నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 14:18వ వచనములో చెప్పబడినట్లుగా మన ప్రభువు నేడు మీతో మాట్లాడుచున్నాడు. ఆ వచనము, 'మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును...' అవును, ప్రభువు, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. ప్రభువైన యేసు మరియు పరిశుద్ధాత్మ ఒక్కడే.

శిష్యులు యేసుతో మూడు సంవత్సరాలు గడిపి, ఆయనతో పాటు పరిచర్య చేసిన తర్వాత, సువార్త ప్రకటించడానికి ఆయన వారికి అధికారమునిచ్చాడు. రోగులను స్వస్థపరిచే అధికారాన్ని, దయ్యాలను వెళ్లగొట్టే అధికారాన్ని వారికి ఇచ్చాడు. దేవుని రాజ్యాన్ని గురించి యేసు వారికి ఎన్నో విషయాలను బోధించాడు మరియు ఆయనతో వారి సహవాసము లోతుగా వేరుపారి యున్నది. ప్రత్యేకించి, ఆయన తన మరణం మరియు పునరుత్థానాన్ని వివరించడం ప్రారంభించినప్పుడు, యేసు నుండి విడిపోవాలనే తలంపు వారికి భరించలేనంతగా బాధను కలిగించినది. అంతమాత్రమే కాదు, వారు ఆయనతో సహవాసము మరియు సన్నిధిని కోల్పోతారని గుర్తించి, వారు ఎంతగానో దుఃఖించారు. అయితే, యేసు వారి హృదయాలను గుర్తెరిగి, "నేను మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును''అని వారితో చెప్పి వారిని ఆదరించాడు.

కొంతకాలం తర్వాత, యేసు తన ఎడబాటు అనగా, వారిని విడిచి వెళ్లడం నిజానికి వారి మేలు కొరకు అని వివరించాడు. అందుకే యోహాను 16:7వ వచనములో ఆయన ఇలాగున సెలవిచ్చాడు, " అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుట వలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు; నేను వెళ్ళిన యెడల ఆయనను మీ యొద్దకు పంపుదును'' అని చెప్పాడు. అవును, యేసు తాను వారిని విడిచి వెళ్లిపోవుట ప్రయోజనమని వారికి స్పష్టముగా తెలియజేశాడు. ఎందుకంటే, అప్పుడు మాత్రమే ఆయన వారి వద్దకు తిరిగి వచ్చి, ఆయన వారి మధ్య నూతనమైన మరియు శక్తివంతమైన మార్గంలో జీవించగలడు.

అందుకే అపొస్తలుల కార్యములు 17:28లో బైబిల్‌లో చెప్పినట్లుగానే," మనమాయన యందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలె మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు'' ప్రకారం మనము ఆయన యందు బ్రదుకుచున్నాము గనుకనే, మనము ఆయన సంతానమని చెప్పబడియున్నది. ఆలాగుననే, మన హృదయాలను నింపుచున్న దేవుని యొక్క సంపూర్ణతను మనం అనుభవించినప్పుడు, మనం ఇకపై అనాథలుగా భావించలేము. అందుకే, అపొస్తలుల కార్యములు 2:28లో, ఇది ఇలాగు చెబుతుంది, " నాకు జీవ మార్గములు తెలిపితివి నీ దర్శన మనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు'' అని చెప్పబడినట్లుగానే, ఆయన వెళ్లుట ద్వారా మనకు జీవమార్గములను తెలియజేశాడు. కాబట్టి, ప్రియమైన స్నేహితులారా, నేడు మీరు ' నేను అనాథను' అని మరల ఎప్పుడు కూడా తలంచకండి లేదా ఎవరితోను చెప్పకండి. దేవుడు మీతోనే ఉన్నాడు. కనుకనే, ధైర్యంగా ఉండండి.

అదేవిధంగా, నా జీవితంలో జరిగిన ఒక సంఘటన నేను మీతో పంచుకోవాలని కోరుచున్నాను. నేను నా తల్లిదండ్రులను పోగొట్టుకున్నప్పుడు, నేను అనాథనని తరచుగా ప్రజలకు తెలియజేస్తాను. కానీ ఒకరోజు, నా భర్త నాకు సలహా ఇస్తూ, 'ఇవాంజెలిన్, నువ్వు ఇకపై అనాథవి కావు. ఈ లోకంలో మనం అనాథలం కాదు. యేసు నీలో ఉన్నాడు, ఇవాంజెలిన్. పరిశుద్ధాత్మ యొక్క వరములు నీలో నింపబడియున్నాయి మరియు ప్రభువు నిన్ను తన పరిచర్యలో శక్తివంతంగా ఉపయోగించుచున్నాడు. మీ జీవితంలో దేవుని సన్నిధిని నీవు ఎప్పుడు కూడా అనుభవించలేదా?' అని ప్రశ్నించారు. ఆ మాటలు విన్నాక నేను అనాథనని చెప్పడం మానేశాను. చూడండి మన దేవుడు ఎంత గొప్పవాడు కదా!

ఆలాగుననే, నా ప్రియులారా, ఈరోజు దీనిని చదువుచున్న మీరు ఒకవేళ మీ తల్లిదండ్రులను మరియు మీ ప్రియులను కోల్పోయి మీరు అనాథలుగా భావించుచున్నారేమో? మీకు, మీరు కూడా అనాథలా తలంచుకుంటూ, అందరితో చెప్పుకుంటున్నారేమో? మీరు అలాంటి మాటలు చెప్పినప్పుడు, ఒంటరితనం మిమ్మల్ని బాధపెడుతుంది. కానీ, ప్రియమైన స్నేహితులారా, మిమ్మును మీరు ఎప్పుడూ అనాథగా భావించకండి. ఈరోజు దేవునికి మొఱ్ఱపెట్టండి, ఆయన వచ్చి మీలో నివసిస్తాడు. ఆయన మీ మధ్యలో నివసిస్తాడు, తన సన్నిధిని మరియు ఆయన ఆనందంతో మిమ్మల్ని నింపుతాడు. బైబిల్‌లోని ఒక లేఖన భాగములో ప్రభువు ఇలాగున చెప్పుచున్నాడు, "దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు; ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును.'' కనుకనే, మీరు ఎప్పుడు కూడా ఒంటరిగా భావించవద్దు, ప్రియమైన స్నేహితులారా. ఒకవేళ మీలో అలాంటి తలంపు ఉండినట్లయితే, ఈరోజు మీరు ప్రభువుకు ప్రార్థించండి, ఈరోజు ప్రభువు మీ దగ్గరకు వస్తాడు. బహుశా! మీరు అభిషేకం కోల్పోయినట్లు మీకు అనిపించవచ్చును, కానీ ధైర్యంగా ఉండండి-ఈరోజు, ప్రభువు దానిని మీ జీవితంలో పునరుద్ధరిస్తాడు. ప్రభువుకు చేయుచున్న పరిచర్యలో మీరు పోగొట్టుకున్నారని మీరు భావించిన ప్రతి పరిశుద్ధాత్మ వరములను, ప్రతి అభిషేకం మీకు తిరిగి అనుగ్రహింపబడుతుంది. ప్రియ స్నేహితులారా, ప్రభువు మీ దగ్గరకు తిరిగి వస్తున్నాడు. మీరు అనాథలు కారు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును అనాథగా విడువకుండా, మీతో మరియు మీలో నివసించి, మిమ్మును దీవించును గాక.

ప్రార్ధన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, ఈరోజు మేము నీ సన్నిధికి వచ్చుచున్నప్పుడు, నీ వాక్యం మా జీవితంలో నెరవేరాలని మేము అడుగుచున్నాము. యేసయ్యా, దయచేసి మమ్మును అనాథగా విడిచిపెట్టకుండా, నీ శక్తి మరియు సన్నిధితో మమ్మును నింపుము. యేసయ్యా, నీవు నీ శిష్యులను బలపరచినట్లుగానే, దహించే అగ్నివలె నీ అభిషేకమును మా మీద కుమ్మరించుము. దేవా, నీ సంతోషగానములతో మా హృదయాన్ని నింపి, నీ సన్నిధి మాలో నివసింపజేయుము. ప్రభువా, నీవు వాగ్దానం చేసినట్లుగానే, నీవు మా వద్దకు తిరిగి వచ్చి మమ్మును మరల నీ అభిషేకముతోను, పరిశుద్ధాత్మ శక్తితోను మరియు నీ వరములతోను నింపుము. దేవా, నీ యొక్క విలువైన ఆశీర్వాదాలతో మమ్మును కప్పి, బలపరచుము. తద్వారా మేము ఇకపై ఒంటరిగాను లేదా విఫలమైనట్లుగా అనాథలుగా తలంచకుండా, ఎల్లప్పుడు నీవు మాతోను మరియు మా మధ్యలో నివసించుచున్నావని భావించునట్లుగా, పరిశుద్ధాత్మ శక్తి, మా మీదికి దిగివచ్చునట్లుగా చేసి, నీ యందు నింపబడే విశ్వాసం, ఆనందం మరియు ప్రేమతో నిండిన నూతనమైన వారినిగా మమ్మును మార్చుము. ప్రభువా, నీవు మాతో నడిచినందుకు మరియు మేము చేయు ప్రతి పనిలో మమ్మును విజయవంతులనుగా చేసి మమ్మును ఆశీర్వాదములతో నింపుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.