నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 6:63వ వచనమును మనము ధ్యానించుకొనబోవుచున్నాము. ఆ వచనములో "ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్ ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై యున్నవి'' అని లేఖనము తెలియజేయుచున్న ప్రకారం నేడు ఆత్మయే మిమ్మును జీవింపజేయుచున్నది. కనుకనే, మీరు భయపడకండి.
నా ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు, ఆయన తన శరీరమును భుజించి, తన రక్తమును పానము చేయుటను గురించి ఆయన మనకు బోధించిన సందర్భములోని మాటలివి. కొంతమంది శిష్యులు, ఆయన యొక్క ఉపదేశమును వారు అర్థము చేసుకోలేకపోయారు. ఇంకను బైబిల్ నుండి యోహాను 6:60వ వచనములో మనము చూచినట్లయితే, "ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడని చెప్పుకొనిరి.'' కానీ, పై వచనములో చూచినట్లయితే, శరీరము కేవలము నిష్ప్రయోజనము అనగా, మానవాళి పాపములో జన్మించియున్నారు గనుకనే, మనము ఎప్పటికిని నిత్యజీవమును సంతరించుకోలేము. కానీ, ఆత్మ మనలో జీవించుట చేత మాత్రమే మనము నిత్యజీవము అనుభవమును పొందగలము. తద్వారా మనము మరణము తర్వాత కూడా, దేవునితో జీవించగలవారముగా ఉన్నాము. రోమీయులకు 8:5,6లో మనము చూచినట్లయితే, "శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు; ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు; శరీరానుసారమైన మనస్సు మరణము; ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది'' అని చెప్పబడిన ప్రకారము శరీరము కేవలము నిష్ప్రయోజనము. కేవలం దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మాత్రమే ఈ లోకములో మనము రక్షింపబడగలము. అంతమాత్రమే కాదు, సమాధానకరముగా మనము జీవించగలము.
అందుచేతనే, బైబిల్ నుండి ఫిలిప్పీయులకు 3:3వ వచనములో మనము చూచినట్లయితే, "ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు, క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము'' ప్రకారం శరీరమును ఆస్పదము చేసుకొనవద్దని పౌలు మనలను బ్రతిమాలుచున్నాడు. ఇంకను దేవుని యొక్క వాక్యమును మరియు దేవుని యొక్క ఆత్మను అంటిపెట్టుకొని ఉండుట మాత్రమే ఈ లోకములో మనము జీవించులాగున మనలో కార్యము చేయగలదు. ఇందుకోసమైన యోహాను 6:68లో పేతురు ఏమని చెబుతున్నాడనగా, "సీమోను పేతురు ప్రభువా, యెవని యొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు'' అని అంటున్నాడు. అందుకే మత్తయి 4:4వ వచనములో చూచినట్లయితే, యేసు ప్రభువు ఈ సత్యాన్ని మరింత నొక్కి చెప్పాడు, "అందుకాయన మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతిమాట వలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను. '' అందుకే దేవుని వాక్యమునకు మనము విధేయులు కావాలి.
నా ప్రియులారా, ప్రభువైన యేసు ద్వారా పలుకబడిన మాట మనకు జీవము ఇచ్చుచున్నది. అందుకే, 2 పేతురు 1:4వ వచనములో మనం చదివినట్లయి తే, "ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకు అమూల్యము లును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. దురాశ ను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను.'' అవును, దేవుని వాక్యము ద్వారా మనము దేవుని వలె అగుదుము. అంతమాత్రమే కాదు, మనము ఈ లోక సంబంధమైన అక్రమమును తప్పించుకొనెదము. అవును, దేవుని యొక్క వాక్యము మనకు జీవమును అనుగ్రహించును. అంతమాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యము మనలను పరిశుద్ధంగా చేయును. దేవుని యొక్క వాక్యము మనలను ఈ లోకపరమైన ఇచ్ఛల నుండి తప్పించుకొనునట్లుగా చేయును. నా ప్రియులారా, ఆలాగుననే, ఈ రోజున కూడా దేవుని యొక్క వాక్యము మీకు జీవమును అనుగ్రహించును గాక. నా ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. దేవుడు ప్రతి దినమున మీతో తన వాక్యము ద్వారా మాటలాడును గాక. మీ జీవితములో మీరు జీవించడానికి ఆయన వాక్యము ద్వారా తగిన జ్ఞానమును, ఆంతర్యమునకు కావలసిన దృష్టిని అనుగ్రహించును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
జీవముగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, ప్రతిరోజు నీ యొక్క వాక్కును అంగీకరించునటువంటి ఎదురు చూపును కలిగించే ఆశను మాకు అనుగ్రహించుము. ప్రభువా, ప్రతిరోజు మేము నీ వాక్యమును ధ్యానించి, ఆ వాక్యమునకు మేము విధేయులగునట్లుగాను, తద్వారా నీ వాక్యము మాతో మాటలాడునట్లు చేయుము. దేవా, నీ యొక్క వాక్యము మాలో జీవమును మరియు సమాధానమును అనుగ్రహించునట్లు చేయుము. యేసయ్యా, నీ వాక్యపు శక్తి చేత మమ్మును బలపరచి, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మును నింపుము. దేవా, నీ ఆత్మ మాలో ఎల్లప్పుడు నివసించుచు, మాకు జీవమునిచ్చునట్లుగా చేయుము. యేసయ్యా, మేము నీ శరీరమును భుజించి, నీ రక్తమును పానము చేయునట్లుగాను మమ్మును మార్చుము. దేవా, నీవే మాకు మార్గమును, జీవమును మరియు సమస్తమును నీవే అని మేము గుర్తించునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మేము నీలో నివసించే పరిశుద్ధాత్మను వెదకుచున్నాము, తద్వారా మేము పాపానికి దూరంగా జీవించునట్లుగాను మరియు నీ శాశ్వతమైన ప్రేమను అనుభవించునట్లు చేయుము. యేసయ్యా, నీ వాక్యమును, సత్యమును అంటిపెట్టుకుని, మా మీద నమ్మకం ఉంచుకోకుండా నీ మీద మాత్రమే మేము ఆనుకొని జీవించునట్లు కృపనిమ్ము. దేవా, మేము నీ స్వభావమునందు పాలివారగునట్లు పొందగలిగేలా నీ జీవమునిచ్చే వాగ్దానాలు మమ్మును మార్చునట్లు చేయుము. ప్రభువా, మమ్మును నీ హృదయానికి సమీపముగా ఉండి, ఈ లోకములోని అవినీతి నుండి మమ్మును రక్షించి, నీ శాంతి, బలం మరియు జ్ఞానంతో మమ్మును నడిపించి మరియు ప్రతిరోజూ నీ సన్నిధితో మమ్మును నింపుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.