నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 40:17వ ప్రకారం ప్రభువు మిమ్మును తలంచుకొని, మిమ్మును ఆశీర్వదించును గాక. ఈ వచనములో ఏమని తెలియజేయుచున్నదనగా, " నేను శ్రమలపాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే...'' అని చెప్పబడినట్లుగానే, మీరు శ్రమలపాలై దీనత్వములో ఉన్నప్పుడు, దేవుడు మిమ్మును తలంచుకొనుచున్నాడని నిత్యము జ్ఞాపకములో ఉంచుకొనండి.

నా ప్రియ స్నేహితులారా, మనము అనేక సందర్భాలలో మనము కూడ, "మేము ఎంతో పేదవారము మరియు అవసరతలలో ఉన్నవారమని'' భావిస్తుంటాము. కానీ, పేదవారము మరియు అక్కర్లలలో ఉన్నవారమని అనగా, దేవుని అవసరం మరియు దైవాశీర్వాద అక్కర్లలో ఉన్నవారమని అర్థము. కాబట్టి, కీర్తనలు 46:1వ వచనములో చూచినట్లయితే, "దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు'' అని దావీదు తెలియజేయుచున్నాడు. ఇంకను కీర్తనలు 46:2,3వ వచనములలో చూచినట్లయితే, " కావున భూమి మార్పునొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము, దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు''అని దావీదు చెప్పుచున్నాడు. ఆలాగుననే, మన పరిసరాలలో అనేక కార్యములు జరుగుచుండవచ్చును కానీ, దేవుడు మన మధ్యన ఉండి ఉన్నాడు. ఇంకను దావీదు ఏమంటున్నాడంటే, "సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను'' (కీర్తనలు 16:8) ప్రకారము అవును నా ప్రియ స్నేహితులారా, బీదవారముగాను మరియు అక్కర్లలలో ఉన్నవారముగా ఉన్నట్లుగా మనము భావించుకోవచ్చును. కానీ, ప్రభువు మన గురించి యోచిస్తూ, నేడు మన మధ్యలో ఆయన ఉండి ఉన్నాడు. మన పరిసరాలలో తుఫానులు, సమస్యలు ఉండవచ్చును. లోకమంతయు మనలను గురించి మరచిపోయి ఉండవచ్చును. కానీ ప్రభువైతే, మనలను గురించి యోచించుకొనుచున్నాడు. అదియు కూడా తన యెడల దీనమనస్సు గలవారిని గురించి ఆయన ఆలోచన చేయుచున్నాడు. మన వైపు నుండి పొరపాట్లు జరిగియున్నప్పుడు కూడా మనలను మనము తగ్గించుకొని, ఆయన సన్నిధి కొరకై మనము ఆయనకు మొఱ్ఱపెట్టినట్లయితే, అట్టి దీనమనస్సుగల మనలను గురించి ప్రభువు యోచించువాడై యున్నాడు. కాబట్టి, మీరు చింతించకండి.

నా ప్రియులారా, యోబు యొక్క జీవితమును చూడండి, అతడు చాలా ఐశ్వర్యవంతుడుగా ఉన్నప్పుడు, లోకము అతనిని గురించి ఎంతగానో యోచించినది మరియు ఎంతగానో గౌరవించినది. కానీ, అతడు లోకములో ఉన్న సమస్తమును కోల్పోయినప్పుడు, సన్నిహితులైన స్నేహితులు కూడ అతని మీద నిందారోపణ చేసియున్నారు. అయినప్పటికిని యోబు ఏ మాత్రము కూడ చంచలత్వము కలిగియుండలేదు. ఎందుకనగా, తన సమస్యలలో కూడా దేవుడు తనతో ఉన్నాడన్న మానసిక స్థైర్యము అతను కలిగియున్నాడు. యోబు గ్రంథము 7:17,18లో ఏమంటున్నాడంటే, " మనుష్యుడు ఏపాటివాడు? అతని ఘనపరచనేల? అతని మీద నీవు మనస్సు నిలుపనేల? ప్రతి పగలు నీవతని దర్శింపనేల? ప్రతి క్షణమున నీవతని శోధింపనేల?'' అని అంటున్నాడు. చూడండి, ప్రభువు మనలను గురించి ఏ విధంగా తలంచుకొనుచున్నాడో కదా! ప్రతి ఉదయకాలమున, ప్రతి క్షణమున ఆయన మనలను గురించి ఆలోచించుచున్నాడు. ప్రభువు తనను గురించి, ప్రతి క్షణము తలంచుకొనుచున్నాడన్న మానసిక స్థైర్యమును యోబు కలిగి ఉండడము ద్వారా, దేవుడు అతనిని రెండింతలుగా ఆశీర్వదించాడు. అతడు కోల్పోయిన సమస్తమును రెండంతలుగా తిరిగి పొందుకొనునట్లు చేస్తాడు.

నా ప్రియులారా, నేడు 'ప్రభువు నా గురించి ఏమైనా ఆలోచించుచున్నాడా? లేక తలంచుచున్నాడా?' అని మీరు అనుకొనవచ్చును. దూర ప్రాంతము నుండి మీరు ఈ సందేశమును చదువుచుండవచ్చును. కానీ, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మీ గురించి ఆలోచన చేయుచున్నాడా? దూర ప్రాంతములో మీరు ఉండి ఉండవచ్చును. కానీ, నా స్నేహితులారా, ప్రభువు మీ గురించి యోచించుకొనుచున్నాడు. నేడు మీరు ఎక్కడ ఉండి ఉన్నప్పటికిని, దేవుడు మిమ్మును ఎరిగి యున్నాడు. మీరు ఎటువంటి సమస్య గుండా వెళ్లుచున్నప్పటికిని దేవుడు మిమ్మును తలంచుచున్నాడు. ఆదికాండము 32:10లో కూడ ఈలాగున చెబుతుంది, "నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యా యొర్దాను దాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని'' ఈ వచనములో యాకోబు ఏమని తెలియజేయుచున్నాడు. అవును, రెండింతలుగా మిమ్మును ఆశీర్వదించుట కొరకే ఆయన మీ నిమిత్తము యోచన చేయుచున్నాడు. ఈ రోజున మీ చేతిలో ఏమియు కూడా కలిగి ఉండలేకపోవచ్చును కానీ, అయినప్పటికిని, రెండింతలుగా మిమ్మును దీవించు నిమిత్తము ప్రభువు మీ గురించి తలంచుచున్నాడు. ఆయన తలంపులు మన తలంపుల కంటె ఉన్నతమైనవిగా ఉన్నాయి. అవును ప్రియ స్నేహితులారా, ఈ రోజున మీ జీవితములో కూడ రెండింతల దైవాశీర్వాదములను ఎదురు చూడండి, దేవుడు ఎల్లప్పుడు మీ గురించి తలంచుచున్నాడని ఎప్పటికిని కూడ జ్ఞాపకము చేసుకొనుచు ఉండండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, రెండింతలుగా మమ్మును ఆశీర్వదించుటకు నీ యొక్క బలమైన హస్తం మా మీదికి దిగివచ్చునట్లు చేయుము. దేవా, మా జీవితములో మేము పొందుకున్న అవమానమునంతటికి ప్రతిగా రెండింతల ఘనతను రెండింతల ఖ్యాతిని మరియు ఆశీర్వాదమును మాకు నీవు అనుగ్రహించుము. దేవా, నేడే మా అవమానమునంతటిని రెండింతలుగా ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా మార్పు చేయుము. యేసయ్యా, మా శాపములను నీవు ఆశీర్వాదముగా మార్చుము. సకల ఆశీర్వాదములు మా మీదికి రెండింతలుగా దిగివచ్చునట్లుగా చేయుము. దేవా, మమ్మును నీతిమంతులనుగా మార్చి, మా నీతికి తగిన ప్రతిఫలమును, ఆశీర్వాదమును మాకు అనుగ్రహించుము. దేవా, నీ హస్తము ఇప్పుడే మా మీదికి దిగివచ్చునట్లు చేయుము. ప్రభువా, నీ మంచితనాన్ని రెట్టింపు స్థాయిలో అనుభవించడానికి మాకు అటువంటి గొప్ప ధన్యతను దయచేయుము. దేవా, మా జీవితంలో పని చేస్తున్న నీ గొప్పతనాన్ని మరియు ఆశీర్వాదాలను మా చుట్టూ ఉన్నవారు చూసి నీ వైపు తిరుగునట్లు చేయుము. ప్రభువా, నీ ఆశీర్వాదాలను మా మీద కుమ్మరించుటకు నిత్యము మమ్మును జ్ఞాపకము చేసుకొనుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.