నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 యోహాను 5:4వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. "దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే'' ప్రకారము ఈ రోజు మనం ఇందులో కనిపించే శక్తివంతమైన సత్యాన్ని ప్రతిబింబిస్తున్నాము. అదేవిధముగా, మీరు ఈ లోకమును జయించుటకు ప్రభువు మీకు సహాయము చేస్తాడు. ఆయన మీలో నివసిస్తుండగా, లోకములో ఉన్నవాటన్నిటిని మీరు జయించగలుగుతారు.

అవును, నా ప్రియ స్నేహితులారా, ఈ లోకములో అనేకమైన శోధనలతో మీరు వ్యవహిరించవలసి వస్తుండవచ్చును. ఇంకను మీ జీవితములో ఉన్న సమస్యల వలన, ఒత్తిడి వలన, చెడు వ్యసనముల వలన, అందరికి తల ఒగ్గుచున్న పరిస్థితులను మీరు ఎదుర్కొనుచుండవచ్చును. ఎవరి నుండియైనను, మీరు లంచము తీసుకొని వుండవచ్చును. పనిలో నమ్మకము లేకపోవడము, ఉద్యోగములో ముందుకు వెళ్లడానికొరకు, లోకములో కాస్త నెమ్మది, మనశ్శాంతిని పొందుకోవడానికి పాపపు శోధనలలో పడిపోతున్నారా? జీవితములో ఒత్తిడిని తొలగించడానికై పాపానికి లొంగిపోతున్నారా? చుట్టు ఉన్న ప్రజల మెప్పు కొరకు, మీరు పాపము చేయాలనుకుంటున్నారా? నన్ను ఎవ్వరు చూడడము లేదు, ఈ చిన్న కార్యాలు చేయడం ఎవరు గమనిస్తారు కదా! అని అంటున్నారా? నేను ఎవరిని బాధపెట్టడము లేదు కదా! ఇవి చేస్తే తప్పు ఏముంది అని అనుకుంటున్నారా?

నా ప్రియులారా, యోబు గ్రంథములో చూచినట్లయితే, యోబు ఎంతో విజయవంతమైన జీవితమును జీవించి, గొప్పవాడుగా ఉన్నాడు. కానీ, సమస్తమును కోల్పోయిన ఒక పరిస్థితిని అతడు ఎదుర్కొన్నాడు. విజయము, ఆరోగ్యము, కుటుంబము మరియు అతనికి కలిగియున్నవన్నియు, ఇకను అతడు సమస్తమును కోల్పోయాడు. అటువంటి పరిస్థితిలో యోబు భార్య ఒక మాట పలకడాన్ని మనము యోబు 2:9వ వచనములో చూడగలము. "అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలక యుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను.'' తన భార్య మాటల విని అతడు ఆలాగున చేయడము అతనికి ఎంతో సులభతరమై ఉండవచ్చును. ఎందుకంటే, అతడు అటువంటి గొప్ప వేదనలలో ఉన్నాడు. కానీ, నా ప్రియ స్నేహితులారా, అతడు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండెను. ప్రభువు అతనికి న్యాయము జరిగిస్తాడు అని అతనికి తెలుసు. అదేవిధముగా, యోబు 42:10వ వచనములో చదివినట్లయితే, "మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను'' ప్రకారం, అతడు కోల్పోయిన వాటన్నిటికంటె రెండంతలుగా ప్రభువు అతనికి అనుగ్రహించుట మనము చూడగలము. యోబు తాను ముందు కలిగియున్నవాటన్నిటికంటెను, రెండంతలుగా ప్రభువు అతనికి మరల దయచేశాడు.

అవును, ప్రియ స్నేహితులారా, బైబిల్‌లో యోహాను 16:33వ వచనములో ఈలాగున చెబుతున్నాడు, "నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను'' ప్రకారము అవును, నా ప్రియులారా, నేడు మీరు జీవితములో శ్రమలు ఎదుర్కొనవచ్చును. శోధనలు మన మార్గములో ఎదురవుచుండవచ్చును. అవి చూడడానికి ఎంతో మధురంగా ఉండవచ్చును. ఎవరు చూడడము లేదు కదా, వారు ఎలా తెలుసుకుంటారు? అని అనుకోవచ్చును. కానీ, నా ప్రియ స్నేహితులారా, మనము నీతిగా జీవించాలనియు మరియు యథార్థతతో జీవించాలనియు, ప్రభువు కోరుకుంటున్నాడు. యోబుకు దేవుడు రెండంతలుగా ఇచ్చిన రీతిగానే, యోబుకు ఆయన చేసినట్లుగానే, అందుకు ప్రతిఫలమును ఆయన మీకును అనుగ్రహిస్తాడు. కనుకనే, ధైర్యము నొందండి. ఎందుకంటే, ఈ లోకమును జయించిన దేవుడు మీలో ఉన్నాడు. కాబట్టి, నేడు మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలను మరియు శోధనలను మీరు కూడా వీటన్నిటిని జయించగలుగుతారు. మరియు మీరు వీటన్నిటిలోను విజయాన్ని కలిగి ఉంటారు. ఇంకను విజయవంతమైన, దీవెనకరమైన జీవితమును కలిగి ఉంటారు. నేడు ఈ జయశాలి మనలో కలిగియుండి, నివసించునట్లుగా అడుగుదామా? అప్పుడు ఆయన మీరు ఈ లోకమును జయింపజేస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
జయశీలుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, నీవు మాలో నివసించాలని అనుకుంటున్నందుకై నీకు వందనాలు. దేవా, ఈ శోధనలన్నిటిని మరియు ఈ లోకాశలన్నిటిని, ఇంకను ఈ పాపములన్నిటిని జయించగలిగే శక్తిని మాకు దయచేయుము. యేసయ్యా, నీవు మాలో నివసించుటకు మేము నిన్ను మాలోనికి ఆహ్వానించుచున్నాము. దేవా, మా మార్గములో ఎదురగుచున్న వాటన్నిటిని జయించ కలిగే కృపను మాకు దయచేయుము. ప్రభువా, నీతిగా జీవించే కృపను మాకు దయచేయుము. దేవా, యోబుకు నీవు ఇచ్చిన ప్రతిఫలమును మేము కూడ పొందుకొనునట్లు చేయుము. ప్రభువా, దేశములో మేము దీవించబడి, ఘనతనొందునట్లుగా మమ్మును మార్చుము మరియు నీవు వచ్చి, మాలో మరియు మాతో కూడా నివసించుము. దేవా, ఈ లోకమును జయించే కృపను మాకు దయచేయుమని యేసుక్రీస్తు విజయవంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.