నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 116:2వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "ఆయన నాకు చెవి యొగ్గెను కావున నా జీవిత కాలమంతయు నేనాయనకు మొఱ్ఱపెట్టుదును'' ప్రకారము ప్రభువు మిమ్మును ఉన్నతముగా ఆశీర్వదించును గాక. ఇంకను మనము మన జీవితకాలమంతయు ఆయనకు మొఱ్ఱపెట్టాలని అద్భుతంగా ఈ వాక్యములో చెప్పబడియున్నది. ప్రభువు ఎల్లప్పుడు ఆలకించడానికై వేచియున్నాడు. అందుకే కీర్తనలు 116:1వ వచనములో దావీదు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, " యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించియున్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను'' ప్రకారం ఆయన దావీదు మొఱ్ఱను ఆలకించుచున్నాడు. గనుకనే, 'నేను ఆయనను ప్రేమించుచున్నాను' అని దావీదు చెబుతున్నాడు. నా ప్రియులారా, మనము ఆయనను ప్రేమించడాని కొరకు గల ఏకైక మార్గము ఇది కాదు, ఆయనను మనము ప్రేమించవలెననగా, అనేక కారణములను మనము కలిగియుండాలి. ఎందుకనగా, మనము ఆయనను ప్రేమించుటకు ముందుగానే, ప్రభువు మనలను ప్రేమించియున్నాడు. మనలను ఎంత ఎక్కువగా ప్రభువు ప్రేమించుచున్నాడంటే, తన జీవితాన్ని మన కొరకు అర్పించునంతగా ఆయన మనలను ప్రేమించుచున్నాడు. కనుకనే, దేవుని యెడల మనము కలిగియున్న ప్రేమ ఆయన యందు మనము కలిగియున్న ప్రతిస్పందన మాత్రమే. అందుకే కీర్తనకారుడు, 'నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొఱ్ఱపెట్టెదను, నేను ఎల్లవేళల ప్రభువును స్తుతించెదను' అని దావీదు అంటున్నాడు.

నా ప్రియులారా, అందుకే, కీర్తనకారుడైన దావీదు, ' ఆయన స్తుతి ఎల్లప్పుడు, నా నోట ఉన్నది, నా ప్రాణము ఉన్నంత వరకు నేను ప్రార్థిస్తాను' అని అంటున్నాడు. కనుకనే, అతను కీర్తనలు 34:1వ వచనములో ఇలాగున చెబుతున్నాడు, "నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును'' ప్రకారం ఆయన కీర్తి నిత్యము దావీదు నోట ఉన్నదని చెప్పబడియున్నది. ఇంకను కీర్తనలు 139:7వ వచనమును మనము చూచినట్లయితే, "నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును?'' ప్రకారం దావీదు అన్నివేళల ప్రభువును ప్రేమించాలని అనుకున్నాడు. బైబిల్‌లో కీర్తనలు 40:1,2వ వచనములను మనము చూచినట్లయితే, "యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవి యొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను'' అని దావీదు అంటున్నాడు. కనుకనే, ప్రభువు దావీదు ప్రార్థనలను ఆలకించాడు. ఆలాగుననే, నేడు ప్రభువు నిశ్శబ్దముగా మన ప్రార్థనలు ఆలకించుచున్నాడు. ప్రభువు ఎంతో ఆసక్తితో మన మొఱ్ఱలను ఆలకించుచున్నాడు. కాబట్టి స్నేహితులారా, ఆయనను విడిచిపెట్టకండి, ఆయనను స్తుతించండి, ఆయనను ప్రేమించండి, ఎల్లప్పుడు ప్రార్థన చేయుచు ఉండం డి, ఎప్పుడు కూడా ఆయనను విడువవద్దు. ఆయనను గట్టిగా పట్టుకున్నప్పుడు, నిశ్చయముగా, దేవుడు మీ ప్రార్థనను ఆలకించి, జవాబును అనుగ్రహిస్తాడు.

బైబిల్‌లో మార్కు 10:46-49వ వచనములలో మనము చూచినట్లయితే, ఆయన తన శిష్యులతోను బహు జన సమూహముతోను యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయి యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను. 'ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసూ, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేయుచూ, ఆయనకు మొఱ్ఱపెట్టెను. ఇంకను అతడు విడువకుండా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని గట్టిగా కేకలు వేశాడు.' అవును, నా ప్రియులారా, మన ప్రభువునకు ఆలాగుననే మొఱ్ఱపెట్టినట్లయితే, ఆయన మొఱ్ఱకు చెవి యొగ్గి, ఆలకిస్తాడు. ఈ గ్రుడ్డి బిక్షకుడు యేసయ్యకు మొఱ్ఱపెట్టాడు. 'అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా' వారా గ్రుడ్డివానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచు చున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అప్పుడు, యేసయ్య, అతని గుడ్డితనము నుండి అతనిని స్వస్థపరచాడు. ఆ గ్రుడ్డి బిక్షకుడు ఆయనను పిలిచినప్పుడు, ప్రభువైన యేసు అతనిని దాటి వెళ్లిపోలేదు. ప్రభువు అక్కడే నిలిచి, అతని మొఱ్ఱలను ఆలకించి, అతనికి జవాబు ఇచ్చి, అతనిని స్వస్థపరచాడు. నేడు ప్రభువు మీ మొఱ్ఱలను కూడా ఆలకించి మీకు జవాబును అనుగ్రహిస్తాడు. నేడు మీరు ఎదుర్కొంటున్న ఎటువంటి సమస్యలైనను సరే వాటిని పరిష్కరించి, మీ పట్ల గొప్ప కార్యాలను జరిగిస్తాడు.

నా ప్రియులారా, కొన్నిసారులు మీరు రహస్య స్థలములోనికి వెళ్లి లేక మీరు స్నానము చేయుచున్న గదిలోనికి వెళ్లి, నీటి కొళాయిని తెరచి, అక్కడకు వెళ్లి ఎవరికి తెలియకుండా, బిగ్గరగా ఏడుస్తూ దేవునికి మొఱ్ఱపెట్టుచున్నారేమో? నేడు ప్రభువు మీ యొక్క ప్రతి ఒక్క కన్నీటి బొట్టును లెక్కించుచున్నాడు. ఆయన మీ మొఱ్ఱలను ఆలకించుచున్నాడు. స్నేహితులారా, ఎవ్వరు మమ్మును పట్టించుకోలేదు, మా మొఱ్ఱలను ఆలకించడము లేదు అని ఒకవేళ మీరు బాధపడుతూ అంటున్నారేమో? కానీ, ప్రభువు మీ యొక్క మొఱ్ఱలకు చెవి యొగ్గి, ఆలకించుచున్నాడు. నా ప్రియులారా, ఈ రోజు దేవుని యొద్ద నుండి మీ ప్రార్థనలకు జవాబు నిశ్చయముగా వస్తుంది. ఆ గ్రుడ్డి బిక్షకుని యొక్క మొఱ్ఱను ప్రభువు ఆలకించినట్లుగానే, నేడు మీ మొఱ్ఱను కూడా ప్రభువు ఆలకించి, నేటి వాగ్దానము ద్వారా మిమ్మును బలపరచి, దీవిస్తాడు.

ప్రార్థన:
ప్రార్థనలను ఆలకించు మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, మేము ఇప్పుడు నీ వైపు చూస్తున్నాము, మా మొఱ్ఱలకు జవాబును దయచేయుము. ప్రభువా, మా ప్రార్థనలకు జవాబునిచ్చే దేవుడవు నీవే మరియు సజీవుడవైన దేవుడవు నీవే, ఇప్పుడు మా సమస్యలన్నిటి మధ్యలో కూడా నీవు మాతో కూడా ఉన్నందుకై నీకు వందనాలు. దేవా, మా హృదయములో నీవు ఎంతో ప్రేమతో నివసించుచున్నందుకై మరియు నీవు మా మొఱ్ఱలను ఆలకిస్తున్నందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, మా ఏడుపులను వినడానికి మా పక్షమున నిలబడి ఉన్నందుకై నీకు ధన్యవాదాలు. దేవా, మేము ఒంటరిగా ఉన్నప్పుడు కూడా, నీవు మాకు సమీపముగా ఉంటావని యు, మా ప్రార్థనలను వింటున్నావనియు, అత్యంత ప్రేమతో నిన్ను ప్రేమిం చుటకు మాకు సహాయము చేయుము. దేవా, దావీదు వలె, మాలో శ్వాస ఉన్నంత వరకు మేము మొఱ్ఱపెట్టుచున్నాము. ప్రభువా, నీవు రహస్యంగా మొఱ్ఱలను ఆలకించుచున్నావనియు మరియు నీవు మా ప్రతి కన్నీటి బొట్టును నీ బుడ్డిలో ఉంచుతావనియు మేము నమ్ముచున్నాము. ప్రభువైన యేసు, నీవు గ్రుడ్డి బిక్షకుని కొరకు నిలిచావు మరియు మా జీవితంలో ఒక అద్భుతం చేయడానికి నీవు ఈ రోజు మా ఏడుపులను వినుటకు నిలబడ్డావని మేము గుర్తించునట్లుగా మాకు అటువంటి ధన్యతను దయచేయుము. ప్రభువా, నీవు మమ్మును జిగట గల ఊభి నుండి మమ్మును పైకి లేవనెత్తి, మా పాదాలను స్థిరమైన పునాదియైన బండ మీద నిలుపుతావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, నీ దయ మమ్మును చుట్టుముట్టి మాకు మరల నిరీక్షణను కలిగించుము. దేవా, నీవు మా తల ఎత్తువాడవు మరియు మేము నిన్ను ఎల్లప్పుడు ప్రేమించునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. యేసయ్యా, నీవు మమ్మును ప్రేమించినట్లుగానే, మేము కూడ నిన్ను ప్రేమించుటకు అటువంటి మంచి హృదయమును మాకు దయచేయుమని యేసుక్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.