నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి రూతు గ్రంథము 2:12వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, ‘‘యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకుత్తరమిచ్చెను’’ ప్రకారం ఆయన రెక్కల క్రింద మనము సురక్షితముగా ఉండునట్లుగా ఆయన మనకు సహాయము చేస్తాడు. 

బైబిల్‌లో రూతు జీవితమును చూచినట్లయితే, రూతు మోయాబీయురాలుగా ఉన్నది. ఆమె మోయాబు దేవుళ్లను ఆరాధించేది. అయితే, ఆమె ఇశ్రాయేలీయుల కుటుంబమునకు వివాహము చేయబడినది. తన అత్తగారి పేరు నయోమి. ఆమె ఒక దైవజనురాలు. నయోమి ఎంతో జాగ్రత్తగా, దేవుని యొక్క మార్గములను వెంబడించేది. తన కోడళ్లను ఎంతగానో ప్రేమించేది. కాబట్టి, నయోమి యొక్క ప్రేమకు ఆకర్షితురాలైనది. తద్వారా, తను కూడా ఇశ్రాయేలీయుల దేవుని వెంబడించడం ప్రారంభించినది. వారు ఎంతో పేదవారై ఉండిరి. కానీ, రూతు ఇశ్రాయేలీయుల దేవుని ఆరాధించడం మరియు వెంబడించడము మొదలు పెట్టినది కనుకనే, ప్రభువు వారితో కూడా ఉండెను. కనుకనే, బైబిల్‌లో రూతు 2:12వ వచనమును మనము చదివినట్లయితే, ‘‘ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి’’ అని చెప్పబడిన ప్రకారం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లుగా ఆమె వచ్చినది. కానీ, ఆమె ఎంతో పేదరాలైనప్పటికిని, వారికి తినడానికి కూడా ఆహారము లేదు. అయితే, అటువంటి పరిస్థితిలో అత్తయైన నయోమితో కూడా రూతు ఎంతో శ్రద్ధతో కూడా దేవుని వెదకినందున, ప్రభువు వారి యందు ఇష్టము కలిగియుండెను. ఇశ్రాయేలీయుల రెక్కల నీడలోనికి ఆమె వచ్చెను. కనుకనే, ఆమె బహుగా దీవించబడినది. 

నా ప్రియ స్నేహితులారా, మరి మీ గురించి ఏమిటి? ఇశ్రాయేలీయుల దేవుని మీరు అంగీకరించియున్నారా? ఆయన మీ రక్షకుడుగా ఉన్నాడా? రూతు ఆమె ఒక మోయాబీయురాలైనప్పటికిని, ప్రభువును తన పూర్ణ హృదయముతో ఎంతో జాగ్రత్తగా వెదకినందున, ఆమె యొక్క విశ్వాసమును బట్టి, రూతు 2:12వ వచనము ప్రకారము ఆమె సమృద్ధియైన దీవెనలతో అత్యధికంగా ఆశీర్వదింపబడినది. ఒక గొప్ప ధనికుని భార్యగా ఆమె ఉండెను. ప్రభువు ఆమెను ఎంతగానో దీవించాడు. ఈ రోజు మీరు ఏమి లేకుండా, మీరు బాధపడుచున్నారేమో? నా జీవితములో ఏమి లేదు మరియు దీవెనలు లేవని చింతించుచున్నారా? ఇశ్రాయేలీయుల రెక్కల నీడలోనికి రండి అని ప్రభువు మిమ్మును ప్రేమతో తన యొద్దకు పిలుచుచున్నాడు.  ప్రభువు అంటున్నాడు, ‘‘నా చెంతకు రండి, నేను మిమ్మును దీవిస్తాను’’ అని సెలవిచ్చుచున్నాడు. రూతును ఆశీర్వదించిన విధముగానే ఆయన మిమ్మును కూడా దీవిస్తాడు. ఆయన, మీ యొక్క ఏమి లేని స్థితిలో నుండి అన్నియు కలిగియుండు స్థితిలోనికి మిమ్మును మారుస్తాడు.  

నా ప్రియులారా, బైబిల్‌లో సామెతలు 10:22వ వచనమును మనము చదివినట్లయితే, ‘‘యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు’’ అని తెలియజేయబడియున్నది. ప్రియులారా, ఇశ్రాయేలీయుల దేవుని మీరు రూతువలె మీ హృదయములోనికి అంగీకరించియున్నారా? ఆయన మీ కొరకు సిలువలో తన ప్రాణమును అర్పించియున్నాడు. కనుకనే, మీరు సిలువ చెంతకు రండి, మీరు ఆయనను మీ రక్షకునిగా అంగీకరించండి. నూతన హృదయాన్ని మరియు నూతన జీవితాన్ని ఆయన మీకు అనుగ్రహిస్తాడు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.  

ప్రార్థన: 
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా హృదయాలను చూడుము, మేము నిన్ను అంగీకరించునట్లుగా మా హృదయాలను మరియు మా జీవితాలను మార్చుము. ప్రభువా, రూతు జీవితమును మార్చినట్లుగానే, మా జీవితాలను కూడా మార్చుము. దేవా, మేము నీకు సమీపముగా వచ్చునట్లుగా నీ కృపను మాకు దయచేయుము. ప్రభువా, రూతు అత్యధికంగా దీవించినట్లుగానే, నేడు మమ్మును కూడా దీవించుము. దేవా, మేము కృతజ్ఞతతో నిండిన హృదయంతో  నీ సన్నిధికి వచ్చుచున్నాము. ప్రభువా, మమ్మును నీ ఆశ్రయం మరియు ప్రేమ రెక్కల క్రిందకు పిలిచినందుకై నీకు వందనాలు. ప్రభువా, మా జీవితాలు శూన్యముగా అనిపించినప్పుడు, నీవే మా పోషకుడివని మాకు గుర్తు చేసి, మా జీవితాలను మార్చుము. దేవా, రూతు చేసినట్లుగానే, మేము నిన్ను శ్రద్ధగా వెదకడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా చింతలను మరియు భారాలను నీ బలమైన చేతులలోనికి మేము  అప్పగించుచున్నాము. దేవా, మా జీవితంలో నీ ఆశీర్వాదాలు పొంగిపొర్లునట్లుగా చేయుము, అవి మా జీవితాలలో ఆనందం మరియు సమృద్ధిని తీసుకొని వచ్చునట్లుగా కృపను దయచేయుము. ప్రభువా, నీ సిలువ, నీ ప్రేమ మరియు నీ అంతులేని కృపకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. యేసయ్యా, మా ప్రభువుగాను మరియు రక్షకునిగాను మేము నిన్ను అంగీకరించుచున్నాము, నీవు మాకు నూతన జీవితాన్ని అనుగ్రహిస్తావని మేము సంపూర్ణంగా నమ్ముచున్నాము. దేవా, నీ యొక్క ఆశీర్వాదము మాకు ఐశ్వర్యమిచ్చునట్లుగాను,  నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాకుండా చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.