నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 60:15వ వచనమును మనము ధ్యానించుకుందాము. ఆ వచనములో, " నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడును నీ మార్గమున దాటిపోవుట లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహు తరములకు సంతోషకారణముగాను చేసెదను.'' అవును, ఇది ఎంతటి చక్కటి వాగ్దానము కదా! నా ప్రియులారా, నేడు ప్రపంచము మిమ్మును తిరస్కరించినదని మీరు చింతించుచున్నారా? మీరు ఎందుకు పనికిరారు, మీ స్నేహితులు లేక మీ కుటుంబ సభ్యులు అంటున్నారేమో? మీకు ఎటువంటి భవిష్యత్తు లేదు. కానీ, ప్రియమైన స్నేహితులారా, ప్రభువు మిమ్మును తరతరములకు శోభాతిశయముగాను మరియు సంతోషకారణముగా మిమ్మును చేస్తాడు. ఇదే విధముగా రాహాబు జీవితములో జరిగినది. యెహోషువ 2వ అధ్యాయములో చూచినట్లయితే, రాహాబు ఒక వేశ్యగా ఉండెను. తనకు చుట్టు ఉన్న ప్రజలు తనను తిరస్కరించి ఉండవచ్చును. తనకు అనేకమైన పేర్లు పెట్టి ఉండవచ్చును. నీవు ఎందుకు పనికి రావు అన్నారు. కానీ, ఇశ్రాయేలీయుల వేగుల వారికి సహాయము చేసినందుకు మరియు దేవుని ప్రజలను కాపాడినందుకు మరియు వారికి సహాయము చేసినందుకై ప్రభువు తనను జ్ఞాపకము ఉంచుకున్నాడు. కాబట్టి, యేసు క్రీస్తు వంశావళిలో తన పేరును కూడా వ్రాయబడియున్నది. బహుతరములకు సంతోషకారణముగాను, శోభాతిశయముగా తన పేరు మారినది. అవును, స్నేహితులారా, ఆమె దేవుని బిడ్డలకు సహాయము చేసినది. కనుకనే, దేవుడు తనను ఎంచుకున్నాడు. ఆమెకు ఈ లోకములో ఒక స్థానమును ఇచ్చాడు. మీరు కూడా లోకములో తిరస్కరించబడియున్నారేమో? కానీ, ఆయన యందు నమ్మకముంచుచున్నారు గనుకనే, ప్రభువు మిమ్మును బహుతరములకు శోభాతిశయముగాను మరియు సంతోషకారణముగాను చేస్తాడు.

ఉత్తమ్ కుమార్ నాయక్ ఒక సహోదరుని జీవితములో అదే జరిగినది. కందమాల్ నుండి తన సాక్ష్యాన్ని ఈలాగున మాతో పంచుకున్నారు. అతడు యౌవనస్థునిగా ఉన్నప్పుడు తనకు యేసుక్రీస్తును గురించి ఏమియు కూడా తెలియదు. 1990 వ సంవత్సరములో ఎవరో తన కుటుంబానికి వ్యతిరేకముగా చేతబడి చేశారు. అందువలన కుటుంబములో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. తను కూడా ఎంతో అనారోగ్యమునకు గురియయ్యాడు. అందువలన భువనేశ్వర్ నగరమునకు పారిపోయాడు. అక్కడ ఒక దైవజనుని కలిసి, తన అనారోగ్యము నుండి స్వస్థత కొరకు ప్రార్థించమని కోరాడు. తద్వారా, తన అనారోగ్యమును నుండి అతడు విడిపింపబడి, ఆ అద్భుతమును బట్టి యేసయ్యకు, తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. అతడు సంపూర్ణంగా బాగుపడిన తర్వాత, తాను తన ఊరికి వెళ్లి, ఒక వ్యాపారమును ప్రారంభించాడు. అతడు వివాహము చేసుకొని, నలుగురు బిడ్డలకు జన్మనిచ్చాడు. 5 సంవత్సరముల తర్వాత, 1995వ సంవత్సరములో ఒక వ్యక్తి అతనికి యేసు పిలుచుచున్నాడు పత్రికను ఇచ్చాడు. అందులో ఉన్నటు వంటి సాక్ష్యములను, వర్తమానములన్నిటిని చదివి అతనికి కూడా దేవుని సేవ చేయాలని ఆశ అతనిలో కలిగినది. అదే సంవత్సరము సహోదరులు డి.జి.యస్ దినకరన్‌గారు దేవుని చిత్తమును తెలియపరచమంటూ ఒక ఉత్తరమును వ్రాశాడు. దేవుని యొద్ద వేచి ఉండి, ప్రార్థించమని తిరిగి వారము రోజులలో ఉత్తరమును పొందుకున్నాడు. పరిచర్య కొరకు నీకు మార్గములు తెరువబడతాయి. 1998వ సంవత్సరములో ప్రభువు మాట్లాడినప్పుడు అతడు సంపూర్ణ పరిచర్యలోనికి వచ్చాడు. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికిని ప్రభువు సేవలో అతడు ముందుకు కొనసాగాడు. 2008వ సంవత్సరములో అతని ఊరిలో భయంకరమైన అల్లరులు జరిగాయి. అనేకులు చంపబడ్డారు, అనేకులు గృహాలు తీసుకొనవేయబడ్డాయి. అతడు కూడా ఉన్నదంతయు కోల్పోయాడు. అతడు మరల తిరిగి ఏదో ఒక విధముగా భువనేశ్వరక్ తప్పించుకొని వెళ్లిపోయాడు. నివసించడానికి ఏ స్థలము కూడా లేదు. అతడు మరియు తన కుటుంబము వీధులలో ఉంటున్నారు. 2009వ సంవత్సరములో ఒక పాష్టరుగారు తన యింటిలో ఉండమని అతనిని ఆహ్వానించా రు. అతడు అక్కడ నివసించుచున్నప్పుడు, రాంచీ ప్రార్థనా పండుగలను గూర్చి విని, డాక్టర్. పాల్ దినకరన్‌గారు ప్రార్థించడానికి అక్కడికి రాబోవుచున్నారని తెలుసుకొన్నాడు. అతడు ఆ కూటములలో పాల్గొని ఎంతో నిరీక్షణతో ప్రార్థించాడు. ప్రార్థనా సమయములో ఆకస్మాత్తుగా పాల్ దినకరన్‌గారు ఇలాగు అన్నారు, 'ఇక్కడ ఒక మనుష్యుని నేను చూస్తున్నాను, నీవు అంతా కోల్పోయి ఉన్నావు, ప్రభువు నీకు ఒక గృహాన్ని ఇస్తున్నాడు, ప్రభువు నిన్ను మరల కట్టబోవుచున్నాడు,' అన్న ప్రచవనము తన కొరకు అని అతడు గుర్తించాడు.

అదే కూటము ముగించిన సమయములో డాక్టర్. పాల్ దినకరన్‌గారిని వ్యక్తిగతంగా కలిసినప్పుడు, మా నాన్నగారు అతని మీద చేతులుంచి, ఆ సహోదరుని కొరకు ఎంతో భారముతో ప్రార్థించారు. వెంటనే ఒక గొప్ప అద్భుతము జరిగినది, తను నివాసముంటున్న పాస్టరుగారి యొక్క తల్లి తనకి స్వంత గృహము కొనుటకొరకై చాలా ధనమును ఇచ్చారు. ఆ సంఘటన చూచి అతడు నమ్మలేకపోయాడు. అతడు తన స్వంత ఊరికి వెళ్లి, ఒక గృహమును స్వంతగా కొనుకొన్నాడు. ఏలాగనగా, 'డాక్టర్. పాల్ దినకరన్‌గారు చెప్పిన ప్రవచనము ఎంతో త్వరగా నెరవేరినది' అన్నాడు. ఆలాగుననే, అతడు అతి త్వరలోనే ఒక గృహమును కొనుకొన్నాడు. 15 సంవత్సరాలుగా ఆ గృహములోనే అతడు ఉంటున్నాడు, ప్రభువు సేవలో అతను కొనసాగుచున్నాడు. తను మాత్రమే కాదు, 2016వ సంవత్సరములో భువనేశ్వర్‌లో ఒక సంఘమును స్థాపించాడు. ఇప్పుడు అక్కడ 200 మందికంటె ఎక్కువమంది దేవుని సేవించుచున్నారు. అతడు మాత్రమే కాదు, తన కుటుంబమంతయు దేవుని సేవించుచున్నారు. ఎన్నో కూటములను అక్కడ నిర్వహించుచున్నాడు. అనేక మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్థులు స్వస్థతను పొందుకుంటున్నారు. అనేక సంవత్సరాలుగా పిల్లలు లేనటువంటి వారు అతని పరిచర్య ద్వారా గర్భఫలము అనే దీవెనను పొందుకుంటున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. అవును, కుటుంబమగా దేవుని సేవించడం ఎంత గొప్ప ధన్యతగా ఉంటుంది కదా!

నా ప్రియ స్నేహితులారా, ఆలాగుననే, మీరు ఒకవేళ, 'నాకు ఎటువంటి నిరీక్షణ లేదు, నేను చేతబడి శక్తుల ద్వారా బంధింపబడియున్నాను, నేను నా ఉద్యోగమును మరియు గృహమును కోల్పోయాను, అనేక ఆర్థిక ఇబ్బందులతో నేను సతమతమవుచున్నాను అని మీరు అంటున్నారేమో?' కానీ, నా ప్రియులారా, మీ జీవితములో యేసయ్యను కలిగి ఉన్నప్పుడు, పూర్ణ హృదయముతో ఆయనను సేవించడానికి మిమ్మును మీరు సమర్పించుకున్నప్పుడు, ప్రభువు మిమ్మును దీవించి, తరతరములకు శోభాతిశయముగా మిమ్మును చేస్తాడు. ఇప్పుడు ఈ సహోదరుడు మాత్రమే దేవుని సేవించడము కాదు కానీ, తన నలుగురు బిడ్డలు ప్రభువును సేవించుచున్నారు. తరతరములు దీవించబడుచున్నవి. యేసయ్య, ప్రేమను వారు పొందుకొని, అనుభూతి చెందుచున్నారు.

కాబట్టి, నా ప్రియులారా, ప్రభువు యొద్ద వేచి ఉండండి, ఆయనను మీ జీవితములోనికి ఆహ్వానించండి, మీ పూర్ణ హృదయముతో ఆయనను సేవిం చండి, మీ ఉద్యోగముతో పాటు దేవునికి సేవ చేయండి. మీ కుటుంబ బాధ్యతలన్నియు నెరవేరుస్తూ ఆయనకు సేవ చేయండి, మీ చుట్టు ఉన్న ప్రజలకు యేసు నామములో పరిచర్య చేయండి. అప్పుడు ప్రభువు మిమ్మును శోభాతిశయముగాను, తరతరములకు సంతోషకారణముగా చేస్తాడు. ఇంకను మీ పిల్లలపైన, మీ పిల్లల పిల్లలపైన మరియు వారి పిల్లలపైన కూడా ఈ ఆశీర్వాదము కొనసాగుతుంది. దినకరన్ కుటుంబముగా నేడు మేము ఆలాగున దీవించబడ్డాము. ప్రభువు మీ కొరకు కూడా ఆలాగున చేయబోవుచున్నాడు. అవును, నా ప్రియులారా, నేడు మనలను కూడా శోభాతిశయముగాను, తరతరములకు సంతోషకారణముగా చేస్తున్నందుకై ప్రభువునకు వందనాలు చెల్లిద్దాము. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపాకనికరము కలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా,ఈ లోకం మమ్మును తిరస్కరించి, నిరాశులనుగా ముద్ర వేసినా, మేము నీ శాశ్వతమైన ప్రేమ మరియు విశ్వాసాన్ని నమ్ముచున్నాము. ప్రభువా, నీవు రాహాబును తిరస్కరణ నుండి ఘనతకు హెచ్చించినట్లుగానే, నీవు మమ్మును ఎన్నుకున్నావని మరియు నీ ప్రణాళికలో మాకు ప్రత్యేక స్థానం ఇచ్చావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, నిన్ను సేవించాలని తీర్మానించుకున్న మమ్మును నేటి నుండి నీ సేవలో వాడుకొనుము. దేవా, నిన్ను పూర్ణ హృదయముతో సేవించాలని తలంచిన మా హృదయాలలో నీవు మాతో ఉండి మమ్మును నీ పరిశుద్ధాత్మశక్తితో నింపి, మమ్మును నడిపించుము. దేవా, మమ్మును శాశ్వాత శోభాతిశయమును మరియు సంతోషకారణముగా మార్చుము. ప్రభువా, మా పిల్లలను, మరియు బహురతములపై నీవు కుమ్మరించు దీవెనలను మేము చూచునట్లుగా మాకు దీర్ఘాష్షును దయచేయుము. దేవా, మా పిల్లలను పిల్లలను దీవించుము. దేవా, మా తరములన్నియు శోభాతిశయముగా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, నేడు మా అవసరతలన్నియు తీర్చి, గృహమును , స్వస్థతను, సంతానము, ఇంకను సమస్తమును మాకు దయచేయుము. ప్రభువా, మా పోరాటాలన్నింటిని నీ చేతులలోనికి అప్పగించుచున్నాము. దేవా, మా జీవిత సవాళ్ల మధ్య కూడా మిమ్మును హృదయపూర్వకంగా సేవించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ ఆశీర్వాదాలు మాపై, మా ఇంటిపై, మా పిల్లలపై మరియు రాబోయే తరాల వారిపై ప్రవహించునట్లు చేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.