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు. ఈ భూమి మీద ప్రజలందరికంటె అధికమైన ఘనతను ఇస్తాడు. ఇంకను, ఆయన ప్రతి ఒక్కరిని కూడ మీలో ఉన్న దానిని బట్టి, మీ కోసం వెదకుచు వచ్చునట్లుగా చేస్తాడు. కనుకనే, ఈ అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు పొందుకుందాం. దేవుడు ఉన్నతముగా మిమ్మును పైకి లేవనెత్తుతాడు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేడు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా జీవితంలో ఈ ఆశీర్వాదాన్ని మేము కోరుచున్నాము. ప్రభువా, భూమి మీదనున్న సమస్త జనములకంటే మమ్మును ఘనతతో అలంకరించుము. దేవా, మా జీవితంలో ఈ ఆశీర్వాదాన్ని పొందేందుకు తగిన పాత్రగా మమ్మును తీర్చిదిద్దాలని మేము కోరుచున్నాము. ప్రభువా, దయచేసి నీతో కలిసి జీవించే హృదయాన్ని మాకు అనుగ్రహించుము. దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి, నీ దృష్టిలో సరైనది మాత్రమే చేయుటకును మరియు నీ శక్తివంతమైన హస్తంతో మేము వర్థిల్లునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. ప్రభువా, నీవు మమ్మును ఆశీర్వదించి మమ్మును హెచ్చించుము. దేవా, మేము ఎల్లప్పుడూ నీ బిడ్డను, నిన్ను ఒంటరిగా పాటించడానికి మరియు అనుసరించడానికి సిద్ధంగా ఉండునట్లుగా చేయుము. దేవా, మేము ఉన్నతంగా ఎదగడానికి మా జీవితాన్ని ఆశీర్వదించుమని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.